2018లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వింధ్యారాణి
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు.. అలాంటి అన్నం, కూరలను వృథాగా పారవేసే వారి వద్దకు వెళ్లి.. ఆ ఆహారపదార్థాలను సేకరించి, ఆకలితో అలమటించే అభాగ్యులకు అందిస్తూ.. వారి ఆకలి తీర్చుతోంది సిరిసిల్లకు చెందిన ధరణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వింధ్యారాణి. చేసేది చిరుద్యోగమైనా, మంచి మనసున్న మారాణి వింధ్యారాణి సిరిసిల్లలోని పేదవర్గాలకు విందు భోజనాన్ని వడ్డించే అక్షయపాత్ర అయింది..
బట్టల సేకరణతో శ్రీకారం...
సిరిసిల్లలో 2004లో ‘ధరణి’ స్వచ్ఛంద సంస్థను వింధ్యారాణి మరి కొందరితో కలిసి ప్రారంభించారు. సామాజికంగా సేవ చేసేందుకు ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో పెద్ద బాక్స్(అట్టపెట్టె)ను ఏర్పాటు చేసి మీ పిల్లలకు సరిపోని(పట్టని) డ్రెస్‌లను ఈ డబ్బాలో వేయండి.. ఆ దుస్తులను పేద పిల్లలకు మేం అందిస్తామని బోర్డు ఏర్పాటు చేశారు. ధరణి సంస్థ ఏర్పాటు చేసిన ఈ డబ్బాలో చాలామంది కొత్త కొత్త డ్రెస్‌లను వేశారు. మంచి మంచి చీరలను మహిళలు స్వచ్ఛందంగా వేశారు. ఇలా వచ్చిన బట్టలను సిరిసిల్ల కార్మికవాడల్లో నిరుపేదలకు పంపిణీ చేశారు. 300 మంది పిల్లలకు డ్రెస్‌లు, మరో 120 మంది మహిళలకు చీరలు అందించారు. బట్టలు పాతవే కావచ్చు. కానీ ఎంతోమందికి అవి కొత్తబట్టలయ్యాయి. అలా ఒక చిన్న ఐడియాతో పేదలకు బట్టలు అందించింది ధరణి సంస్థ. రైస్ బకెట్ పేరుతో సిరిసిల్ల పట్టణంలోని భావనారుషి నగర్‌లోని ఇళ్ల నుంచి బియ్యం సేకరించారు. పది కిలోల చొప్పున 50 కుటుంబాలకు బియ్యం అందించి పేదల ఆకలి తీర్చారు. ఇలా అట్టడుగున ఉన్న నిరుపేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ.. ధరణి సంస్థ ముందుకు సాగుతోంది. 15ఏళ్లుగా సిరిసిల్లలో ధరణి సంస్థ మానవీయ కోణంలో సాయం అందింది.
భోజనం మిగులు.. లేదు దిగులు...
ఊరిలో ఏ ఫంక్షన్‌లో ఆహారం మిగిలినా ‘ధరణి’ సంస్థకు ఫోన్ వస్తుంది. సమాచారం అందగానే పరుగున వెళ్లి ప్రత్యేక పాత్రల్లో సేకరించడం.. ఆటోలో తీసుకెళ్లి కార్మికవాడల్లోని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. శుభకార్యాల్లో మిగిలిన ఆ అన్నం, ఆ కూరలను తీసుకెళ్లి కార్మికవాడల్లో పంపిణీ చేయడం పెద్ద శ్రమతో కూడిన పని అయినా నాలుగేళ్లుగా 30 వేల మందికి విందుభోజనాలు అందించిన ఘనత ధరణి సంస్థది. ఇటీవల విందుభోజనాన్ని అడవుల్లో ఆకలితో అలమటించే వన్యప్రాణులకు సైతం అందించారు. గంభీరావుపేట మండలం గోరింటాల అడవుల్లో కోతులకు ఆహారాన్ని అందించడం విశేషం.
ఆర్డీవో భిక్షానాయక్ ప్రేరణ...
2015లో సిరిసిల్ల ఆర్డీవోగా పని చేసిన భిక్షానాయక్ ఆలోచనకు ధరణి సంస్థ ఆచరణ రూపమిచ్చింది. సిరిసిల్లలోని ఫంక్షన్ హాల్స్‌లో ధరణి సంస్థ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఏ ఫంక్షన్‌లో ఆహారం మిగిలినా అది పేదల కడుపు నింపేందుకు ఈ సంస్థ శ్రమిస్తుంది. అయిన వారి ఆదరణకు దూరమైన వృద్ధులకు దుస్తులు అందిస్తూ.. స్వీట్లు పంపిణీ చేస్తూ.. ఆసరాగా ఉంటుంది ధరణి సంస్థ. మహిళా దినోత్సవం, హరితహారం, ఎయిడ్స్ బాధిత పిల్లలకు సాయం చేయడంలోనూ ముందుంది. ఓ మహిళ నాయకత్వంలో ధరణి సంస్థ పేదల సేవలో ముందుకెళ్లడం విశేషం. సిరిసిల్లలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసే వింధ్యారాణి ధరణి సంస్థ ద్వారా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2018 జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అప్పటి రాష్ట్రమంత్రి కేటీఆర్, అప్పటి జిల్లాకలెక్టర్ కృష్ణభాస్కర్ చేతుల మీదుగా రూ.51,000 నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వింధ్యారాణిని అభినందించారు. నగదు పురస్కారంగా వచ్చిన ఆ మొత్తంతో ఆటోను కొనుగోలు చేసి ధరణి సంస్థ సేవలను విస్తరించేందుకు వినియోగించడం విశేషం. జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో నిరుపేదల సేవలో ముందుకు సాగుతున్న ‘ధరణి’ సంస్థ మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఆశిద్దాం.
– వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల
పేదల కళ్లలో ఆనందం చూస్తున్న..
మా సంస్థ అందిస్తున్న సేవలు చిన్నవే అయినా.. పేదల కళ్లలో ఆనందం చూస్తున్న. అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. ధరణి సంస్థ నిర్వహణలో నా భర్త జయసింహారెడ్డి సహకరిస్తున్నారు. సంస్థలోని ఇతర సభ్యులు సమయం కేటాయిస్తున్నారు. దీంతో బాగా పని చేయగలుగుతున్నాం.
– కె. వింధ్యారాణి, సంస్థ అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment