చందంపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భట్టి పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా భట్టి.. రైతులు, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చందంపేట మండలంలోని గన్నెర్లపల్లి గ్రామంలో కూలీలు పత్తి విత్తనాలు విత్తుతున్న సమయంలో ఆయన వారితో కలసి విత్తనాలు నాటారు. అనంతరం భట్టి ఇదే గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధరణి అనే పోర్టల్‌ను తీసుకొచ్చి.. కబ్జాలో ఉన్న రైతుల పేర్లు తీసేసి గతంలో ఎప్పుడో దొరలు, 70 ఏళ్ల క్రితం ఉన్న భూస్వాముల పేర్లు మళ్లీ ధరణి సాఫ్ట్‌వేర్‌లో చూపిస్తున్నారని, దీంతో 70 ఏళ్లుగా భూమి సేద్యం చేసుకుంటూ కాస్తులో ఉన్న రైతుల పేర్లు లేకుండా పోయాయని అన్నారు. ఫలితంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో మార్పులు చేస్తామని తాము మాట్లాడుతుంటే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ మతిభ్రమించి సన్నాసులు.. అని మాట్లాడుతున్నారని, వారు ధరణితో ఎవరికి న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.
తాను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్న క్రమంలో ధరణి వల్ల భూములపై హక్కులను కోల్పోయిన రైతులు తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతుల సమస్యలపై స్పందించకుండా.. సన్నాసి యాత్రలు అంటూ తమపై విమర్శలు చేయడం తగదని, దీనిని వారి సభ్యత, సంస్కారాలకే వదిలేస్తున్నానని అన్నారు. తనకు సభ్యత, సంస్కారం ఉంది కాబట్టే కేసీఆర్‌గారు, కేటీఆర్‌గారు అని సంబోధిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన శాస్తి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ నేతల అవినీతి బాగోతం బట్టబయలు అవుతుందన్నారు. మంత్రి కేటీఆర్ బహుళ జాతి కంపెనీలకు దళారీగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
1,000 కిలోమీటర్లకు చేరిన భట్టి యాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర శుక్రవారం రాత్రి నల్లగొండ జిల్లా దేవరకొండకు చేరుకుంది. దీంతో ఆయన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం దేవరకొండ పట్టణంలోని డిండి చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment