సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిందనే వార్తలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడుతుంటే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీ వంటి అంశాల మీద ముఖ్యమంత్రికాని వ్యక్తి సీఎం హోదాలో సమీక్ష జరపడం దేశచరిత్రలో ఇదే తొలిసారి అని విమర్శించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సమయాలు, ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, శాంతిభద్రతల సమస్యలు వంటివి తలెత్తినప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే ఆయన డిజిగ్నేట్ చేసిన సీనియర్ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రికానీ రాజ్యాంగబద్ధంగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనప్పుడు సీఎం తనయుడు కేటీఆర్ ఏ హోదాలో, ఏ నిబంధనల ప్రకారం కేబినెట్ భేటీ నిర్వహించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
అనుమానాలకు తెరలేపారు..
కనీసం కేబినెట్ భేటీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నారా.. లేక ఆయన విదేశీ పర్యటనల్లో ఉన్నారా.. అనే చర్చ జరుగుతోందని భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశాలు జరిగే హాలులో మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ అడ్వైజర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌సహా ఉన్నతాధికారులను పిలిపించి కేటీఆర్ కేబినెట్ భేటీ పెట్టడం ద్వారా పాలనాపరమైన అనేక అనుమానాలకు తెరలేపారని అన్నారు. అసలు సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేబినెట్ భేటీలు, ప్రభుత్వ పాలన అంటే కేసీఆర్, కేటీఆర్ కుటుంబ వ్యవహారం కాదని, ఇది కోట్లాదిమంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయమని, దీనిపై సీఎం కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment