ప్రమాదంలో దంతాలు విరిగిపోయాయి...
నా వయసు 25 సంవత్సరాలు. ఇటీవల ఒక ప్రమాదంలో ముందు రెండు పళ్లు విరిగాయి. కొన్ని దంతాలు రంగుమారి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఒక పన్ను పూర్తిగా పోయింది. పాడైన దంతాల స్థానంలో కొత్త దంతాలను అమర్చవచ్చా? ఏ చికిత్స చేయించుకోవాలి?
- పి. వసంత లక్ష్మి, తణుకు
మీ దంతాలను సరిచేయడానికి, సాధారణమైన అసలైన దంతాల లాగే కనిపించేటట్లు చేయడానికి రకరకాల పద్ధతులున్నాయి. మీ సమస్యను సరిదిద్దడానికి రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్, డెంటల్ బాండింగ్ అనే రెండు రకాల కాంబినేషన్ ట్రీట్‌మెంట్ అవసరం అవుతుంది. డెంటల్ బాండింగ్ స్థానంలో క్యాప్, బ్రిడ్జి, ఇంప్లాంట్‌లలో ఏదో ఒక దానిని కూడా చేయవచ్చు. స్మైల్ మేకోవర్ లేదా స్మైల్ డిజైన్ ట్రీట్‌మెంట్ మీ సమస్యను పరిష్కరిస్తుంది.
ఇందులో దంతాల మధ్య ఖాళీలను డెంక్చర్, బ్రిడ్జి, ఇంప్లాంట్ పద్ధతుల్లో పూరిస్తారు. ఆ తర్వాత బ్లీచింగ్ ద్వారా దంతాలను తెల్లబరుస్తారు. విరిగిన దంతాలకు కాస్మెటిక్ ఫిల్లింగ్ ద్వారా పోర్సెలైన్ క్యాప్స్ లేదా పోర్సెలైన్ వెనీర్స్‌తో నింపుతారు. చిన్న చిన్న సందులను, ఎగుడుదిగుళ్లను, దంతాలు ఒకదాని మీద ఒకటి ఉండడాన్ని బ్రేసెస్ ద్వారా సరి చేస్తారు. చిగుళ్లకు చేసే గమ్మీ సర్జరీ కూడా స్మైల్ డిజైన్‌లో భాగమే. నల్లగా ఉన్న చిగుళ్లను ఈ చికిత్స ద్వారా ఆకర్షణీయంగా కనిపించేటట్టు చేస్తారు. ఈ విధానాలన్నీ స్మైల్ డిజైన్‌లోకి వస్తాయి.
మీరు నిపుణులైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోండి. మునుపటిలా ఆనందంగా జీవించండి.
- డాక్టర్ పార్థసారథి, దంతవైద్య నిపుణులు