గర్భిణులు నెగటివ్ బ్లడ్‌గ్రూప్‌తో, బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌తో ఉంటే సీరియస్ సమస్యలు వస్తాయా? నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చా? దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు.
– స్మిత, హైదరాబాద్
గర్భిణులు నెగెటివ్ గ్రూపుతో ఉంటే ‘ఆర్‌హెచ్ నెగెటివ్ ప్రెగ్నెన్సీ’ అంటారు. భర్తకి కూడా నెగెటివ్ గ్రూపు ఉంటే సమస్య ఏమీ ఉండదు. భర్తది పాజిటివ్ గ్రూపు ఉండి, బిడ్డది కూడా పాజిటివ్ గ్రూపు ఉంటే కొందరు పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యది నెగెటివ్, భర్తది పాజిటివ్ గ్రూప్ బ్లడ్ ఉన్నా, కొందరి బిడ్డల్లో నెగెటివ్ గ్రూపు వస్తుంది. దీనివల్ల కూడా సమస్యలేవీ ఉండవు. నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న గర్భిణుల్లో బిడ్డ పాజిటివ్ గ్రూపుతో ఉంటే, తల్లి రక్తంలోకి బిడ్డ పాజిటివ్ రక్తకణాలు ప్రవేశిస్తే, బిడ్డ రక్తకణాల మీద ఉన్న ఆర్‌హెచ్ యాంటీజెన్‌కు వ్యతిరేకంగా తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారవుతాయి. కొందరిలో కొన్ని రకాల పరిస్థితుల్లో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు చేరి, బిడ్డలో ఉన్న పాజిటివ్ రక్తకణాల మీద దాడిచేసి వాటిని మెల్లగా నశింపజేస్తాయి.
దీనివల్ల బిడ్డలో ఎర్ర రక్తకణాలు తగ్గిపోయి, బిడ్డలో కొన్నిసార్లు కడుపులోనే రక్తహీనత, పసిరికలు వంటివి ఏర్పడటం, బిడ్డకు శరీరమంతా నీరు చేరడం, కడుపులోనే చనిపోవడం, పుట్టిన తర్వాత బిడ్డలో రక్తహీనత, తీవ్రమైన పసిరకలు (జాండీస్) వంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మొదటగా గర్భ నిర్ధారణ తర్వాత తల్లి బ్లడ్‌గ్రూపు పాజిటివా, నెగెటివా తెలుసుకోవాలి. ఒకవేళ నెగెటివ్ గ్రూపయితే, భర్త గ్రూపు పాజిటివా, నెగెటివా నిర్ధారణ చేసుకోవాలి. భర్తది నెగెటివ్ గ్రూపు అయితే సమస్యలేవీ ఉండవు. భర్తది పాజిటివ్ గ్రూపయితే, బిడ్డకు పాజిటివ్ గ్రూపు రావచ్చు లేదా నెగెటివ్ గ్రూపు రావచ్చు. గర్భంలో ఉన్న బిడ్డ గ్రూపు ముందుగా తెలియదు కాబట్టి, ముందు జాగ్రత్తగా పాజిటివ్ అయితే వచ్చే సమస్యలను పరిగణనలోకి తీసుకుని, తల్లికి అవసరమైతే ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ (ఐసీటీ) మూడో నెలలోపు ఒకసారి, ఏడో నెలలో ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ఆర్‌హెచ్ యాంటీబాడీస్ ఏవైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు.
ఒకవేళ అవేమీ లేకపోతే, అంటే ఐసీటీ నెగెటివ్ వస్తే, ఏడో నెలలో తల్లికి ‘యాంటీ డీ’ అనే ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. సాధారణంగా ఏడో నెల నుంచి బిడ్డలోని పాజిటివ్ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఇంజెక్షన్‌లో ఉండే యాంటీబాడీస్ తల్లిలోకి ప్రవేశించే బిడ్డకు చెందిన పాజిటివ్ రక్తకణాలను నశింపజేస్తాయి. దాని ద్వారా తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కావు. కాబట్టి బిడ్డలో సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అలాగే నెగెటివ్ గ్రూపు తల్లులు గర్భంతో ఉన్నప్పుడు, మధ్యలో బ్లీడింగ్ అయినా, కడుపుకి దెబ్బ తగిలినా ఈ యాంటీ–డి ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. చాలావరకు మొదటిసారి గర్భం దాల్చిన వారిలో సమస్యలు పెద్దగా రావు. తర్వాతి కాన్పులలో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఒకవేళ తల్లిలో ఇండైరెక్ట్ కూంబ్ టెస్ట్ పాజిటివ్ వస్తే, అంటే తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయని అర్థం. అప్పుడు అవి ఎంత శాతం ఉన్నాయి, అవి బిడ్డ రక్తకణాలను నశింప చేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు, డాప్లర్ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిలో సమస్య కనిపిస్తే, సమస్య తీవ్రతను బట్టి గర్భంలోని శిశువులో ఎర్రరక్తకణాలు తగ్గిపోయి, రక్తహీనత ఏర్పడతున్నట్లయితే, తల్లి గర్భంలోకే రక్తం ఎక్కించడం జరుగుతుంది. అవసరమనుకుంటే త్వరగా కాన్పు చేయడం జరుగుతుంది. కాన్పు తర్వాత బిడ్డ బ్లడ్ గ్రూపు నిర్ధారణ చేసుకుని, పాజిటివ్ గ్రూపయితే, బిడ్డలో రక్తహీనత, జాండీస్ వంటి ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి సీబీపీ, డైరెక్ట్ కూంబ్ టెస్ట్, బైలురుబిన్ టెస్ట్ వంటి పరీక్షలు జరిపించి, నిర్ధారించుకోవాలి.
రక్తహీనత ఎక్కువగా ఉంటే, అవసరమైతే ఎక్స్‌చేంజ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది. జాండీస్ ఉంటే ‘ఫొటో థెరపీ’ అని బ్లూ లైట్ కింద పెట్టడం జరుగుతుంది. రెండో కాన్పులో బిడ్డకు ఈ సమస్యలు రాకుండా, కాన్పు అయిన 24 గంటల లోపు లేదా గరిష్టంగా 72 గంటల లోపల తల్లి ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. ఈ ఇంజెక్షన్ వల్ల కాన్పు సమయంలో తల్లిలోకి ప్రవేశించే బిడ్డ పాజిటివ్ రక్తకణాలను ఇంజెక్షన్‌లోని యాంటీబాడీస్ నశింపజేస్తాయి. కాబట్టి తల్లిలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు కాకుండా ఉంటాయి.
మళ్లీ గర్భం ధరించినప్పుడు తల్లిలో యాంటీబాడీస్ ఉండవు కాబట్టి, కడుపులోని బిడ్డపై దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందు గర్భాలలో అబార్షన్లు ఏవైనా అయి ఉంటే, ఆ సంగతిని గోప్యంగా ఉంచకుండా డాక్టర్‌కు తప్పనిసరిగా వివరించాలి. అబార్షన్ సమయంలో కూడా కొన్నిసార్లు బిడ్డ రక్తకణాలు తల్లిలోకి ప్రవేశించి, తల్లిలో ఆర్‌హెచ్ యాంటీబాడీస్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి తర్వాత గర్భం దాల్చినప్పుడు బిడ్డ రక్తకణాలను నశింపజేసి, బిడ్డలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతాయి. కాబట్టి అబార్షన్ తర్వాత కూడా 24 గంటలలోగా ‘యాంటీ–డి’ ఇంజెక్షన్ తక్కువ డోసులో తీసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment