ఇన్‌ఫెక్షన్‌ తరచూ వస్తోంది... | Doctors Advice On Infections | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫెక్షన్‌ తరచూ వస్తోంది...

Published Sun, Sep 1 2019 10:50 AM | Last Updated on Sun, Sep 1 2019 10:50 AM

Doctors Advice On Infections - Sakshi

నాకు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ తరచుగా వస్తుంది. దీనికి మందుల ద్వారా చికిత్స చేయవచ్చా? ఆపరేషన్‌ అవసరమా? ఏ కారణాల వల్ల ఇలా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది?
– కేఆర్, నందిగామ

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ అనేక కారణాల వల్ల వస్తుంది. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే ద్వారం (యూరేత్రా), యోని ద్వారం, మలద్వారం దగ్గర దగ్గరగా ఒకదాని కింద ఒకటి ఉంటాయి. బ్యాక్టీరియా, క్రిములు, కలయిక ద్వారా యోనిభాగం నుంచి లేదా మలవిసర్జన తర్వాత మలద్వారం నుంచి మూత్రనాళంలోకి ప్రవేశించడం వల్ల మూత్రనాళానికి ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఇంకా నీరు సరిగా తాగకపోయినా, మూత్రం కిడ్నీల నుంచి వచ్చేదారిలో రాళ్ల వంటి అడ్డంకులు ఏవైనా ఉన్నా, మూత్రాశయం, మూత్రనాళంలో ఏవైనా లోపాలు ఉన్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ ఇన్ఫెక్షన్స్‌ వల్ల మూత్రంలో మంట, నొప్పి, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం బాగా పచ్చగా రావడం, ఇన్ఫెక్షన్‌ మరీ ఎక్కువగా ఉంటే చలి, జ్వరం రావడం, నడుంనొప్పి వంటి అనేక లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ను సీయూఈ, యూరిన్‌ కల్చర్‌ సెన్సిటివిటీ పరీక్షల ద్వారా నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. వీటికి సరైన మోతాదులో పూర్తి కోర్సు యాంటీబయోటిక్స్‌ మందులు వాడటంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాటిమాటికీ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించవచ్చు. రోజూ కనీసం రెండు లీటర్ల మంచినీళ్లు తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా మూత్ర విసర్జన చెయ్యాలి.

మల విసర్జన తర్వాత వెనకాల నుంచి ముందుకు కాకుండా, ముందు నుంచి వెనకాలకు శుభ్రం చేసుకోవాలి. కలయికకు ముందు, తర్వాత మూత్ర విసర్జన చెయ్యాలి. నీళ్లతో శుభ్రపరచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. మాటిమాటికీ డెట్టాల్‌ వంటి యాంటీసెప్టిక్‌ లోషన్స్‌తో శుభ్రపరచుకోకూడదు. దీనివల్ల మంచి బ్యాక్టీరియా నశించిపోయి హానికరమైన క్రిములు పెరిగే అవకాశాలు ఉంటాయి. కావాలంటే మామూలు సబ్బుతోను లేదా పీహెచ్‌ను భద్రపరచే ఇంటిమేట్‌ వాష్‌ను వాడుకోవచ్చు. మూత్ర ఇన్ఫెక్షన్‌లు మాటిమాటికీ వచ్చేవారిలో పైన చెప్పిన జాగ్రత్తలతో పాటు డాక్టర్‌ పర్యవేక్షణలో దీర్ఘకాలం తక్కువ డోస్‌లో యాంటీబయోటిక్స్‌ వాడాలి. అవసరమైతే ఆరునెలల వరకు వాడాల్సి ఉంటుంది.

హైపర్‌ ప్రోలాక్టీనిమియా ఎక్కువగా ఉంటే గర్భం దాల్చడం కష్టమని ఎక్కడో చదివాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు.
– శ్రీజ, కర్నూలు
మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రోలాక్టిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది సాధారణంగా గర్భిణి సమయంలో రొమ్ముపై ప్రభావం చూపి, పాలు పడటానికి ఉపయోగపడుతుంది. కొందరిలో అనేక కారణాల వల్ల ఇది ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. దీనినే హైపర్‌ ప్రోలాక్టీనిమియా అంటారు. మానసిక ఒత్తిడి, కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్‌ మందులు, యాంటాసిడ్స్‌ వంటి అనేక రకాల మందులు దీర్ఘకాలం వాడటం వల్ల, రొమ్ము మీద ఒత్తిడి, దెబ్బలు, థైరాయిడ్‌ సమస్య, పిట్యూటరీ గ్రంథిలో కణితులు, కిడ్నీ సమస్యలు, లివర్‌ సమస్యలు వంటి అనేక కారణాల వల్ల ప్రోలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుంది.

దీని ప్రభావం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్‌ హార్మోన్లు తగ్గడం ద్వారా పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, మిగత హార్మోన్లలో అసమతుల్యత, అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. రొమ్ము నొప్పి, రొమ్ము నుంచి పాలు రావడం, నీరు రావడం, కళ్లు మసకగా కనిపించడం, కలయిక మీద ఆసక్తి లేకపోవడం వంటి అనేక లక్షణాలు హైపర్‌ ప్రోలాక్టీనిమియా వల్ల ఏర్పడతాయి. డాక్టర్‌ని సంప్రదించి, దీనికి గల కారణాలను విశ్లేషించుకుని, తగిన పరీక్షలు చేయించుకుని కారణం బట్టి చికిత్స తీసుకుంటే గర్భందాల్చచడం సాధ్యమవుతుంది.

నా వయసు 20 సంవత్సరాలు. రుతుస్రావంలో చాలా రక్తం పోతుంది. ఇలా పోవడం వల్ల చాలా బలహీనపడతారని, భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. దీనికి నివారణచర్యల గురించి తెలియజేయగలరు.
– బి.వాసవి, నర్మెట్ట

మొదట ఇరవై సంవత్సరాల వయసులోనే రుతుస్రావంలో బ్లీడింగ్‌ ఎక్కువగా ఎందుకు అవుతోందో తెలుసుకోవాలి. రక్తం గూడు కట్టే క్రమంలో ఏమైనా సమస్యలు ఉన్నా, గర్భాశయంలో గడ్డలు, పాలిప్స్‌ లేదా అండాశయంలో సిస్ట్‌లు, పీసీఓడీ, ఇంకా థైరాయిడ్‌ వంటి హార్మోన్‌ సమస్యలతో పాటు చాలా ఇతర కారణాల వల్ల పీరియడ్స్‌ సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువ కావచ్చు. కొందరిలో అధిక బరువు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా కావచ్చు. బ్లీడింగ్‌ ఎన్ని రోజులవుతుంది, రోజుకు మార్చే న్యాప్‌కిన్స్‌ సంఖ్య, నొప్పి ఉందా లేదా అనే అంశాల బట్టి బ్లీడింగ్‌ ఎంత ఎక్కువవుతోందనేది అంచనా వేయవచ్చు.

బ్లీడింగ్‌ మరీ ఎక్కువ అవడం వల్ల రక్తహీనత ఏర్పడి దానివల్ల నీరసం, ఒంటినొప్పులు, తలనొప్పి, ఆయాసం, గుండెదడ, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గైనకాలజిస్టును సంప్రదించి, సీబీపీ, ఎస్‌ఆర్‌ టీఎస్‌హెచ్, స్కానింగ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణం తెలుసుకుని దానిబట్టి చికిత్స తీసుకోవడం మంచిది. చికిత్సతో పాటు రక్తహీనతకు ఆహారంలో సరైన మోతాదులో పౌష్టికాహారం, ఐరన్‌ మాత్రలు తీసుకోవడం, యోగా, వ్యాయామాలు చేయడం మంచిది.                                
- డా.వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement