నా వయసు 36 ఏళ్లు. బరువు 83 కేజీలు. ఎత్తు 5.2. రెండేళ్ల కిందటే పెళ్లయింది. నాకు చిన్నప్పటి నుంచే టైప్–1 డయాబెటిస్ ఉంది. ఇంకా పిల్లల్లేరు. డాక్టర్ సూచనపై పరీక్షలు చేయించుకుంటే పీసీఓడీ అని తేలింది. నాకు పిల్లలు కలిగే అవకాశం ఉంటుందంటారా? నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. – అనిత, ఆదిలాబాద్
మీ ఎత్తు 5.2కి సాధారణంగా 50 నుంచి 57 కిలోల వరకు బరువు ఉండొచ్చు. కాని మీరు 83 కేజీలు ఉన్నారు. అంటే దాదాపు 25 కేజీల అధిక బరువు ఉన్నారు. టైప్ 1 డయాబెటిక్ ఉన్నప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల జన్యుపరమైన కారణాల వల్ల పీసీఓడీ కూడా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అధికబరువుతో పాటు పీసీఓడీ ఉండడం వల్ల హార్మోన్ల అసమతుల్యత చాలా ఎక్కువగా ఉండి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యలు ఏర్పడి సాధారణంగా గర్భం దాల్చడానికి ఆలస్యం, ఇబ్బంది ఏర్పడుతుంది. గర్భం రావడానికి ఇబ్బంది ఒకటే కాకుండా మీకు ఉంటే డయాబెటిస్, పీసీఓడీ మరియు అధికబరువు వల్ల బీపి, గుండె సమస్యలు, రక్తనాళాలలో రక్తం గూడుకట్టడం, స్ట్రోక్ వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి.
మీ వయసు 36 సంవత్సరాలు కాబట్టి ఎక్కువ సమయం వృథా చెయ్యకుండా గర్భం కోసం ప్రయత్నం, చికిత్స తీసుకునే ముందు, బరువు తగ్గడానికి డైటీషియన్ పర్యవేక్షణలో మితమైన ఆహార నియమాలను పాటిస్తూ, నడక, యోగా, ఏరోబిక్స్ వంటివి నిపుణుల సలహా మేరకు కొద్దిగా ఎక్కువ సమయం చేస్తూ తొందరగా బరువు తగ్గడం మంచిది. బరువు తగ్గినప్పుడు కొందరిలో సాధారణంగానే గర్భం నిలుస్తుంది. లేని పక్షంలో బరువు తగ్గి గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో అవసరమైన పరీక్షలు చేయించుకుని అండం పెరుగుదలకు మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవచ్చు. బరువు తగ్గకుండా షుగర్ అదుపులో లేకుండా గర్భం కోసం మందులువాడినా, గర్భం నిలిచినా, చాలామందిలో గర్భం అబార్షన్లు అవ్వడం, గర్భం సరిగా పెరగకపోవడం, బిడ్డలో అవయవలోపాలు, మీకు బీపీ పెరగడం, షుగర్ అదుపులో లేక ఎక్కువ మోతాదులో మందులు వాడటం, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, బిడ్డ అధికబరువు, లేదా బీపీ వల్ల బరువు సరిగా పెరగకపోవడం, కాన్పు సమయంలో ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా పైన చెప్పిన సలహాలను పాటిస్తూ.... బరువు తగ్గి, గర్భం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడున్న చికిత్సలతో మీకు తప్పకుండా గర్భం నిలుస్తుంది.
- డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment