లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది మేడం...
– దీపికా వత్సల, చెన్నూరు
సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకజ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సంవత్సరాలకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు ధృడంగా తయారుకావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సంవత్సరాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు దృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సంవత్సరాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారు పడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సంవత్సరాల లోపలే పిల్లలను కనేవాళ్లు. అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీవారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సంవత్సరాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు.
మా దూరపు బంధువుల ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ముల పిల్లలు అంటే వరుసకు అన్నా, చెల్లి అయ్యేవాళ్లు ప్రేమలో పడ్డారు. ఇంట్లోవాళ్లంతా షాక్ అయ్యి, కౌన్సెలింగ్ ఇప్పించి పెళ్లి ఆలోచనను మాన్పించి చదువు కోసం ఇద్దరినీ చెరో దేశం పంపించారు. అయితే ఆ పిల్లలిద్దరి వాదన ఏంటంటే.. సైంటిఫిక్‌గా బావామరదళ్ల వరస ఎలాగో అన్నదమ్ముల పిల్లల వరస కూడా అలాంటిదే. వాళ్లిద్దరి పెళ్లి సమ్మతమైనప్పుడు ఇది కూడా సమ్మతమే కావాలి కదా అని. నిజంగా ఈ వాదనలో నాకు నిజమే ఉన్నట్టనిపించింది. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే మా ఇంట్లోవాళ్లు మా అమ్మాయిని మా ఆడపడచు కొడుకుకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. నాకస్సలు ఇష్టం లేదు. మా చుట్టాల పిల్లల వాదనకు సరిపడా మీ జవాబు ఉంటే ఇది చూపించి పెళ్లి ఆపించాలని నా ప్రయత్నం మేడం.. అర్థం చేసుకోగలరు. నిజం వివరించగలరు.
– పేరు, ఊరు వివరాలు రాయలేదు.
మన హిందూ సంప్రదాయంలో సాధారణంగా ముందు నుంచీ కూడా మేనమామ, మేనత్త పిల్లలను వరుస కలుపుకొని పెళ్ళి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలను తోబుట్టువులుగా, అన్నా చెల్లెలుగా పరిగణించడం జరుగుతుంది. అదే కొన్ని ఇతర మతాలలో పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలను వరుస కలుపుకుని పెళ్లి చేస్తుంటారు. ఇవన్నీ ఎవరి సంప్రదాయాలలో మత పెద్దలు నిర్ణయించిన దాన్నిబట్టి, వారి వారి ఆచారాలు, నమ్మకాలను బట్టి జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు సమంజసం, సామాజికంగా తప్పా, ఒప్పా అని చెప్పడం కష్టం. కాని సైంటిఫిక్‌గా, మెడికల్‌గా వైద్యభాషలో చెప్పాలి అంటే ఇలాంటి సంబంధాలు ఏమైనా మొదటితరం, రెండవతరంలో దగ్గరి రక్తసంబంధీకులలో పెళ్ళిళ్లు అంటే అదీ ఏవిధంగానైనా మేనరికం లేదా కన్‌సాంగ్వినస్ consanguinous పెళ్ళిళ్ళ కిందకే వస్తుంది. ఎలాగైతే మేనత్త, మేనమామ పిల్లలను పెళ్ళి చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలలో కొన్ని జన్యుపరమైన సమస్యలు, పిల్లలలో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు, చుట్టరికం లేని వారికి పిల్లలలలో కంటే రెట్టింపు ఉంటాయో, అలాగే పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలతో పెళ్ళిళ్లు అయితే, వారి పిల్లలలో కూడా ఇలాంటి సమస్యల అవకాశం రెట్టింపే ఉంటుంది. కాబట్టి దగ్గర చుట్టాలలో, బంధువులలో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment