
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. మూడో నెల. ఆహారం విషయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేయగలరు. మాంసం, గుడ్లు, చేపలు నేను తినను. వీటికి బదులుగా కూరగాయల్లో ఏవి తీసుకుంటే మంచిదో తెలియజేయగలరు. నేను కాఫీ తాగకుండా ఉండలేను. ఎక్కువగా తాగుతాను. రోజుకు ఎన్నిసార్లు తాగవచ్చు?
– కె.నళిని, విజయనగరం
ప్రెగ్నెన్సీ సమయంలో తల్లిలో జరిగే మార్పులకు బిడ్డ పెరుగుదలకు మామూలుగా తీసుకునే ఆహారం కంటే రోజుకు 300 క్యాలరీల ఆహారం అదనంగా తీసుకుంటే సరిపోతుంది. సాధారణంగా రోజుకు 1500 క్యాలరీల శక్తిని ఇచ్చే ఆహారం కావాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలల్లో పెద్దగా బరువు పెరగరు కాబట్టి పెద్దగా క్యాలరీలు అవసరం ఉండదు. 4 నుంచి 7 నెల వరకు రోజుకు 300 క్యాలరీలు, 8 నుంచి కాన్పు వరకూ 450 క్యాలరీలు రోజుకు అదనపు ఆహారం అవసరమవుతుంది. ఆహారంలో 50 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్స్, 25 నుంచి 30 శాతం ప్రొటీన్స్, 20 శాతం కొవ్వు పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శాకాహారులు వీటిలో ఎక్కువగా తాజా ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగు తీసుకోవాలి. అన్నం తక్కువ తీసుకుని.. జొన్నలు, రాగులు వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు.
వాటిని బాగా శుభ్రం చేసుకుని వండి తినడం మంచిది. ఆహారంతో పాటు ఐరన్, కాల్షియం, విటమిన్ టాబ్లెట్లు కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కాఫీలో ఉండే కెఫీన్ వల్ల ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దాని వల్ల శరీరంలో నీరు శాతం తగ్గే అవకాశాలు ఉంటాయి. నిద్రని తగ్గిస్తుంది. ఇది హార్ట్ రేట్‌తో పాటూ బీపీని పెంచే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిశోధనలలో రోజుకి మిల్లీ గ్రాముల కెఫిన్ కంటే ఎక్కువ తీసుకునే వారికి అబార్షన్లు, బేబీ బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ అని నిర్ధారణ చెయ్యడం జరిగింది. ‘కెఫీన్’ కాఫీలో, టీలో, కూల్ డ్రింక్స్‌లో, చాక్లెట్స్‌లో కూడా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోక పోవడం మంచిది. మరి బాగా అలవాటు అయిపోయి ఉంటే రోజుకి కాఫీ 250 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. అంటే అరకప్పు రోజుకు రెండు సార్లు కాఫీ పొడి తక్కువగా వేసుకుని తాగవచ్చు.
నాకు ఈమధ్య తరచుగా మూత్రానికి వెళ్లాలనిపిస్తోంది. ‘గర్భసంచిలో గడ్డలు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది..’ అని ఫ్రెండ్ చెప్పింది. ఎలాంటి లక్షణాల వల్ల గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని నిర్ధారణ చేస్తారు? అసలు ఇవి ఎందుకు వస్తాయి? చికిత్స విధానం ఎలా ఉంటుందో తెలియ జేయగలరు.
– బి.శ్రీలత, నెల్లూరు
గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫైబ్రాయిడ్స్ వల్ల వాటి పరిమాణాన్ని బట్టి, గర్భాశయంలో ఉండే పొజిషన్ బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో పీరియడ్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా, ఎక్కువ రోజులు అవ్వడం, పీరియడ్స్ త్వరత్వరగా రావడం, మధ్యమధ్యలో బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్‌తో పాటూ కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కేవలం స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. కొందరిలో ఫైబ్రాయిడ్స్ వల్ల గర్భాశయం బరువు వల్ల ముందు ఉండే మూత్రాశయం మీద ఒత్తిడి పడి, మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లాలనిపిస్తుంటుంది.
కొందరిలో ఒత్తిడి వెన్నుపూస మీద, పేగుల మీద పడటం వల్ల మలబద్ధకం, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉండవచ్చు. అవి ఎందుకు వస్తాయని కచ్చితంగా చెప్పడం కష్టం. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరిలో జన్యుపరమైన కారణాలను బట్టి, ఎన్నో తెలియని కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ రావచ్చు. వీటి చికిత్సలో భాగంగా లక్షణాలను బట్టి మందులతో లేదా మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా లేదా యుటిరైన్ ఆర్టెరీ ఎంబొలైజేషన్ వంటి చికిత్స విధానాలను పాటించడం జరుగుతుంది.
చాలా కాలంగా నిద్రలేమితో బాధ పడుతున్నాను. నిద్ర మాత్రలు తీసుకునేదాన్ని. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో తీసుకోవడం మంచిదేనా? మాత్రలు వేసుకోకుండా చక్కగా నిద్ర పట్టాలంటే ఏంచేయాలి? పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడాలి అని చెబుతుంటారు. దీని గురించి తెలియజేయగలరు.
– జి.శాలిని, హన్మకొండ
ప్రెగ్నెన్సీ సమయంలో నిద్రమాత్రలు తీసుకోకపోవడమే మంచిది. బిడ్డ అవయవాలు ఏర్పడే మొదటి మూడు నెలల సమయంలో కొన్ని రకాల నిద్రమాత్రల వల్ల బిడ్డలో గ్రహణంమొర్రి వంటి అనేక అవయవ లోపాలు మామూలు వారి కంటే కొద్దిగా ఎక్కువ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిద్రపట్టడానికి వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మంచిది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగా, చిన్నగా నడక వంటి వాటి వల్ల మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర పడుతుంది. అలాగే నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం, వేరే పనుల మీద దృష్టి పెట్టడం, పాజిటివ్ దృక్పథంతో మెలగడం, కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడపడం, సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం వంటి మార్పులు చేసుకోవటం మంచిది. అన్ని జాగ్రత్తలు పాటించినా, నిద్రపట్టక చాలా ఇబ్బంది పడుతుంటే డాక్టర్ పర్యవేక్షణలో చాలా తక్కువ దుష్పలితాలు ఉన్న నిద్రమాత్రలను వాడుకోవచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట పెరిగేకొద్దీ.. నిద్రపోవడానికి మంచంలో అటూ ఇటూ తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. దీని వల్ల బిడ్డకీ, తల్లికీ రక్తప్రసరణ సరిగా చేరుతుంది. ఈ పొజిషన్‌లో ఎక్కువ సేపు పడుకోవడానికి ఇబ్బందిగా అనిపించి పొట్ట బరువుగా ఉన్నప్పుడు గర్భిణీల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్ల(మెటర్నిటీ పిల్లోస్)ను వాడుకోవచ్చు. ఇవి మార్కెట్‌లో u,c,j అనే రకాల షేప్స్‌లో దొరుకుతాయి. ఇవే వాడాలని ఏం లేదు. సాధారణ మెత్తటి దిండ్లని కూడా రెండు కాళ్ల మధ్యలో ఒక్కటి, ఎడమవైపు తిరిగి, పొట్ట కింద లేదా పక్కకి ఒకటి, నడుమ వెనకాల ఒకటి పెట్టుకుని నిద్రపోవాలి. ఇలా వాడటం వల్ల నిద్రలో ఇబ్బంది లేకుండా ఉంటుంది.
- డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్‌బో, హైదర్‌నగర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment