∙మా పెద్దమ్మ కూతురు ప్రెగ్నెంట్. అయితే ఆమెకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. ‘మెంటల్ డిజార్డర్’ ప్రభావం బేబీపై ప్రతికూలంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలియజేయగలరు.
– జీఆర్, తాడేపల్లిగూడెం
ఆమె మానసిక సమస్యలకు మందులు ఏమైనా వాడుతోందా లేదా తెలియవలసి ఉంది. అనేక రకాల మానసిక సమస్యలను మెంటల్ డిజార్డర్ అంటారు. మానసిక సమస్యలకు ముందు నుంచే మందులు వాడుతున్నట్లయితే, ఇప్పుడు గర్భంలోని శిశువుపై వాటిలోని కొన్ని రకాల మందుల వల్ల దుష్ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, వాటిలో ఏమైనా మార్పులు చెయ్యాలా, మోతాదు తగ్గించాలా అనే దానిపై సలహా తీసుకోవడం మంచిది. ఒకవేళ మందులు ఏమీ వాడకుండా ఉంటే కూడా డాక్టర్‌ను సంప్రదించి, వ్యాధి తీవ్రతను బట్టి, అవసరమనుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో అతి తక్కువ దుష్ప్రభావాలు ఉన్న మందులను అతి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. లేకపోతే మానసిక సమస్యలు ఉన్నప్పుడు గర్భం దాల్చినప్పుడు సరిగా వారి పర్యవేక్షణ చూసుకోకపోవడం, ఆహారంపై శ్రద్ధ లేకపోవడం వంటి వాటి వల్ల బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు, పుట్టిన బిడ్డలో కూడా కొందరిలో మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారం తగినంతగా ఉండాలి. వీరిని జాగ్రత్తగా చూసుకుంటూ, సరైన పోషకాహారం తినిపిస్తూ, మందులు తగిన సమయానికి ఇవ్వడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
∙నాకు హెయిర్ డై వేసుకునే అలవాటు ఉంది. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. గర్భిణులు హెయిర్ డై వేసుకుంటే పుట్టబోయే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా లాంటివి రావచ్చు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం?
– కె.శైలజ, నందిగామ
తెల్ల వెంట్రుకలకు వేసుకునే హెయిర్ డైలో ఉన్న కెమికల్స్ తలపై చర్మంలో నుంచి శరీరంలోకి, రక్తంలోకి చాలా సూక్ష్మంగా చేరుతాయి. అక్కడి నుంచి బిడ్డకు మరింత సూక్ష్మంగా చేరవచ్చు. ఇంత కొంచెం కెమికల్స్ కడుపులోని బిడ్డకు ఏ హానీ చెయ్యవు. అయినా ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటే, గర్భంలోని బిడ్డలో అవయవాలు ఏర్పడే మొదటి ఐదు నెలల కాలం డై జోలికి వెళ్లకపోవడం మంచిది. ఆరో నెల నుంచి వేసుకోవచ్చు. వీలైనంత వరకు కాన్పు తర్వాత వేసుకోవడం మంచిది. డై బదులు హెన్నా పెట్టుకోవచ్చు. డై మాడుకు తగలకుండా కేవలం జుట్టుకే వేసుకోవడం వల్ల తలపై చర్మంలోంచి శరీరంలోకి, రక్తంలోకి కెమికల్స్ వెళ్లే అవకాశాలు ఉండవు.
హెయిర్ డై వేసుకోవాలనుకుంటే, బాగా గాలి ఆడే గదిలో డై వేసుకోవడం మంచిది. ఈ డైని వీలైనంత తక్కువసేపు ఉంచుకుని, బాగా నీటిలో జుట్టుని, మాడును శుభ్రపరచుకోవడం మంచిది. చేతికి గ్లౌస్ వేసుకుని డై వేసుకోవడం మంచిది. కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని, డై వేసుకోవడం మంచిది. హెయిర్ డై వల్ల బిడ్డలో మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా వంటివేమీ రావు. కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా హెయిర్ డై వాడే సెలూన్స్‌లో పనిచేసే వారిలో, డై కెమికల్స్ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్, లుకీమియా వంటివి వచ్చే అవకాశాలు, మిగిలిన వారితో పోల్చితే కొద్దిగా ఎక్కువగా ఉంటాయని వెల్లడించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment