మగవారు వాడే పిల్స్ ఉంటాయా? | Dr. Venati Shobha sex problem solutions...! | Sakshi
Sakshi News home page

మగవారు వాడే పిల్స్ ఉంటాయా?

Published Sun, Jul 3 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

మగవారు వాడే పిల్స్ ఉంటాయా?

మగవారు వాడే పిల్స్ ఉంటాయా?

సందేహం
నా వయసు 23. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అవుతోంది. ఇంకో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మొదట్లో డాక్టర్ సలహా మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకున్నాను. దాంతో చాలా నీరసంగా, లావు అయ్యాను. దాంతో పిల్స్ వేసుకోవడం ఆపేసి కండోమ్స్ వాడుతున్నాం. కానీ అది సేఫ్టీ కాదని చాలా చోట్ల చదివాను. మగవారు వాడే పిల్స్ ఏమీ ఉండవా? ఈ ప్రశ్నను మావారు అడగమన్నారు. ఎక్కడ చదివినా ఆడవారు వాడేవే ఉన్నాయి తప్ప మగవారికి ఉన్నట్లు ఎవరూ చెప్పట్లేదు. అలా ఏమైనా ఉంటే చెప్పండి.
 - ఓ సోదరి

 
పిల్లలు పుట్టకుండా వాడే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలనెలా అండాశయం నుంచి విడుదలయ్యే అండాన్ని తయారు కాకుండా ఆపేసి తద్వారా గర్భం రాకుండా నివారిస్తాయి. ఇంతకు ముందు రోజుల్లో తయారయ్యే పిల్స్‌లో హార్మోన్స్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల శరీరతత్వాన్ని బట్టి కొందరిలో వికారం, నీరసం, లావు పెరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.

ఇప్పుడు కొత్తగా వచ్చే లో-డోస్‌పిల్స్‌లో హార్మోన్స్ మోతాదు చాలా తక్కువగా ఉండటం వల్ల.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి వీటిని ప్రయత్నించి చూడొచ్చు. మీరడిగిన దానికి సమాధానం.. మగవారు వాడే పిల్స్ చాలాకాలం నుంచి ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టరాన్, ప్రొజెస్టరాన్ లాంటి రకరకాల హార్మోన్ల కాంబినేషన్స్‌లో.. అలాగే నాన్‌హార్మోన్ మందులతో పిల్స్ తయారు చేసి కొన్ని జంతువుల మీద.. మరికొన్ని మగవారిపైనా ప్రయోగించి చూశారు.

కానీ అవి పని చెయ్యడానికి కొన్ని నెలలు పట్టింది. మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, అవి ఆపిన తర్వాత కూడా పిల్లలు కలగడానికి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి చాలా నెలలు పట్టవచ్చని తేలింది. ఈ హార్మోన్స్ వల్ల వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. కానీ ముందుగా తయారైన వృషణాలలో ఉండే  కణాల మొత్తం బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు.

కాబట్టి మగవారు పిల్స్ వేసుకోవడం మొదలుపెట్టినా.. అవి పని చెయ్యడానికి ఎన్ని నెలలు పడుతుందో చెప్పడం కష్టం. ఈ లోపల గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్స్ ఆపిన తర్వాత, హార్మోన్స్ ప్రభావం తగ్గి మళ్లీ వీర్యకణాలు ఎన్ని నెలలకు ఉత్పత్తి అవుతాయో చెప్పడం కష్టం. కాబట్టి ఈ సమస్యలను అధిగమించి... మగవారికి పిల్స్ తయారు చెయ్యడానికి ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.

అవన్నీ విజయవంతమై మార్కెట్‌లోకి మగవారి పిల్స్ విడుదలవ్వడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. అప్పటివరకు వేచి చూడాల్సిందే. మీరు చెప్పినట్టుగానే కండోమ్స్ ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
 
నా వయసు 26. పెళ్లై ఏడాదైంది. ప్రతినెలా పీరియడ్ మిస్ అయితే బాగుండని ఎదురు చూస్తున్నాను. కానీ పీరియడ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ భయంగా ఉంటోంది. మార్నింగ్ సిక్‌నెస్ తరచూ ఉంటోంది. అది ప్రెగ్నెన్సీకి ఒక లక్షణం అని నెట్‌లో చదివాను. పీరియడ్ మిస్ కాకముందే నేను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నానని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? గత నెలలో పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ పీరియడ్ రావడంతో కుంగిపోయాను. త్వరగా పిల్లలు కావడానికి, ఎందుకు కావట్లేదో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.  
  - రాధిక, నాగర్‌కర్నూలు

 
నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తూ ఉండి, భార్యాభర్తలు క్రమంగా కలుస్తూ ఉండి, ఇద్దరిలో వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు... నూటికి ఎనభై శాతం మంది ఏడాది లోపల గర్భం దాల్చుతారు. మిగతా 20 శాతంలో 10-15 శాతం మందికి రెండేళ్ల సమయం పట్టొచ్చు. మిగతా 5-10 శాతం మందికే కొన్ని సమస్యల వల్ల, ఎక్కువ సమయం లేదా చికిత్స అవసరం కావొచ్చు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవ్వడానికి వారం ముందు నుంచి కొందరిలో వికారం, నీరసం, రొమ్ముల్లో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు.

అలా అని అందరికీ ఉండాలనేమీ లేదు. ఈ లక్షణాలు హార్మోన్ల ప్రభావం వల్ల గర్భంలేని వారిలో పీరియడ్ వచ్చే ముందు కూడా రావచ్చు. నెలనెలా సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్ మిస్ అయిన వారం రోజుల్లో యూరిన్‌లో ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్ష చేసి గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీకు గత నెల పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చిందన్నారు. ఏమైనా హార్మోన్ల సమస్య ఏర్పడుతుందేమో తెలుసుకోవడం మంచిది. పెళ్లై ఏడాదైంది. త్వరగా పిల్లలు కావాలని ఆశ పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా... మీరు, మీవారు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement