Pils
-
చట్ట ప్రకారమే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు
సాక్షి, అమరావతి: హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని ఆ జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అదే విధంగా.. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సమర్థించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్లు)ను హైకోర్టు కొట్టేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, తదనుగుణ ఉత్తర్వులు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అభ్యంతరాలను ఆహ్వానించడమే కాక, వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుందని తేల్చిచెప్పింది. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ జారీచేసిందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై పిల్లు.. హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని జిల్లా ప్రధాన కేంద్రంగా మారుస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హిందూపూర్ అఖిలపక్ష కమిటీ కన్వినర్ బాలాజీ మనోహర్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పుట్టపర్తిని కాకుండా హిందూపూర్‌ను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే, అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రాన్ని రాయచోటిగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి అన్నమయ్య జిల్లా కన్వినర్ టి.లక్ష్మీనారాయణ 2022లో పిల్ దాఖలు చేశారు. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో అడ్వొకేట్స్ జేఏసీ రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు న్యాయవాదుల సంఘంతో పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ సాధు సుబ్రహ్మణ్యం పంత్ వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ వై. వీరవెంకట సత్యనారాయణ రామరాజు అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఈ ఏడాది జనవరి 3న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా.. గురువారం తన తీర్పులను వెలువరించింది. జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే, ప్రభుత్వ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. తీర్పు ప్రధాన పాఠం ఇలా.. జిల్లాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు.. ‘2014 పునరి్వభజన చట్టం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు. 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టంలోని సెక్షన్ 3 (1) ప్రకారం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచెయ్యొచ్చు. పాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం సెక్షన్ 3 (2) కింద కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పాటుచేయవచ్చు. అంతేకాక.. జిల్లాలో, రెవెన్యూ డివిజన్లో, మండలాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు. అలాగే, ఈ సెక్షన్ కింద నోటిఫికేషన్ జారీచేసి జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం విస్తీర్ణాన్ని పెంచొచ్చు, కుదించవచ్చు. సరిహద్దులను కూడా మార్చొచ్చు. సెక్షన్–4 కింద నిబంధనలను రూపొందించవచ్చు. ఈ చట్ట నిబంధనల కింద రాష్ట్ర ప్రభుత్వం 2020లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి సహకరించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలనూ ఏర్పాటుచేసింది. అభ్యంతరాలను పట్టించుకోలేదన్నది పిటిషనర్ల ఆరోపణ.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలను ఆహా్వనిస్తూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి అనుగుణంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను తెలిపారు. అయితే, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో చట్ట విరుద్ధంగా వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అయితే, ప్రభుత్వం మాత్రం వీరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది. ఈ విషయంలో మేం ప్రభుత్వ కౌంటర్లను పరిశీలించాం. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నోటిఫికేషన్ జారీచేసిందని ప్రభుత్వం తన కౌంటర్లలో పేర్కొంది. అంతేకాక.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కూడా మార్చిన విషయం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియనే కోర్టులు పరీక్షించగలవు.. ప్రభుత్వం కేవలం అభ్యంతరాలను ఆహా్వనించడమే కాకుండా పిటిషన్ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ తరువాతే తుది నోటిఫికేషన్ జారీచేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు రఘుపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఇచ్చిన తీర్పును ఉదహరించడం అవసరం. ప్రభుత్వం మండల ప్రధాన కేంద్రాల ఏర్పాటులో జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో ఇదే హైకోర్టు జోక్యం చేసుకుంటూ, ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మండల కేంద్రం ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వ పాలన నిర్ణయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే స్థిరపరిచిన న్యాయ సూత్రం ప్రకారం అధికరణ 226 కింద న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాన్ని పరీక్షించజాలవు. ఆ నిర్ణయ ప్రక్రియను మాత్రమే పరీక్షించగలవు. ప్రస్తుత కేసులో జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించలేదు. అందువల్ల ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ఆమె మదర్ ఆఫ్ 'పిల్'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!
మనం తరుచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) గురించి వింటుంటాం. అసలు ఇది ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా?. ఈ పిల్ మన దేశ న్యాయవ్యస్థ గతినే మార్చేసింది. చెప్పాలంటే న్యాయవ్యవస్థలో ఓ మూలస్థంభంగా ఉంది. ఈ రెండు అక్షరాల 'పిల్' అనే పదం ఎంతోమందికి న్యాయం చేకూర్చడమే గాక, సమాజంలో గొప్ప మార్పుకి నాంది పలకింది. ఈ 'పిల్' ఓ మహిళ న్యాయవాది మహోన్నత కృషి. ఆమె కథ ఎందరో యువ న్యాయవాదులకు స్ఫూర్తి. తన జీవితమంతా న్యాయం కోసం అర్పించిన ఆ స్ఫూర్తి ప్రదాత గాథ ఏంటంటే.. భారత న్యాయవాది పుష్ప కపిలా హింగోరాణిని 'మదర్ ఆఫ్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(పిఐఎల్)' లేదా 'ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం' తల్లిగా పిలుస్తారు. ఆమె 1927 నైరోబీలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా కెన్యా, యూకేలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత 1947లో న్యాయవాద వృత్తిని అభ్యసించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ క్రమంలోనే 1979లో బీహార్‌లోని అండర్ ట్రయల్ ఖైదీల దుస్థితి గురించి వచ్చిన వార్తపత్రక కథనాలను చూసి చలించిపోయింది. ఈ చట్టాలన్నీ బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతిస్తున్నాయనే విషయం ఆమెకు తెలిసింది. దీని కారణంగా అభాగ్యులు, బలహీన వర్గాల ప్రజలు ఎలా చట్టపరమైన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారనేది గమనించారు. ఈ అంతరాన్ని పరిష్కరించేలా బిహార్ జైళ్లలోని అమానవీయ పరిస్థితులను సవాలు చేస్తూ అండర్ ట్రయల్ ఖైదీల తరుపును హింగోరాణి తొలిసారిగా ఈ 'పిల్'ని దాఖలు చేశారు. ఇది హుస్సేనారా ఖాటూన్ కేసుగా భారతీయ న్యాయ చరిత్రలో ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆ 'పిల్' కాస్తా సామాజిక న్యాయం కోసం ఒక శక్తిమంతమైన సాధనంగా అవతరించింది. ఇది ఎందరో అభాగ్యులకు వరమై చట్టపరమైన పరిహారం పొందేలా చేసింది. క్రమంగా ఆ పిల్ న్యాయవ్యవస్థలో కీలక మూలస్థంభంగా మారిపోయింది. ఈ పిల్‌తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు హింగోరాణి. ఈ 'పిల్'తో వాదించిన కేసులు మహిళల హక్కులు: లింగ సమానత్వం కోసం పోరాడారు. అలాగే వరకట్నం వంటి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. పర్యావరణ పరిరక్షణ: ఆమె కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమలను సవాలు చేస్తూ..సహజ వనరుల పరిరక్షణ కోసం వాదించింది. జైలు సంస్కరణలు: ఆమె ఖైదీల హక్కులు, జైలు పరిస్థితుల కోసం కూడా వాదించారు శిశు సంక్షేమం: ఆమె బాలల రక్షణ కోసం పోరాడటమే గాక బాల కార్మిక పద్ధతులను సవాలు చేశారు. సమాచార హక్కు: ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం వాదించారు. తమ గోడును చెప్పుకోలేక, న్యాయం పొందలేని బలహీన వర్గాల వారికి హింగోరాణి శక్తిమంతమైన గొంతుగా మారారు. ఆమె అవిశ్రాంతంగా న్యాయం కోసం నిబద్ధతగా నిలిబడి సాగించిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సంత్కరించి ప్రశంసించింది. హింగోరాణి కథ సమాజంలో తెచ్చే శక్తిమంతమైన మార్పుకి నిదర్శనం. అంతేగాదు న్యాయం కోసం ఎలా నిబద్ధతగా వ్యవహరించి పోరాడాలో అనేందుకు కూడా ఆమె ఒక ప్రేరణ. (చదవండి: ఎవరీ సోమా మండల్? ఆమె వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌గా..! -
కోవిడ్ బాధితులకు శుభవార్త
-
మున్సి‘పోల్స్’ పిల్స్‌పై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మున్సి‘పోల్స్’పిల్స్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలన్నీ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్ జారీ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలకు 110 రోజుల సమయం కావాలని సింగిల్ జడ్జి వద్ద చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత నెల రోజుల్లోగానే పూర్తి చేయడాన్ని తప్పుపడుతూ నిర్మల్ జిల్లాకు చెందిన అన్జుకుమార్‌రెడ్డి, డాక్టర్ ఎస్.మల్లారెడ్డి దాఖలు చేసిన పిల్స్ మంగళవారం ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. వాదనల సమయంలో ధర్మాసనం.. రాజ్యాంగంలోని 243వ అధికరణం ప్రకారం అయిదేళ్ల పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సివుందని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించామని అధికారులు చెబుతున్నారని పేర్కొంది. స్టే ఉత్తర్వులు జారీ చేయలేదని, రాజ్యాంగం ప్రకారం మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాదులు టి.సూర్యకిరణ్‌రెడ్డి, సిన్నోళ నరేష్‌రెడ్డిలు వాదిస్తూ.. ప్రభుత్వ అధికారులు హడావుడిగా ముందస్తు ప్రక్రియను పూర్తి చేశారని తప్పుపట్టారు. కుల గణనపై అభ్యంతరాలు చెప్పడానికి ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చారని, కనీసం అయిదు రోజులు గడువు ఉండాలన్నారు. ధర్మాసనం కలి్పంచుకుని.. జనాభా లెక్కల్లోనే పూ ర్తి వివరాలు ఉంటాయని, వాటి ఆధారంగా రిజర్వేషన్లు చేయవచ్చని పేర్కొంది. దీనిపై నరేశ్‌రెడ్డి దిస్తూ ముస్లింలు కూడా బీసీలుగా ఉన్నారని, ముస్లింల్లో అందరూ బీసీలు కాదని బదులిచ్చారు. ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులివ్వాలి... ఈ ఏడాది జూలై 2తో పాలకవర్గాల గడువు ముగిసిందని, ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్తర్వులివ్వాలని అదనపు ఏజీ జె.రామచంద్రరావు కోరారు. ఓటర్ల గణన జూలై 7నాటికి పూర్తి అయిందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం గడువు పూర్తి అయిన మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదిస్తూ ఎన్నికల ముందు ప్రక్రియ పూర్తి అయ్యాక ఓటర్ల జాబితా విడుదల చేసేందుకు వారం రోజుల గడువు అవసరం అవుతుందన్నారు. ఓటర్ల జాబితా వెల్లడించాక ఎన్నికలు పూర్తికి మరో 20 రోజులు కావాలని, మొత్తం 27 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరం అవుతాయని, అందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడాది సెపె్టంబర్ 15న ప్రభుత్వానికి లేఖ రాశామని, అదే ఏడాది డిసెంబర్ నాటికి ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ ఏడాది మార్చి 28 నాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తే జూలై 2తో ముగిసే మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగమని ఆ లేఖలో వివరించామన్నారు. ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోనందునే హైకోర్టులో కేసు వేయాల్సివచి్చందని వివరించారు. 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించరాదని ఇప్పటికే సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం వెలువరించబోయే తీర్పు మేరకు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. -
ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని...
సందేహం నా వయసు 28. పెళ్లై రెండేళ్లు అవుతోంది. మొదటి ఏడాది పిల్లలు వద్దనుకొని పిల్స్ వాడాను. కానీ రెండో సంవత్సరం ఎలాంటి మందులు వాడలేదు. అయినా నాకింకా పిల్లలు కావడం లేదు. నా బరువు 64 కిలోలు. థైరాయిడ్ ఉంది. నా సమస్య ఏంటంటే... ఇటీవలి కాలంలో పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ అనే సమస్యే కారణమని టీవీల్లో, పేపర్లో చదువుతున్నాను. నాకు కూడా అలాంటి సమస్య ఏదైనా ఉందేమోనని భయంగా ఉంది. ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని చాలా భయంగా ఉంది. అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు మొదలయ్యాయి. పీసీఓడీ సమస్య ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటాయో దయచేసి చెప్పండి. - ప్రభావతి, కాకినాడ మీ బరువు రాశారు కానీ ఎత్తెంతో రాయలేదు. మీ పీరియడ్స్ సక్రమంగా నెల నెలా వస్తున్నాయో లేదో రాయలేదు. పీసీఓడీ అంటే గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఉండడం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సాధారణంగా అండాశయాలలో 5-8ఎంఎం ఫాలికల్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి 5 నుంచి 8 వరకు ఉంటాయి. పీసీఓడీ ఉన్నవారిలో చిన్న ఫాలికల్స్ 10,12 నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్, ఈ పీసీఓడీ ఉండే ఆడవారిలో ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు ఎక్కువగా రావడం, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు రావడం, కొందరిలో బరువు పెరగటం, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా ఏర్పడటం వంటి ఎన్నో లక్షణాలు కనిపించవచ్చు. అందరికీ అన్నీ ఉండాలని ఏమీ లేదు. వారిలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలనెలా పెరిగి విడుదలయ్యే అండం, పీసీఓడీ ఉన్నవారిలో అండం పరిమాణం పెరగకపోవడం, విడుదల అవ్వకపోవడం వల్ల గర్భం ధరించడానికి ఇబ్బంది ఉంటుంది. కొంతమందిలో గర్భం వచ్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల పీసీఓడీ ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వారి వరకు వస్తుంది. పేపర్లు, టీవీలు చూసుకుంటూ మీకు కూడా ఈ సమస్య ఉందేమోనని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే ఎలా? పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ ఒక్కటే సమస్య కాదు, థైరాయిడ్ సమస్య, ఇతర హార్మోన్లలో లోపాలు ఉండొచ్చు. ముందుగా మీరు ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మీలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి స్కానింగ్, రక్త పరీక్షలు, హార్మోన్ల పరీక్షలు వంటివి చేయించుకొని, అలాగే మీ వారికి కూడా వీర్య పరీక్ష చేయించి, సమస్యను బట్టి చికిత్స తీసుకోండి. కొందరిలో ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు 80శాతం మందే మొదటి ఏడాది లోపుల ప్రెగ్నెంట్ అవుతారు. 15 శాతం మంది రెండో సంవత్సరం అవుతుంటారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరం ఉంటుంది. నా వయసు 25. మూడేళ్ల నుంచి నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. ఆ అబ్బాయి నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. ఇన్ని రోజులు ఆ తేడాను మేమెప్పుడూ ఆలోచించలేదు. కానీ రెండు నెలల క్రితం అతను నా దగ్గరకు వచ్చి, నన్ను పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. ఎందుకని అడిగితే... నేను తనకన్నా ఏడాది పెద్దదానినని అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నాడు. అతను అన్నట్లు నిజంగా ఏమైనా సమస్యలు వస్తాయా? దయచేసి సలహా ఇవ్వండి, అతణ్ని మరచిపోలేక రెండు నెలల నుంచి పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. - ఓ సోదరి పెళ్లికి మగవారి వయసు, ఆడవారి కంటే పెద్దగా ఉండాలనేది సంప్రదాయంలో అలవాటు అయిపోయింది. మగవారు పెద్దగా ఉండడం వల్ల వారి మీద గౌరవంతో, కుటుంబాన్ని వారు ముందుకు నడిపిస్తారు అనే అభిప్రాయం ఉంది. మన సమాజంలో మనం మన అభిప్రాయాల కంటే చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి, సంప్రదాయానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలంటే కొంతమంది ఆలోచిస్తారు. అలాగే అతను కూడా ఆలోచించి ఉంటాడు. నిజంగా చెప్పాలంటే.. మీరు అతనికంటే ఏడాది పెద్దగా ఉండటం వల్ల శారీరకంగా గానీ, భవిష్యత్‌లో పుట్టే పిల్లలకు కానీ ఎలాంటి సమస్యలు రావు. నిజంగా మీ ఇద్దరు మనస్పూర్తిగా ప్రేమించుకొని ఉంటే, మీరు మెల్లిగా అతనికి ఈ విషయాన్ని నచ్చ చెప్పి చూడండి. దానివల్ల అతని మనసు మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వినకపోతే, మీరిద్దరూ ఓసారి డాక్టర్‌ను సంప్రదించండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
మగవారు వాడే పిల్స్ ఉంటాయా?
సందేహం నా వయసు 23. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అవుతోంది. ఇంకో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మొదట్లో డాక్టర్ సలహా మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకున్నాను. దాంతో చాలా నీరసంగా, లావు అయ్యాను. దాంతో పిల్స్ వేసుకోవడం ఆపేసి కండోమ్స్ వాడుతున్నాం. కానీ అది సేఫ్టీ కాదని చాలా చోట్ల చదివాను. మగవారు వాడే పిల్స్ ఏమీ ఉండవా? ఈ ప్రశ్నను మావారు అడగమన్నారు. ఎక్కడ చదివినా ఆడవారు వాడేవే ఉన్నాయి తప్ప మగవారికి ఉన్నట్లు ఎవరూ చెప్పట్లేదు. అలా ఏమైనా ఉంటే చెప్పండి. - ఓ సోదరి పిల్లలు పుట్టకుండా వాడే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి నెలనెలా అండాశయం నుంచి విడుదలయ్యే అండాన్ని తయారు కాకుండా ఆపేసి తద్వారా గర్భం రాకుండా నివారిస్తాయి. ఇంతకు ముందు రోజుల్లో తయారయ్యే పిల్స్‌లో హార్మోన్స్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల శరీరతత్వాన్ని బట్టి కొందరిలో వికారం, నీరసం, లావు పెరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చే లో-డోస్పిల్స్లో హార్మోన్స్ మోతాదు చాలా తక్కువగా ఉండటం వల్ల.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి వీటిని ప్రయత్నించి చూడొచ్చు. మీరడిగిన దానికి సమాధానం.. మగవారు వాడే పిల్స్ చాలాకాలం నుంచి ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. ఈస్ట్రోజన్, టెస్టోస్టరాన్, ప్రొజెస్టరాన్ లాంటి రకరకాల హార్మోన్ల కాంబినేషన్స్‌లో.. అలాగే నాన్హార్మోన్ మందులతో పిల్స్ తయారు చేసి కొన్ని జంతువుల మీద.. మరికొన్ని మగవారిపైనా ప్రయోగించి చూశారు. కానీ అవి పని చెయ్యడానికి కొన్ని నెలలు పట్టింది. మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు, అవి ఆపిన తర్వాత కూడా పిల్లలు కలగడానికి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి చాలా నెలలు పట్టవచ్చని తేలింది. ఈ హార్మోన్స్ వల్ల వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. కానీ ముందుగా తయారైన వృషణాలలో ఉండే కణాల మొత్తం బయటకు రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. కాబట్టి మగవారు పిల్స్ వేసుకోవడం మొదలుపెట్టినా.. అవి పని చెయ్యడానికి ఎన్ని నెలలు పడుతుందో చెప్పడం కష్టం. ఈ లోపల గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. పిల్స్ ఆపిన తర్వాత, హార్మోన్స్ ప్రభావం తగ్గి మళ్లీ వీర్యకణాలు ఎన్ని నెలలకు ఉత్పత్తి అవుతాయో చెప్పడం కష్టం. కాబట్టి ఈ సమస్యలను అధిగమించి... మగవారికి పిల్స్ తయారు చెయ్యడానికి ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అవన్నీ విజయవంతమై మార్కెట్లోకి మగవారి పిల్స్ విడుదలవ్వడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. అప్పటివరకు వేచి చూడాల్సిందే. మీరు చెప్పినట్టుగానే కండోమ్స్ ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. నా వయసు 26. పెళ్లై ఏడాదైంది. ప్రతినెలా పీరియడ్ మిస్ అయితే బాగుండని ఎదురు చూస్తున్నాను. కానీ పీరియడ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ భయంగా ఉంటోంది. మార్నింగ్ సిక్నెస్ తరచూ ఉంటోంది. అది ప్రెగ్నెన్సీకి ఒక లక్షణం అని నెట్లో చదివాను. పీరియడ్ మిస్ కాకముందే నేను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నానని తెలుసుకోవడానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? గత నెలలో పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. కానీ పీరియడ్ రావడంతో కుంగిపోయాను. త్వరగా పిల్లలు కావడానికి, ఎందుకు కావట్లేదో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రాధిక, నాగర్‌కర్నూలు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తూ ఉండి, భార్యాభర్తలు క్రమంగా కలుస్తూ ఉండి, ఇద్దరిలో వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు... నూటికి ఎనభై శాతం మంది ఏడాది లోపల గర్భం దాల్చుతారు. మిగతా 20 శాతంలో 10-15 శాతం మందికి రెండేళ్ల సమయం పట్టొచ్చు. మిగతా 5-10 శాతం మందికే కొన్ని సమస్యల వల్ల, ఎక్కువ సమయం లేదా చికిత్స అవసరం కావొచ్చు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి వారం ముందు నుంచి కొందరిలో వికారం, నీరసం, రొమ్ముల్లో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు. అలా అని అందరికీ ఉండాలనేమీ లేదు. ఈ లక్షణాలు హార్మోన్ల ప్రభావం వల్ల గర్భంలేని వారిలో పీరియడ్ వచ్చే ముందు కూడా రావచ్చు. నెలనెలా సక్రమంగా పీరియడ్స్ వచ్చే వారిలో పీరియడ్ మిస్ అయిన వారం రోజుల్లో యూరిన్‌లో ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్ష చేసి గర్భం ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీకు గత నెల పీరియడ్ పది రోజులు ఆలస్యంగా వచ్చిందన్నారు. ఏమైనా హార్మోన్ల సమస్య ఏర్పడుతుందేమో తెలుసుకోవడం మంచిది. పెళ్లై ఏడాదైంది. త్వరగా పిల్లలు కావాలని ఆశ పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా... మీరు, మీవారు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
అత్యవసరమైతేనే... ఆ పిల్స్..!
సందేహం నా వయసు 28, బరువు 63 కిలోలు, ఎత్తు నాలుగున్నర అడుగులు. సిజేరియన్ ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంకా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోలేదు. లూప్ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద కారణంగా దాన్ని తీసేశాను. మావారు కండోమ్స్ వాడుతున్నారు. ఒక నెలలో కండోమ్స్ వాడనందుకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆస్పత్రికి వెళితే డాక్టర్ నన్ను ప్రెగ్నెన్సీ ఉంచుకోండి అన్నారు. రెండేళ్ల వరకు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఒక పాపకు మూడేళ్లు, మరో పాపకు రెండేళ్లు. డాక్టర్ మందులు ఇచ్చారు. వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆ ట్యాబ్లెట్స్ నేను ఎన్నేళ్ల వరకు వాడవచ్చు? -స్వప్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలు చాలు అనుకున్నప్పుడు, ఇంకా గర్భం రాకుండా ఉండటానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి తాత్కాలిక పద్ధతులు. రెండోది పర్మనెంట్‌గా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం. తాత్కాలిక పద్ధతులు అంటే.. వాటిని వాడినంత కాలం గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ వంటివి ఎన్నో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్ అవుతాయి. మరికొందరికి సెట్ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్ సూచించిన మందులు అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్ అవ్వడానికి కాదు. వాటి వల్ల 100 శాతం అబార్షన్ అవుతుందని చెప్పలేం. బ్లీడింగ్ అయినప్పటికీ 10-15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వచ్చి... అప్పటికీ డాక్టర్‌ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మందులు ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు. వాటిని వాడేముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10-15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్ చేయించుకొని, మొత్తంగా అబార్షన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి. గర్భం 7-8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్‌లో ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకుండా, అబార్షన్‌కు మందులు వాడితే ట్యూబ్ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. కాబట్టి మీరు ఈ మందులను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇక పిల్లలు వద్దనుకుంటున్నారు కాబట్టి మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. రెండుసార్లు సిజేరియన్ అయింది కాబట్టి మళ్లీ ఆపరేషన్ అంటే భయంగా ఉంటే.. ల్యాపరోస్కోపీ ద్వారా పొట్ట మీద రంధ్రాలు వేసి చేసే బటన్హోల్ ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు లేదా మీవారు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. నా వయసు 20. నా బరువు 63 కిలోలు. పెళ్లికి ముందు 50 కిలోలు ఉండేదాన్ని. పెళ్లై ఏడాది అవుతుంది. నాకు సెక్స్ విషయంలో ఎలాంటి సమస్యా లేదు. కానీ అయిదు నెలల నుంచి వైట్ డిశ్చార్జ్‌లో వాసన వస్తోంది. దురద మొదట్లో ఉండేది కానీ ఇప్పుడేమీ లేదు. ఇది పిల్లలు పుట్టడానికి సమస్యగా మారుతుందేమోనని భయంగా ఉంది. అలాగే పెళ్లికాగానే నేను ఎందుకంత బరువు పెరిగానో అర్థం కావడం లేదు. దానికోసం థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే.. ఏమీ లేదని తెలిసింది. మరి ఎందుకు పెరిగానో చెప్పండి. -పేరు రాయలేదు ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ కొద్దిగా నీరులాగా, జిగురులాగా ఉండటం సాధారణమే. దానిలో వాసన, దురద ఉండదు. కొందరికి యోనిలో ఇన్ఫెక్షన్ చేరటం వల్ల, వైట్ డిశ్చార్జ్‌లో దురద, వాసన ఉంటాయి. దీనికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. భయపడుతూ ఇంట్లోనే ఉంటే.. ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై అది గర్భాశయానికి పాకి పిల్లలు పుట్టడానికి ఆటంకం రావచ్చు. కాబట్టి మీరు భయాన్ని పక్కనబెట్టి, డాక్టర్‌ను సంప్రదించండి. మీ దినచర్య ఎలా ఉంది, పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయా, మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా అన్న అంశాలను బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్య కూడా లేదు కాబట్టి ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, పని ఎక్కువగా లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల బరువు పెరగవచ్చు. పెళ్లయిన ఏడాదిలోనే 13 కేజీలు పెరిగారంటే.. మీ ఆయన మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థం అవుతుంది! ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి మీ బరువుకు పైన చెప్పిన కారణాలు కాకుండా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో పరీక్ష చేయించుకొని చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ లేకపోతే.. పరిమితమైన ఆహారం, దానిలో జంక్‌ఫుడ్, వేపుళ్లు, ఐస్‌క్రీమ్స్ తగ్గించి, రెగ్యులర్‌గా గంటపాటు వాకింగ్, వ్యాయామాలు చేసి బరువు తగ్గవచ్చు. అలా చేయకపోతే బరువు ఉన్నట్టుండి ఎక్కువ పెరగడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, పీసీఓ సమస్య వంటివి మొదలై పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది. - డా.వేనాటి శోభ