అత్యవసరమైతేనే... ఆ పిల్స్..!
సందేహం
నా వయసు 28, బరువు 63 కిలోలు, ఎత్తు నాలుగున్నర అడుగులు. సిజేరియన్ ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇంకా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోలేదు. లూప్ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద కారణంగా దాన్ని తీసేశాను. మావారు కండోమ్స్ వాడుతున్నారు. ఒక నెలలో కండోమ్స్ వాడనందుకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆస్పత్రికి వెళితే డాక్టర్ నన్ను ప్రెగ్నెన్సీ ఉంచుకోండి అన్నారు. రెండేళ్ల వరకు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఒక పాపకు మూడేళ్లు, మరో పాపకు రెండేళ్లు. డాక్టర్ మందులు ఇచ్చారు. వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆ ట్యాబ్లెట్స్ నేను ఎన్నేళ్ల వరకు వాడవచ్చు?
-స్వప్న
ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలు చాలు అనుకున్నప్పుడు, ఇంకా గర్భం రాకుండా ఉండటానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి తాత్కాలిక పద్ధతులు. రెండోది పర్మనెంట్‌గా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం. తాత్కాలిక పద్ధతులు అంటే.. వాటిని వాడినంత కాలం గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ వంటివి ఎన్నో ఉంటాయి.
ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్ అవుతాయి. మరికొందరికి సెట్ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్ సూచించిన మందులు అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్ అవ్వడానికి కాదు. వాటి వల్ల 100 శాతం అబార్షన్ అవుతుందని చెప్పలేం.
బ్లీడింగ్ అయినప్పటికీ 10-15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్లు వచ్చి... అప్పటికీ డాక్టర్‌ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు మందులు ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు.
వాటిని వాడేముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10-15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్ చేయించుకొని, మొత్తంగా అబార్షన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి. గర్భం 7-8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్‌లో ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకుండా, అబార్షన్‌కు మందులు వాడితే ట్యూబ్ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు.
కాబట్టి మీరు ఈ మందులను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇక పిల్లలు వద్దనుకుంటున్నారు కాబట్టి మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. రెండుసార్లు సిజేరియన్ అయింది కాబట్టి మళ్లీ ఆపరేషన్ అంటే భయంగా ఉంటే.. ల్యాపరోస్కోపీ ద్వారా పొట్ట మీద రంధ్రాలు వేసి చేసే బటన్‌హోల్ ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు లేదా మీవారు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు.
నా వయసు 20. నా బరువు 63 కిలోలు. పెళ్లికి ముందు 50 కిలోలు ఉండేదాన్ని. పెళ్లై ఏడాది అవుతుంది. నాకు సెక్స్ విషయంలో ఎలాంటి సమస్యా లేదు. కానీ అయిదు నెలల నుంచి వైట్ డిశ్చార్జ్‌లో వాసన వస్తోంది. దురద మొదట్లో ఉండేది కానీ ఇప్పుడేమీ లేదు. ఇది పిల్లలు పుట్టడానికి సమస్యగా మారుతుందేమోనని భయంగా ఉంది. అలాగే పెళ్లికాగానే నేను ఎందుకంత బరువు పెరిగానో అర్థం కావడం లేదు. దానికోసం థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే.. ఏమీ లేదని తెలిసింది. మరి ఎందుకు పెరిగానో చెప్పండి.
-పేరు రాయలేదు
ఆడవారిలో వైట్ డిశ్చార్జ్ కొద్దిగా నీరులాగా, జిగురులాగా ఉండటం సాధారణమే. దానిలో వాసన, దురద ఉండదు. కొందరికి యోనిలో ఇన్‌ఫెక్షన్ చేరటం వల్ల, వైట్ డిశ్చార్జ్‌లో దురద, వాసన ఉంటాయి. దీనికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి ఇన్‌ఫెక్షన్ తీవ్రతను బట్టి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. భయపడుతూ ఇంట్లోనే ఉంటే.. ఇన్‌ఫెక్షన్ ఇంకా ఎక్కువై అది గర్భాశయానికి పాకి పిల్లలు పుట్టడానికి ఆటంకం రావచ్చు.
కాబట్టి మీరు భయాన్ని పక్కనబెట్టి, డాక్టర్‌ను సంప్రదించండి. మీ దినచర్య ఎలా ఉంది, పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నాయా, మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా అన్న అంశాలను బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్య కూడా లేదు కాబట్టి ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, పని ఎక్కువగా లేకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల బరువు పెరగవచ్చు.
పెళ్లయిన ఏడాదిలోనే 13 కేజీలు పెరిగారంటే.. మీ ఆయన మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థం అవుతుంది! ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి మీ బరువుకు పైన చెప్పిన కారణాలు కాకుండా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో పరీక్ష చేయించుకొని చికిత్స తీసుకోవచ్చు.
సమస్య ఏమీ లేకపోతే.. పరిమితమైన ఆహారం, దానిలో జంక్‌ఫుడ్, వేపుళ్లు, ఐస్‌క్రీమ్స్ తగ్గించి, రెగ్యులర్‌గా గంటపాటు వాకింగ్, వ్యాయామాలు చేసి బరువు తగ్గవచ్చు. అలా చేయకపోతే బరువు ఉన్నట్టుండి ఎక్కువ పెరగడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, పీసీఓ సమస్య వంటివి మొదలై పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది.
- డా.వేనాటి శోభ