ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని...
సందేహం
నా వయసు 28. పెళ్లై రెండేళ్లు అవుతోంది. మొదటి ఏడాది పిల్లలు వద్దనుకొని పిల్స్ వాడాను. కానీ రెండో సంవత్సరం ఎలాంటి మందులు వాడలేదు. అయినా నాకింకా పిల్లలు కావడం లేదు. నా బరువు 64 కిలోలు. థైరాయిడ్ ఉంది. నా సమస్య ఏంటంటే... ఇటీవలి కాలంలో పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ అనే సమస్యే కారణమని టీవీల్లో, పేపర్లో చదువుతున్నాను. నాకు కూడా అలాంటి సమస్య ఏదైనా ఉందేమోనని భయంగా ఉంది. ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని చాలా భయంగా ఉంది. అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు మొదలయ్యాయి. పీసీఓడీ సమస్య ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటాయో దయచేసి చెప్పండి.
- ప్రభావతి, కాకినాడ
మీ బరువు రాశారు కానీ ఎత్తెంతో రాయలేదు. మీ పీరియడ్స్ సక్రమంగా నెల నెలా వస్తున్నాయో లేదో రాయలేదు. పీసీఓడీ అంటే గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఉండడం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సాధారణంగా అండాశయాలలో 5-8ఎంఎం ఫాలికల్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి 5 నుంచి 8 వరకు ఉంటాయి. పీసీఓడీ ఉన్నవారిలో చిన్న ఫాలికల్స్ 10,12 నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్, ఈ పీసీఓడీ ఉండే ఆడవారిలో ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు ఎక్కువగా రావడం, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు రావడం, కొందరిలో బరువు పెరగటం, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా ఏర్పడటం వంటి ఎన్నో లక్షణాలు కనిపించవచ్చు.
అందరికీ అన్నీ ఉండాలని ఏమీ లేదు. వారిలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలనెలా పెరిగి విడుదలయ్యే అండం, పీసీఓడీ ఉన్నవారిలో అండం పరిమాణం పెరగకపోవడం, విడుదల అవ్వకపోవడం వల్ల గర్భం ధరించడానికి ఇబ్బంది ఉంటుంది. కొంతమందిలో గర్భం వచ్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల పీసీఓడీ ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వారి వరకు వస్తుంది.
పేపర్లు, టీవీలు చూసుకుంటూ మీకు కూడా ఈ సమస్య ఉందేమోనని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే ఎలా? పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ ఒక్కటే సమస్య కాదు, థైరాయిడ్ సమస్య, ఇతర హార్మోన్లలో లోపాలు ఉండొచ్చు. ముందుగా మీరు ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మీలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి స్కానింగ్, రక్త పరీక్షలు, హార్మోన్ల పరీక్షలు వంటివి చేయించుకొని, అలాగే మీ వారికి కూడా వీర్య పరీక్ష చేయించి, సమస్యను బట్టి చికిత్స తీసుకోండి. కొందరిలో ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు 80శాతం మందే మొదటి ఏడాది లోపుల ప్రెగ్నెంట్ అవుతారు. 15 శాతం మంది రెండో సంవత్సరం అవుతుంటారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరం ఉంటుంది.
నా వయసు 25. మూడేళ్ల నుంచి నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. ఆ అబ్బాయి నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. ఇన్ని రోజులు ఆ తేడాను మేమెప్పుడూ ఆలోచించలేదు. కానీ రెండు నెలల క్రితం అతను నా దగ్గరకు వచ్చి, నన్ను పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. ఎందుకని అడిగితే... నేను తనకన్నా ఏడాది పెద్దదానినని అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నాడు. అతను అన్నట్లు నిజంగా ఏమైనా సమస్యలు వస్తాయా? దయచేసి సలహా ఇవ్వండి, అతణ్ని మరచిపోలేక రెండు నెలల నుంచి పిచ్చిదానిలా ఏడుస్తున్నాను.
- ఓ సోదరి
పెళ్లికి మగవారి వయసు, ఆడవారి కంటే పెద్దగా ఉండాలనేది సంప్రదాయంలో అలవాటు అయిపోయింది. మగవారు పెద్దగా ఉండడం వల్ల వారి మీద గౌరవంతో, కుటుంబాన్ని వారు ముందుకు నడిపిస్తారు అనే అభిప్రాయం ఉంది. మన సమాజంలో మనం మన అభిప్రాయాల కంటే చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి, సంప్రదాయానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలంటే కొంతమంది ఆలోచిస్తారు. అలాగే అతను కూడా ఆలోచించి ఉంటాడు. నిజంగా చెప్పాలంటే.. మీరు అతనికంటే ఏడాది పెద్దగా ఉండటం వల్ల శారీరకంగా గానీ, భవిష్యత్‌లో పుట్టే పిల్లలకు కానీ ఎలాంటి సమస్యలు రావు. నిజంగా మీ ఇద్దరు మనస్పూర్తిగా ప్రేమించుకొని ఉంటే, మీరు మెల్లిగా అతనికి ఈ విషయాన్ని నచ్చ చెప్పి చూడండి. దానివల్ల అతని మనసు మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వినకపోతే, మీరిద్దరూ ఓసారి డాక్టర్‌ను సంప్రదించండి.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్