PCOD
-
పిజ్జాలు, బర్గర్ల వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యా? అసలెందుకు వస్తుంది?
మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. ►తిరుపతి ఎమ్మార్పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. ► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార. ► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పీసీఓడీ ఎందుకొస్తుందంటే... ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరమవుతుంది. ఈ హార్మోన్ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఇలా ఉంటాయి నెలసరి సక్రమంగా రాదు ఎక్కువగా బ్లీడింగ్, రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. శరరీంలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. వ్యాధులు ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గర్భస్రావాలు, సంతాన లేమి మధుమేహం మానసిక జబ్బులు అసాధారణ గర్భాశయ రక్తస్రావం క్రమ రహిత రుతుక్రమం పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేసి నిర్థారిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... జీవనశైలిలోని మార్పులు కూడా పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం. ఫీజులు గుంజేస్తున్నారు.. గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. – డాక్టర్ ప్రభావతిదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు. – డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
ఆకాశ పండు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు దివ్యౌషధమో తెలుసా!
స్కై ఫ్రూట్ మహిళలలో వచ్చే పీఓసీడీ సమస్యలకు ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కనిపరిష్కారం. ఈ స్కై ఫ్రూట్ (ఆకాశపండు) గొప్పతనం గురించి ఆయర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. ఆధునిక వైద్య శాస్త్రంలో, స్కై ఫ్రూట్స్ ఖ్యాతి చాలా పాతది కానప్పటికీ, ఆగ్నేయాసియా దేశాలలో, అధిక రక్తపోటు పీసీఓడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సాంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. స్కైఫ్రూట్ ఎలా ఉపయోగించాలి? మీకు స్కై ఫ్రూట్ మొత్తం దొరికితే, దాన్ని పగలగొట్టి దాని గింజను బయటకు తీయండి. వెచ్చని నీటితో లోపలి విత్తనాన్ని నమలవచ్చు లేదా మింగవచ్చు. రుచి పరంగా, ఇది చాలా చేదుగా ఉంటుంది. మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువ ఉంటే, పూర్తి విత్తనాన్ని తీసుకోండి. మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే, సగం గింజను తినండి. ఇది టాబ్లెట్‌గానూ లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది. “ఉదయం, పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలని చెబుతున్నారు. గరిష్ట ప్రయోజనాల కోసం, స్కై ఫ్రూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ, కాఫీ, పాలు ఏదైనా ఇతర ఆహార పదార్థాలను తాగకుండా ఉండండి. స్కైఫ్రూట్ ప్రయోజనాలు.. “స్కై ఫ్రూట్" అందించే ప్రయోజనాలకు సంబంధించి సుదీర్ఘ జాబితానే ఉంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంతోపాటు వివిధ సమస్యలకు చెక్ పెడుతుంది కూడా. వాటిలో కొన్ని: చర్మ అలెర్జీకి చికిత్సలా పని చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఋతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలించుకోవడానికి సహాయపడుతుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది అల్జీమర్స్‌కు చికిత్స చేస్తుంది నపుంసకత్వానికి చికిత్స చేస్తుంది శరీర బలాన్ని మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఆస్తమా చికిత్సలో సహాయపడుతుంది నిద్రలేమికి చికిత్స చేస్తుంది ఆకలిని పెంచుతుంది మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది మలేరియాకు చికిత్స చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది కణితులతో పోరాడడంలో సహాయపడుతుంది ఆస్తమా చికిత్సలో ఉపయోగపడుతుంది హృదయనాళ వ్యవస్థను మెరుగుపరిచి, రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది కరోనరీ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆర్టెరియోస్క్లెరోసిస్ ఫలకాన్ని నివారిస్తుంది. ఈ పండులో ఉండే విటమిన్లు.. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. అదనంగా, స్కై ఫ్రూట్ విటమిన్లు, కొవ్వులు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సహజ ప్రోటీన్లు, ఎంజైమ్‌లు తోపాటు వివిధ ముఖ్యమైన పోషకాల విలువైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఈ ముఖ్యమైన పోషకాలన్నీ ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. స్కైఫ్రూట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు.. స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు వచ్చాయి. ఎవరైనా అనారోగ్యంగా భావిస్తే.. బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం, చీకటి మూత్రం వంటి కాలేయ గాయం వంటి లక్షణాలు కనిపిస్తే..అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మారడం, కామెర్లు వచ్చినా, స్కై ఫ్రూట్ తీసుకోవడం మానేసి వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఏదైనా వాడేముందు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో వారి సూచనలు సలహాల మేరకు వాడి మంచి ప్రయోజనాలను పొందండి. (చదవండి: చూపు లేదు కానీ క్యాన్సర్‌ని గుర్తిస్తారు) -
PCOD And PCOS రెండూ ఒకటేనా? ట్రీట్మెంట్
-
మాతృత్వానికే ప్రమాదకారి పీసీఓడీ!
ఈ మధ్యకాలంలో టీనేజ్ అమ్మాయిల నుంచి వివాహిత స్త్రీల వరకు అందర్ని బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది అండాశయంలో నీటి బుడగల సమస్య. వైద్య పరిభాషలో పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) లేదా పీసీఓడీ(పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్)గా పిలిచే ఈ సమస్యతో ప్రతి పదిమందిలో ఐదుగురు బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవాంఛిత రోమాలతో ఆరంభమై చివరకు మాతృత్వ మధురిమలు దక్కకుండా చేసే ఈ పీసీఓడీపై గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండే మన భారత్‌లో అవగాహన చాలా తక్కువ. కేవలం పట్టణాల్లో ఉండే వారిలో కొందరికి మాత్రమే దీని గురించి కొంచెంకొంచెంగా తెలుసు. పీసీఓడీకి సంపూర్ణ చికిత్స అందుబాటులో లేనందున దీన్ని ఆరంభంలోనే గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ఉత్తమం. అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏంటీ? ఎందుకు వస్తుంది? రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొవాలి?... చూద్దాం.. సాధారణంగా ప్రతిస్త్రీలోనూ రుతుక్రమ సమయంలో అండాశయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదల అవుతుంది. నెలసరి తర్వాత 11– 18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే హార్మోన్ ఈస్ట్రోజన్. కానీ కొందరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మేల్ హార్మోన్లుగా పిలిచే ‘ఆండ్రోజన్స్’ అధికంగా విడుదలవుతాయి. ఇది క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. పీసీఓడీతో బాధపడుతున్న వారిలో విడుదలయ్యే అండం పూర్తిగా ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. ఒక్కోక్కరిలో హర్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు(నీటి తిత్తులు) ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి. ఇప్పటివరకు ఈ సమస్య ఎందుకొస్తుందనేది, ఖచ్చితంగా తెలియదు. కానీ టెస్టొస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల అండాశయంలో అండం విడుదల కాకపోవడం, విడుదలైనా పెరగకపోవడం జరుగుతుంది. అండాలు.. అండాశయాలు ప్రతి స్త్రీ శరీరంలో గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు ఉంటాయి. వీటిలో ద్రవంతో నిండిన చిన్న చిన్న సంచుల్లాంటి నిర్మాణాల్లో అండాలు తయారవుతాయి. ఈ సంచులనే వైద్య పరిభాషలో ఫాలిక్యూల్స్ అంటారు. ప్రతి నెలా ఒక పాలిక్యూల్ ఎదిగి పరిపక్వం చెందిన అండాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన అండం, వీర్య కణంతో కలిసినప్పుడు ఫలిదీకరణం చెంది, జైగోట్ ఏర్పడి తర్వాతి దశలో పిండంగా ఎదుగుతుంది. ఈ ప్రక్రియ జరగని పక్షంలో ఆరోగ్యవంతమైన స్త్రీలకు నెలసరి వస్తుంది. అయితే అండం ఏర్పడి, పూర్తి స్థాయిలో ఎదిగి విడుదలయ్యే ప్రక్రియ మొత్తం హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఫాలిక్యూల్ ఎదగడానికి, ఆరోగ్యవంతమైన అండం తయారవడానికి హార్మోన్ల పాత్ర కీలకం. మెదడులోని హైపోథలామస్ అనే భాగం ఈ హార్మోన్ల విడుదలను నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నష్టాలేంటి... పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఊబకాయం, నెలసరి క్రమం తప్పడం, కొందరిలో నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి రావడం, రుతుక్రమ సమయంలో కొందరిలో అధికంగా రక్తస్రావం జరగడం, మరికొందరిలో సాధారణ స్రావానికంటే కూడా అతితక్కువగా రక్త స్రావం జరుగుతుంది.ఈ సమస్య ఉన్నవారిలో అండం సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల సంతానం కలగడానికి ఇది పెద్ద ఆటకంగా మారుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. దీంతో యుక్తవయసులో ఉన్న వారికి మొటిమలు అధికంగా రావడం, జుట్టురాలిపోవడం, స్త్రీలలో అవాంచిత రోమాలు పెరిగి పురుష లక్షణాలు కనిపిస్తాయి. ఇన్సులిన్ హోర్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో శరీరంలో ప్రతికూల వాతావరణంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలికంగా పీసీఓడీతో బాధపడుతున్న వారిలో టైప్–2 డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశాలు ఎక్కువ. గర్భం ధరించినప్పుడు మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు వంటి ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఫలితంగా పీసీఓడీతో బాధపడేవారు ఆత్మవిశ్వాసం కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. దీనివల్ల ఇతర రకాల సమస్యలు పెరుగుతాయి. -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
పీసీవోడీకి చికిత్స ఉందా?
నా భార్య వయసు 34 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. తరచూ తలనొప్పా? మీకు తరచూ తలనొప్పి వస్తోందా? కొంతమంది తలనొప్పి రాగానే మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఓ తలనొప్పి మాత్ర కొని ఠక్కున వేసుకుంటుంటారు. ఇలా అప్పుడప్పుడూ తలనొప్పి వస్తుండేవారు డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోండి. ►మీరు ఎప్పుడూ కంప్యూటర్ మీద వర్క్ చేస్తుండేవారైతే ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవుతూ ఉండాలి. కంప్యూటర్‌పై పని చేసే సమయంలో స్క్రీన్‌ను అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు. మీ కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం కూడా మంచిదే. ►కుట్లు, అల్లికలు వంటి పనులు చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తుండే సమయంలోనూ కళ్లు ఒత్తిడికి కాకుండా చూసుకోవాలి. తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం ద్వారా కంటిపై పడే అదనపు ఒత్తిడిని తగ్గించవచ్చు. ►పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కంటి చూపు సమస్యల కారణంగా తలనొప్పి వచ్చే అవకాశాలు వారిలో ఎక్కువగా ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ►రోజూ ప్రశాంతంగా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్ర మరీ ఎక్కువైనా కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది. ►మనకు సరిపడని పదార్థాలు తీసుకోవద్దు. ►ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి. ►కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్ చేయడం అవసరం. ►ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుంటే దానికే అలవాటు కావడం కూడా సరికాదు. ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంటే వాటిని పరిమితికి మించి తీసుకోవడం కూడా మంచిదికాదు. ►చీప్ సెంట్లు, అగరుబత్తీల్లాంటి ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడకూడదు. ►రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు. ఇలాంటి జాగ్రత్తల తర్వాత కూడా తలనొప్పులు తరచూ వస్తుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేగానీ... తలనొప్పి నివారణ మాత్రలు అదేపనిగా వాడటం సరికాదని గుర్తుంచుకోవాలి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
‘అప్పుడు నా బరువు 96 కేజీలు’
నా చేతిలో ఉన్న సూట్ కేస్ చూసి మా అమ్మ నన్ను గుర్తుపట్టింది అంటున్నారు బాలీవుడ్ తాజా సెన్సేషన్, సైఫ్ అమృతా సింగ్‌ల గారాల పట్టి సారా అలీఖాన్. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు సారా అలీఖాన్ దాదాపు 96 కేజీల బరువు ఉండేదంట. ఈ విషయం గురించి సారా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు పీసీఓడి ఉండేది. దాంతో నేను చాలా చబ్బీగా ఉండేదాన్ని. కానీ ఉన్నత చదువుల కోసం ఎప్పుడైతే అమెరికా వెళ్లానో.. అప్పటి నుంచి నేను విపరీతంగా బరువు పెరగడం ప్రారంభించాను. ఒకానొక సమయంలో నా బరువు 96 కేజీలు ఉండేది అంటూ చెప్పుకొచ్చారు సారా. అమెరికన్ తిండి వల్లే తాను ఇంతలా బరువు పెరిగానని చెప్పారు సారా. ‘అమెరికాలో పిజ్జా దొరుకుతుంది... చాకెలెట్ దొరుకుతుంది.. సలాడ్ కూడా దొరుకుతుంది. వీటన్నంటిని తినడంతో నేను బాగా లావయ్యాను’ అన్నారు. సారా మాట్లాడుతూ ‘అలాంటి సమయంలో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నాను. తొలుత ఈ విషయం గురించి మా అమ్మతో చెప్పినప్పుడు తను ముందు నువ్వు బరువు తగ్గు ఆ తర్వాతే.. సినిమాలు అన్నారు. అప్పటికి నా చదువు పూర్తవ్వడానికి ఇంకా రెండేళ్లు ఉంది. కానీ నేను ఒక్క సంవత్సరంలోను నా స్టడీస్‌ని కంప్లీట్ చేసుకుని.. మరో ఏడాదిలో నా బరువు తగ్గే ప్రయత్నాలు ప్రారంభించాను. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి అధిక బరువును తగ్గించుకున్నాను. తిరిగి ఇండియా వచ్చినప్పుడు.. మా అమ్మ కూడా నన్ను గుర్తు పట్టలేకపోయింది. నా చేతిలో ఉన్న సూట్‌కేస్ చూసి నన్ను గుర్తు పట్టింద’ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సారా రణ్వీర్ సింగ్సరసన సింబా చిత్రంలో నటిస్తున్నారు. -
నా బాధ మరింత పెరుగుతోంది...
నా ఎత్తు 5.2, బరువు 60 కిలోలు. నాకు పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. నాకింకా ప్రెగ్నెన్సీ రాలేదు. నాకు మొదట్నుంచీ పీరియడ్స్ సరిగా వచ్చేవి కావు. టాబ్లెట్స్ వేసుకున్నా లాభం లేదు. డాక్టర్‌ను కలిస్తే థైరాయిడ్ అన్నారు. అప్పట్నుంచీ రెగ్యులర్‌గా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. నాకు, మా వారికి పిల్లలంటే చాలా ఇష్టం. చుట్టు పక్కల వారందరికీ పిల్లలు కలుగుతుంటే.. నా బాధ మరింత పెరుగుతోంది. నా సమస్యకు తగ్గ సలహా ఇవ్వగలరు ప్లీజ్. - భవాని, ఊరు పేరు రాయలేదు మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడినప్పటి నుంచి పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. ఒకవేళ ఇంకా పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోతే, ఏ సమస్య వల్ల క్రమంగా పీరియడ్స్ రావట్లేదో.. కారణం తెలుసుకుని చికిత్స మొదలుపెట్టడం మంచిది. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నా, థైరాయిడ్ హార్మోన్ నార్మల్‌గా ఉందా లేదా మళ్లీ పరీక్ష చేయించుకొని, దాన్ని బట్టి థైరాయిడ్ మాత్రల మోతాదును మార్చి వాడవలసి ఉంటుంది. పీరియడ్స్ సక్రమంగా రానప్పుడు, చాలామందిలో అండం ఎదుగుదల ఉండకపోవచ్చు. దీనికి అండాశయాలలో నీటిబుడగలు (పీసీఓడీ), అధిక బరువు, మానసిక ఒత్తిడి, ఇతర హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాలు కావచ్చు. పిల్లలు కలగకపోవడానికి పైన చెప్పిన కారణాలతో పాటు ట్యూబ్‌లు మూసుకుపోవడం, మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలిక తగ్గటం వంటి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఇంట్లో ఉండి బాధ పడేకంటే మరొకసారి డాక్టర్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భాశయం, అండాశయాలు ఎలా ఉన్నాయి, అండం పెరుగుతుందా లేదా అని తెలుసుకొని, అవసరమైతే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీ వారికి కూడా వీర్యపరీక్ష చేయించి, అతనికి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడం మంచిది. నా వయసు 26. నా బరువు 57కిలోలు, నాకు సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. నేను పిల్లలు కాకుండా ఇంకా ఆపరేషన్ చేయించు కోలేదు. లూప్ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద కారణంగా దాన్ని తీసేశాను. మావారు కండోమ్స్ వాడుతున్నారు. ఒక నెలలో కండోమ్స్ వాడనందుకు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్‌ను కలిసి నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని చెబితే, ఏవో మందులు ఇచ్చారు. అవి వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు నాకు బ్లీడింగ్ అయింది. ఆ ట్యాబ్లెట్స్ నేను ఎన్ని సంవత్సరాల వరకు వాడవచ్చు? దీని వల్ల నా గర్భసంచికి ఏమైనా ప్రమాదం ఉందా? - పద్మజ, కడప మొదటి బాబు తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలిక పద్ధతులను అనుసరించాలి. అసలింక పిల్లలు వద్దనుకుంటే.... కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అంటే మీకైతే ట్యూబెక్టమీ ఆపరేషన్, మీవారికైతే వ్యాసెక్టమీ ఆపరేషన్. తాత్కాలిక పద్ధతులు అంటే.. ఇవి వాడినంత కాలమే గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ వంటివి ఎన్నో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్ అవుతాయి. మరికొందరికి సెట్ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్ ఇచ్చినవి అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు ఉంటే వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్ అవ్వడానికి కాదు. వీటి వల్ల 100 శాతం అబార్షన్ అవుతుందని చెప్పలేం. బ్లీడింగ్ అయినప్పటికీ 10-15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వచ్చి.. అప్పటికీ డాక్టర్‌ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇవి ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు. ఇవి వాడేముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10-15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్ చేయించుకొని, మొత్తంగా అబార్షన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి. గర్భం 7-8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్‌లో ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకుండా, అబార్షన్‌కు మందులు వాడితే ట్యూబ్ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. కాబట్టి మీరు ఈ కిట్‌ను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇంక పిల్లలు వద్దనుకుంటే మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు లేదా మీవారు సింపుల్‌గా అయిపోయే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. -
ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని...
సందేహం నా వయసు 28. పెళ్లై రెండేళ్లు అవుతోంది. మొదటి ఏడాది పిల్లలు వద్దనుకొని పిల్స్ వాడాను. కానీ రెండో సంవత్సరం ఎలాంటి మందులు వాడలేదు. అయినా నాకింకా పిల్లలు కావడం లేదు. నా బరువు 64 కిలోలు. థైరాయిడ్ ఉంది. నా సమస్య ఏంటంటే... ఇటీవలి కాలంలో పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ అనే సమస్యే కారణమని టీవీల్లో, పేపర్లో చదువుతున్నాను. నాకు కూడా అలాంటి సమస్య ఏదైనా ఉందేమోనని భయంగా ఉంది. ఎప్పటికీ పిల్లలు పుట్టరేమోనని చాలా భయంగా ఉంది. అత్తింటి వారి నుంచి సూటిపోటి మాటలు మొదలయ్యాయి. పీసీఓడీ సమస్య ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటాయో దయచేసి చెప్పండి. - ప్రభావతి, కాకినాడ మీ బరువు రాశారు కానీ ఎత్తెంతో రాయలేదు. మీ పీరియడ్స్ సక్రమంగా నెల నెలా వస్తున్నాయో లేదో రాయలేదు. పీసీఓడీ అంటే గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఉండడం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సాధారణంగా అండాశయాలలో 5-8ఎంఎం ఫాలికల్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి 5 నుంచి 8 వరకు ఉంటాయి. పీసీఓడీ ఉన్నవారిలో చిన్న ఫాలికల్స్ 10,12 నుంచి ఇంకా ఎక్కువగా ఉంటాయి. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్, ఈ పీసీఓడీ ఉండే ఆడవారిలో ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు ఎక్కువగా రావడం, జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు రావడం, కొందరిలో బరువు పెరగటం, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా ఏర్పడటం వంటి ఎన్నో లక్షణాలు కనిపించవచ్చు. అందరికీ అన్నీ ఉండాలని ఏమీ లేదు. వారిలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల నెలనెలా పెరిగి విడుదలయ్యే అండం, పీసీఓడీ ఉన్నవారిలో అండం పరిమాణం పెరగకపోవడం, విడుదల అవ్వకపోవడం వల్ల గర్భం ధరించడానికి ఇబ్బంది ఉంటుంది. కొంతమందిలో గర్భం వచ్చినా అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల పీసీఓడీ ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వారి వరకు వస్తుంది. పేపర్లు, టీవీలు చూసుకుంటూ మీకు కూడా ఈ సమస్య ఉందేమోనని భయపడుతూ ఇంట్లోనే కూర్చుంటే ఎలా? పిల్లలు కాకపోవడానికి పీసీఓడీ ఒక్కటే సమస్య కాదు, థైరాయిడ్ సమస్య, ఇతర హార్మోన్లలో లోపాలు ఉండొచ్చు. ముందుగా మీరు ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, మీలో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి స్కానింగ్, రక్త పరీక్షలు, హార్మోన్ల పరీక్షలు వంటివి చేయించుకొని, అలాగే మీ వారికి కూడా వీర్య పరీక్ష చేయించి, సమస్యను బట్టి చికిత్స తీసుకోండి. కొందరిలో ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు 80శాతం మందే మొదటి ఏడాది లోపుల ప్రెగ్నెంట్ అవుతారు. 15 శాతం మంది రెండో సంవత్సరం అవుతుంటారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరం ఉంటుంది. నా వయసు 25. మూడేళ్ల నుంచి నేను ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. ఆ అబ్బాయి నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. ఇన్ని రోజులు ఆ తేడాను మేమెప్పుడూ ఆలోచించలేదు. కానీ రెండు నెలల క్రితం అతను నా దగ్గరకు వచ్చి, నన్ను పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పాడు. ఎందుకని అడిగితే... నేను తనకన్నా ఏడాది పెద్దదానినని అంటున్నాడు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నాడు. అతను అన్నట్లు నిజంగా ఏమైనా సమస్యలు వస్తాయా? దయచేసి సలహా ఇవ్వండి, అతణ్ని మరచిపోలేక రెండు నెలల నుంచి పిచ్చిదానిలా ఏడుస్తున్నాను. - ఓ సోదరి పెళ్లికి మగవారి వయసు, ఆడవారి కంటే పెద్దగా ఉండాలనేది సంప్రదాయంలో అలవాటు అయిపోయింది. మగవారు పెద్దగా ఉండడం వల్ల వారి మీద గౌరవంతో, కుటుంబాన్ని వారు ముందుకు నడిపిస్తారు అనే అభిప్రాయం ఉంది. మన సమాజంలో మనం మన అభిప్రాయాల కంటే చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఏమనుకుంటారో అనే విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి, సంప్రదాయానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలంటే కొంతమంది ఆలోచిస్తారు. అలాగే అతను కూడా ఆలోచించి ఉంటాడు. నిజంగా చెప్పాలంటే.. మీరు అతనికంటే ఏడాది పెద్దగా ఉండటం వల్ల శారీరకంగా గానీ, భవిష్యత్‌లో పుట్టే పిల్లలకు కానీ ఎలాంటి సమస్యలు రావు. నిజంగా మీ ఇద్దరు మనస్పూర్తిగా ప్రేమించుకొని ఉంటే, మీరు మెల్లిగా అతనికి ఈ విషయాన్ని నచ్చ చెప్పి చూడండి. దానివల్ల అతని మనసు మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వినకపోతే, మీరిద్దరూ ఓసారి డాక్టర్‌ను సంప్రదించండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్