నా బాధ మరింత పెరుగుతోంది... | venati shoba sex problems solves | Sakshi
Sakshi News home page

నా బాధ మరింత పెరుగుతోంది...

Published Sun, Oct 16 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

నా బాధ మరింత పెరుగుతోంది...

నా బాధ మరింత పెరుగుతోంది...

 నా ఎత్తు 5.2, బరువు 60 కిలోలు. నాకు పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. నాకింకా ప్రెగ్నెన్సీ రాలేదు. నాకు మొదట్నుంచీ పీరియడ్స్ సరిగా వచ్చేవి కావు. టాబ్లెట్స్ వేసుకున్నా లాభం లేదు. డాక్టర్‌ను కలిస్తే థైరాయిడ్ అన్నారు. అప్పట్నుంచీ రెగ్యులర్‌గా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. నాకు, మా వారికి పిల్లలంటే చాలా ఇష్టం. చుట్టు పక్కల వారందరికీ పిల్లలు కలుగుతుంటే.. నా బాధ మరింత పెరుగుతోంది. నా సమస్యకు తగ్గ సలహా ఇవ్వగలరు ప్లీజ్.       
 - భవాని, ఊరు పేరు రాయలేదు
 
 మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడినప్పటి నుంచి పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. ఒకవేళ ఇంకా పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోతే, ఏ సమస్య వల్ల క్రమంగా పీరియడ్స్ రావట్లేదో.. కారణం తెలుసుకుని చికిత్స మొదలుపెట్టడం మంచిది. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నా, థైరాయిడ్ హార్మోన్ నార్మల్‌గా ఉందా లేదా మళ్లీ పరీక్ష చేయించుకొని, దాన్ని బట్టి థైరాయిడ్ మాత్రల మోతాదును మార్చి వాడవలసి ఉంటుంది. పీరియడ్స్ సక్రమంగా రానప్పుడు, చాలామందిలో అండం ఎదుగుదల ఉండకపోవచ్చు. దీనికి అండాశయాలలో నీటిబుడగలు (పీసీఓడీ), అధిక బరువు, మానసిక ఒత్తిడి, ఇతర హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాలు కావచ్చు.

పిల్లలు కలగకపోవడానికి పైన చెప్పిన కారణాలతో పాటు ట్యూబ్‌లు మూసుకుపోవడం, మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలిక తగ్గటం వంటి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఇంట్లో ఉండి బాధ పడేకంటే మరొకసారి డాక్టర్‌ను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భాశయం, అండాశయాలు ఎలా ఉన్నాయి, అండం పెరుగుతుందా లేదా అని తెలుసుకొని, అవసరమైతే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీ వారికి కూడా వీర్యపరీక్ష చేయించి, అతనికి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడం మంచిది.
 
 నా వయసు 26. నా బరువు 57కిలోలు, నాకు సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. నేను పిల్లలు కాకుండా ఇంకా ఆపరేషన్ చేయించు కోలేదు. లూప్ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద కారణంగా దాన్ని తీసేశాను. మావారు కండోమ్స్ వాడుతున్నారు. ఒక నెలలో కండోమ్స్ వాడనందుకు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్‌ను కలిసి నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని చెబితే, ఏవో మందులు ఇచ్చారు. అవి వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు నాకు బ్లీడింగ్ అయింది. ఆ ట్యాబ్లెట్స్ నేను ఎన్ని సంవత్సరాల వరకు వాడవచ్చు? దీని వల్ల నా గర్భసంచికి ఏమైనా ప్రమాదం ఉందా?                               
 - పద్మజ, కడప
 
 మొదటి బాబు తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలిక పద్ధతులను అనుసరించాలి. అసలింక పిల్లలు వద్దనుకుంటే.... కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అంటే మీకైతే ట్యూబెక్టమీ ఆపరేషన్, మీవారికైతే వ్యాసెక్టమీ ఆపరేషన్. తాత్కాలిక పద్ధతులు అంటే.. ఇవి వాడినంత కాలమే గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ వంటివి ఎన్నో ఉంటాయి.

ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్ అవుతాయి. మరికొందరికి సెట్ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్ ఇచ్చినవి అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు ఉంటే వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్ అవ్వడానికి కాదు. వీటి వల్ల 100 శాతం అబార్షన్ అవుతుందని చెప్పలేం. బ్లీడింగ్ అయినప్పటికీ 10-15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్లు వచ్చి.. అప్పటికీ డాక్టర్‌ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి.

 కొంతమందిలో బ్లీడింగ్ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇవి ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు. ఇవి వాడేముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10-15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్ చేయించుకొని, మొత్తంగా అబార్షన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి.

గర్భం 7-8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్‌లో ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకుండా, అబార్షన్‌కు మందులు వాడితే ట్యూబ్ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. కాబట్టి మీరు ఈ కిట్‌ను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇంక పిల్లలు వద్దనుకుంటే మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు లేదా మీవారు సింపుల్‌గా అయిపోయే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement