చట్ట ప్రకారమే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు  | Establishment of district headquarters as per law | Sakshi
Sakshi News home page

చట్ట ప్రకారమే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు 

Published Sat, Apr 6 2024 3:04 AM | Last Updated on Sat, Apr 6 2024 10:59 AM

Establishment of district headquarters as per law - Sakshi

ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు 

ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం 

పిటిషనర్ల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది 

ఆ తర్వాతే జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది 

కోర్టులు ప్రభుత్వ నిర్ణయాన్ని పరీక్షించజాలవు 

ఆ నిర్ణయ ప్రక్రియను మాత్రమే పరీక్షించగలవు 

సీజే నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీర్పు 

జిల్లా కేంద్రాల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టివేత 

సాక్షి, అమరావతి: హిందూపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని ఆ జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అదే విధంగా.. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సమర్థించి  ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది.

ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్‌లు)ను హైకోర్టు కొట్టేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, తదనుగుణ ఉత్తర్వులు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అభ్యంతరాలను ఆహ్వానించడమే కాక, వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుందని తేల్చిచెప్పింది.

ఆ తర్వాతే తుది నోటిఫికేషన్‌ జారీచేసిందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.  

జిల్లా కేంద్రాల ఏర్పాటుపై పిల్‌లు.. 
హిందూపూర్‌ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని జిల్లా ప్రధాన కేంద్రంగా మారుస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హిందూపూర్‌ అఖిలపక్ష కమిటీ కన్వినర్‌ బాలాజీ మనోహర్‌ 2022లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పుట్టపర్తిని కాకుండా హిందూపూర్‌ను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే, అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రాన్ని రాయచోటిగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి అన్నమయ్య జిల్లా కన్వినర్‌ టి.లక్ష్మీనారాయణ 2022లో పిల్‌ దాఖలు చేశారు.

రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో అడ్వొకేట్స్‌ జేఏసీ రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు న్యాయవాదుల సంఘంతో పాటు చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ సాధు సుబ్రహ్మణ్యం పంత్‌ వేర్వేరుగా పిల్‌లు దాఖలు చేశారు. మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ వై. వీరవెంకట సత్యనారాయణ రామరాజు అనే వ్యక్తి పిల్‌ దాఖలు చేశారు.

వీటన్నింటిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఈ ఏడాది జనవరి 3న తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా.. గురువారం తన తీర్పులను వెలువరించింది. జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే, ప్రభుత్వ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల ఏర్పాటు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. తీర్పు ప్రధాన పాఠం ఇలా.. 

జిల్లాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు.. 
‘2014 పునరి్వభజన చట్టం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలుగా విభజించారు. 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైంది. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టంలోని సెక్షన్‌ 3 (1) ప్రకారం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచెయ్యొచ్చు. పాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం సెక్షన్‌ 3 (2) కింద కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పాటుచేయవచ్చు. అంతేకాక.. జిల్లాలో, రెవెన్యూ డివిజన్‌లో, మండలాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు.

అలాగే, ఈ సెక్షన్‌ కింద నోటిఫికేషన్‌ జారీచేసి జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం విస్తీర్ణాన్ని పెంచొచ్చు, కుదించవచ్చు. సరిహద్దులను కూడా మార్చొచ్చు. సెక్షన్‌–4 కింద నిబంధనలను రూపొందించవచ్చు. ఈ చట్ట నిబంధనల కింద రాష్ట్ర ప్రభుత్వం 2020లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి సహకరించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలనూ ఏర్పాటుచేసింది.  
అభ్యంతరాలను పట్టించుకోలేదన్నది పిటిషనర్ల ఆరోపణ.. 
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలను ఆహా్వనిస్తూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ జారీచేసింది. దీ­నికి అనుగుణంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను తెలిపారు. అయితే, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో చట్ట విరుద్ధంగా వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ.

అయితే, ప్ర­భుత్వం మాత్రం వీరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసు­కుని చట్ట ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది. ఈ విషయంలో మేం ప్రభుత్వ కౌంటర్లను పరిశీలించాం. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే  తుది నో­టిఫికేషన్‌ జారీచేసిందని ప్రభుత్వం తన కౌంటర్లలో పేర్కొంది. అంతేకాక.. కోనసీమ జిల్లా పేరును బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా కూడా మార్చిన విషయం తెలిపింది.  

ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియనే కోర్టులు పరీక్షించగలవు.. 
ప్రభుత్వం కేవలం అభ్యంతరాలను ఆహా్వనించడమే కాకుండా పిటిషన్ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ తరువాతే తుది నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు రఘుపతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఏపీ కేసులో ఇచ్చిన తీర్పును ఉదహరించడం అవసరం. ప్రభుత్వం మండల ప్రధాన కేంద్రాల ఏర్పాటులో జారీచేసిన నోటిఫికేషన్‌ విషయంలో ఇదే హైకోర్టు జోక్యం చేసుకుంటూ, ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

మండల కేంద్రం ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వ పాలన నిర్ణయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే స్థిరపరిచిన న్యాయ సూత్రం ప్రకారం అధికరణ 226 కింద న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాన్ని పరీక్షించజాలవు. ఆ నిర్ణయ ప్రక్రియను మాత్రమే పరీక్షించగలవు. ప్రస్తుత కేసులో జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించలేదు. అందువల్ల ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement