district headquarters
-
చట్ట ప్రకారమే జిల్లాల ప్రధాన కేంద్రాల ఏర్పాటు
సాక్షి, అమరావతి: హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని ఆ జిల్లా కేంద్రంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అదే విధంగా.. అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటిగా చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను, రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన కోనసీమ జిల్లాలో విలీనం చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు సమర్థించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్లు)ను హైకోర్టు కొట్టేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, తదనుగుణ ఉత్తర్వులు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ప్రకటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం అభ్యంతరాలను ఆహ్వానించడమే కాక, వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుందని తేల్చిచెప్పింది. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ జారీచేసిందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై పిల్లు.. హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని శ్రీసత్యసాయి జిల్లాగా ప్రకటించి, పుట్టపర్తిని జిల్లా ప్రధాన కేంద్రంగా మారుస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హిందూపూర్ అఖిలపక్ష కమిటీ కన్వినర్ బాలాజీ మనోహర్ 2022లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పుట్టపర్తిని కాకుండా హిందూపూర్‌ను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే, అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రాన్ని రాయచోటిగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి అన్నమయ్య జిల్లా కన్వినర్ టి.లక్ష్మీనారాయణ 2022లో పిల్ దాఖలు చేశారు. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో అడ్వొకేట్స్ జేఏసీ రాజంపేట, రైల్వే కోడూరు, నందలూరు న్యాయవాదుల సంఘంతో పాటు చార్టెర్డ్ అకౌంటెంట్ సాధు సుబ్రహ్మణ్యం పంత్ వేర్వేరుగా పిల్లు దాఖలు చేశారు. మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురంను కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ వై. వీరవెంకట సత్యనారాయణ రామరాజు అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఈ ఏడాది జనవరి 3న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా.. గురువారం తన తీర్పులను వెలువరించింది. జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో తమ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే, ప్రభుత్వ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. తీర్పు ప్రధాన పాఠం ఇలా.. జిల్లాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు.. ‘2014 పునరి్వభజన చట్టం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు. 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టంలోని సెక్షన్ 3 (1) ప్రకారం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచెయ్యొచ్చు. పాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధి కోసం సెక్షన్ 3 (2) కింద కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు ఏర్పాటుచేయవచ్చు. అంతేకాక.. జిల్లాలో, రెవెన్యూ డివిజన్లో, మండలాల్లో కావాల్సిన ప్రాంతాలను కలపొచ్చు. అలాగే, ఈ సెక్షన్ కింద నోటిఫికేషన్ జారీచేసి జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం విస్తీర్ణాన్ని పెంచొచ్చు, కుదించవచ్చు. సరిహద్దులను కూడా మార్చొచ్చు. సెక్షన్–4 కింద నిబంధనలను రూపొందించవచ్చు. ఈ చట్ట నిబంధనల కింద రాష్ట్ర ప్రభుత్వం 2020లో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసే విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి సహకరించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలనూ ఏర్పాటుచేసింది. అభ్యంతరాలను పట్టించుకోలేదన్నది పిటిషనర్ల ఆరోపణ.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాలను ఆహా్వనిస్తూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి అనుగుణంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను తెలిపారు. అయితే, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో చట్ట విరుద్ధంగా వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అయితే, ప్రభుత్వం మాత్రం వీరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది. ఈ విషయంలో మేం ప్రభుత్వ కౌంటర్లను పరిశీలించాం. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నోటిఫికేషన్ జారీచేసిందని ప్రభుత్వం తన కౌంటర్లలో పేర్కొంది. అంతేకాక.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కూడా మార్చిన విషయం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియనే కోర్టులు పరీక్షించగలవు.. ప్రభుత్వం కేవలం అభ్యంతరాలను ఆహా్వనించడమే కాకుండా పిటిషన్ల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ తరువాతే తుది నోటిఫికేషన్ జారీచేసింది. ఇక్కడ సుప్రీంకోర్టు రఘుపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఇచ్చిన తీర్పును ఉదహరించడం అవసరం. ప్రభుత్వం మండల ప్రధాన కేంద్రాల ఏర్పాటులో జారీచేసిన నోటిఫికేషన్ విషయంలో ఇదే హైకోర్టు జోక్యం చేసుకుంటూ, ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మండల కేంద్రం ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వ పాలన నిర్ణయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే స్థిరపరిచిన న్యాయ సూత్రం ప్రకారం అధికరణ 226 కింద న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాన్ని పరీక్షించజాలవు. ఆ నిర్ణయ ప్రక్రియను మాత్రమే పరీక్షించగలవు. ప్రస్తుత కేసులో జిల్లా ప్రధాన కేంద్రాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించలేదు. అందువల్ల ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేస్తున్నాం’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
ప్రతి జిల్లా కేంద్రానికి అథారిటీ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ ► అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు ► చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు ► అన్నింటికీ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం ► పట్టణాలు అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికలు ► శరవేగంగా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అనతి కాలంలోనే అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయని... అవి అడ్డదిడ్డం గా, అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికాబద్ధం గా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతర పాలనా వ్యవస్థపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి అదర్ సిన్హా, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాలన్నీ త్వరలోనే పెద్ద పట్టణాలుగా, నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో పట్టణ జనాభా ఇప్పటికే 45 శాతం ఉందని.. ఇది ఇంకా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సమగ్ర ప్రణాళిక ఉండాలి ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని.. ప్రభుత్వ కార్యాలయాలు, నివా స గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడ ఎలా ఉండాలనే దానిపై సమగ్ర ప్రణాళికలు ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరపకుండా, సమగ్ర పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునేలా విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పట్టణాల పరిధిలోనే కాకుండా చుట్టూ దాదాపు 10 కి.మీ. విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలన్నారు. హైదరాబాద్ నగరం మాదిరిగా కిక్కిరిసిపోకుండా ఉం డేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెరిగే జనాభాను కూడా అంచనా వేసి పట్టణాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వారికి తగు సూచనలు చేస్తూ పాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక వనరులను గుర్తించి ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు. -
సరి‘కొత్త’గా కలెక్టరేట్లు
♦ కొత్త జిల్లాల్లో అత్యాధునిక రీతిలో నిర్మాణం ♦ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ♦ 25 ఎకరాల్లో భవన నిర్మాణాలు... అన్ని జిల్లాలకు ఒకే నమూనా ♦ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటవనున్న కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని కార్యాలయాలనూ ఒకేచోటికి చేరుస్తూ కేంద్రీకృత కలెక్టరేట్లు రానున్నాయి. ఈ కొత్త కలెక్టర్ కార్యాలయాలు అత్యాధునిక తరహాలో రూపుదిద్దుకోనున్నాయి. కొత్త జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం పలు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్కిటెక్టులతో సమీక్ష జరిపారు. సమగ్ర పాలన అందాలంటే ప్రభుత్వ విభాగాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్ కేంద్రంగా ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోటకు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన బహుళ అంతస్తుల సముదాయంగా జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం ఉండాలని ఆయన నిర్ణయించారు. విశాలమైన గదులతో, ఎత్తుగా, పురాతన బంగ్లాలను పోలిన శైలిలో నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఇప్పుడున్న జిల్లా కేంద్రాల్లో కూడా నూతన కార్యాలయాలను నిర్మించాలని సూచించారు. పూర్తిస్థాయి ఆప్టిక్ ఫైబర్‌తో, ఇంకుడు గుంతలతో కలెక్టరేట్లన్నీ ఒకే పోలికతో ఆర్కిటెక్ట్ డిజైన్ ఉండాలన్నారు. కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఇప్పుడున్న కలెక్టర్ కార్యాలయాలు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేవని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల్లో ఆ పరిస్థితి ఉండకూడదన్నారు. పోలీస్ శాఖ, జిల్లా పరిషత్, ట్రాన్స్‌కో, ఆర్టీసీ, కోర్టుల వంటి కొన్ని కార్యాలయాలు మినహా రెవెన్యూ, విద్య, సంక్షేమ, సహకార, ఆరోగ్య తదితర 30 ప్రజాసంబంధ శాఖలు కలెక్టరేట్ పరిధిలోనే ఉండాలన్నారు. అత్యవసర ప్రమాద సమయాల్లో కలెక్టర్, ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లడానికి హెలికాప్టర్లలో ప్రయాణానికి వీలుగా హెలిప్యాడ్లు నిర్మించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్లో పార్కింగ్ సౌకర్యంతో పాటు పచ్చని గార్డెన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయి సమావేశాలకు ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యాలయాలను వాడుతున్నారని, దానికి స్వస్తి చెప్పాలని సూచించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, కలెక్టర్లు రాహుల్ బొజ్జా(హైదరాబాద్), రఘునందన్‌రావు(రంగారెడ్డి), రొనాల్డ్ రాస్ (మెదక్), ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ గణపతి రెడ్డి, వాటర్‌వర్క్స్ ఎండీ లోకేష్, సీఎంఓ అధికారులు శాంతికుమారి, స్మిత సబర్వాల్, భూపాల్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడం ఇక్కడ సంచలనం కలిగించింది. ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఆయన డబ్బులు డిమాండ్ చేయడం తో బాధితుడు ఏ సీబీ అధికారును ఆశ్రయించారు. నగరంలోని బోధ న్ రోడ్డు ప్రాంతం లో నివాసం ఉం డే మీర్ జావెద్ అలీ తనకు వరుసకు సోదరుడైన నిస్సార్ మొయినుద్దీన్ నుంచి ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అతనికి సంబంధించిన రెండు ఓపెన్ ప్లాట్లు, రెండు ఇండ్లు, మూడు షాపులు నగరంలోని ఖలీల్‌వాడి ప్రాం తంలో ఉన్నాయి. వీటిని మీర్ జావేద్ అలీ కొనుకున్నారు. ఆస్తులు ఒక కోటి రూపాయలు విలువ చేయగా.. జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ)రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఒక శాతం కింద 1 లక్ష రూపాయలను రిజిస్ట్రార్ కార్యాలయంలో జనవరి 25న చెల్లించారు. దాంతో అధికారులు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పూర్తి చేశారు. పథకం ప్రకారం ఈ డాక్యుమెంట్స్ 24 గంటల్లోగా ఆస్తులు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇవ్వవలసి ఉంటుంది. పూర్తి చేసిన డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్-2 ఎల్ రవీందర్ తన వద్ద ఉంచుకున్నారు. తనకు రూ. 60 వేలు ఇస్తేనే డాక్యుమెంట్స్ ఇస్తానని జావెద్ అలీతో పేర్కొన్నారు. కొన్ని రోజులు కార్యాలయం చుట్టూ తిరిగిన జావెద్ చివరికి రూ.30 వేలు ఇవ్వడానికి సబ్ రిజిస్ట్రార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే లంచం ఇవ్వటం ఇష్టం లేని జావెద్ అలీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు కెమికల్ పూసి ఇచ్చిన నోట్లను జావెద్ శనివారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్ రోడ్డు, కవితా కాంప్లెక్స్‌లోని సబ్‌రిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి రవీందర్‌కు అందించారు. సబ్‌రిజిస్ట్రార్ డబ్బులను తన టేబుల్ డ్రాలో వేసుకుంటుండగా అక్కడే కాపుకాసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ టేబుల్ డ్రాలో ఉన్న మరో రూ.44,700 లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ స్పెషల్‌కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సంజీవరావు విలేకరులతో తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ రఘునాథ్, ఎస్ఐ ఖుర్షీద్ అలీ సిబ్బంది పాల్గొన్నారు. -
సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తా: కేసీఆర్
మెదక్ : తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకున్నా సిద్ధిపేట ప్రజల రుణం తీర్చుకోలేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. సిద్ధపేట పర్యటనలో భాగంగా ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్ధిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తామన్నారు. హైదరాబాద్‌తో సమానంగా సిద్ధిపేటను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీటిని అందిస్తామని, అలాగే ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.