ప్రతి జిల్లా కేంద్రానికి అథారిటీ
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
► అన్ని జిల్లా కేంద్రాల్లో పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు
► చుట్టూ పది కిలోమీటర్ల విస్తీర్ణంలో లేఅవుట్లు
► అన్నింటికీ ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం
► పట్టణాలు అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికలు
► శరవేగంగా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు అనతి కాలంలోనే అభివృద్ధి కేంద్రాలుగా మారుతాయని... అవి అడ్డదిడ్డం గా, అస్తవ్యస్తంగా పెరగకుండా ప్రణాళికాబద్ధం గా ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనంతర పాలనా వ్యవస్థపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జీఏడీ కార్యదర్శి అదర్ సిన్హా, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాలన్నీ త్వరలోనే పెద్ద పట్టణాలుగా, నగరాలుగా అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో పట్టణ జనాభా ఇప్పటికే 45 శాతం ఉందని.. ఇది ఇంకా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
సమగ్ర ప్రణాళిక ఉండాలి
ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని.. ప్రభుత్వ కార్యాలయాలు, నివా స గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ఎక్కడ ఎలా ఉండాలనే దానిపై సమగ్ర ప్రణాళికలు ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరపకుండా, సమగ్ర పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునేలా విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)ల తరహాలో ప్రతి జిల్లా కేంద్రానికి పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పట్టణాల పరిధిలోనే కాకుండా చుట్టూ దాదాపు 10 కి.మీ. విస్తీర్ణంలో లేఅవుట్లు రూపొందించాలన్నారు.
హైదరాబాద్ నగరం మాదిరిగా కిక్కిరిసిపోకుండా ఉం డేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెరిగే జనాభాను కూడా అంచనా వేసి పట్టణాలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఉత్సాహంతో పనిచేస్తున్నారని.. వారికి తగు సూచనలు చేస్తూ పాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక వనరులను గుర్తించి ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు.