సరి‘కొత్త’గా కలెక్టరేట్లు
♦ కొత్త జిల్లాల్లో అత్యాధునిక రీతిలో నిర్మాణం
♦ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట
♦ 25 ఎకరాల్లో భవన నిర్మాణాలు... అన్ని జిల్లాలకు ఒకే నమూనా
♦ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటవనున్న కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని కార్యాలయాలనూ ఒకేచోటికి చేరుస్తూ కేంద్రీకృత కలెక్టరేట్లు రానున్నాయి. ఈ కొత్త కలెక్టర్ కార్యాలయాలు అత్యాధునిక తరహాలో రూపుదిద్దుకోనున్నాయి. కొత్త జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం పలు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్కిటెక్టులతో సమీక్ష జరిపారు. సమగ్ర పాలన అందాలంటే ప్రభుత్వ విభాగాలన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్ కేంద్రంగా ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోటకు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన బహుళ అంతస్తుల సముదాయంగా జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం ఉండాలని ఆయన నిర్ణయించారు. విశాలమైన గదులతో, ఎత్తుగా, పురాతన బంగ్లాలను పోలిన శైలిలో నిర్మాణాలను చేపట్టాలన్నారు. ఇప్పుడున్న జిల్లా కేంద్రాల్లో కూడా నూతన కార్యాలయాలను నిర్మించాలని సూచించారు. పూర్తిస్థాయి ఆప్టిక్ ఫైబర్‌తో, ఇంకుడు గుంతలతో కలెక్టరేట్లన్నీ ఒకే పోలికతో ఆర్కిటెక్ట్ డిజైన్ ఉండాలన్నారు. కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థలాలను ఎంపిక చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
ఇప్పుడున్న కలెక్టర్ కార్యాలయాలు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేవని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల్లో ఆ పరిస్థితి ఉండకూడదన్నారు. పోలీస్ శాఖ, జిల్లా పరిషత్, ట్రాన్స్‌కో, ఆర్టీసీ, కోర్టుల వంటి కొన్ని కార్యాలయాలు మినహా రెవెన్యూ, విద్య, సంక్షేమ, సహకార, ఆరోగ్య తదితర 30 ప్రజాసంబంధ శాఖలు కలెక్టరేట్ పరిధిలోనే ఉండాలన్నారు. అత్యవసర ప్రమాద సమయాల్లో కలెక్టర్, ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లడానికి హెలికాప్టర్లలో ప్రయాణానికి వీలుగా హెలిప్యాడ్లు నిర్మించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్లో పార్కింగ్ సౌకర్యంతో పాటు పచ్చని గార్డెన్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా స్థాయి సమావేశాలకు ప్రస్తుతం పంచాయతీరాజ్ కార్యాలయాలను వాడుతున్నారని, దానికి స్వస్తి చెప్పాలని సూచించారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, కలెక్టర్లు రాహుల్ బొజ్జా(హైదరాబాద్), రఘునందన్‌రావు(రంగారెడ్డి), రొనాల్డ్ రాస్ (మెదక్), ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ గణపతి రెడ్డి, వాటర్‌వర్క్స్ ఎండీ లోకేష్, సీఎంఓ అధికారులు శాంతికుమారి, స్మిత సబర్వాల్, భూపాల్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.