ప్రతీకాత్మక చిత్రం
నా వయసు 29 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది. డాక్టర్ల సలహాపై చాలాకాలం మందులు, ఇన్‌హేలర్ వాడాను. ఇప్పుడు నేను గర్భిణిని. నాలుగో నెల. ఇదివరకు నేను వాడిన మందుల ప్రభావం నాకు పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందా?
– అమరేశ్వరి, భీమవరం
ఉబ్బసం వ్యాధి అంటే ఆస్తమా. కొన్ని రకాల అలర్జీల వల్ల లేదా శ్వాస నాళాలలో లేదా ఊపిరితిత్తులలో సమస్య వల్ల రావచ్చు. వీటికోసం దీర్ఘకాలం మందులు వాడవలసి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత, ఆ సమయంలో ఏర్పడే హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, ఉబ్బసం లక్షణాల తీవ్రత ఉంటుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది. వాడకపోతే తల్లికి ఇబ్బందితో పాటు కడుపులో బిడ్డకు కూడా శ్వాస తగ్గడం, ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాల వల్ల, కొన్ని సార్లు బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు మందులు వాడవలసినప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో బిడ్డపై ప్రభావం పడని మోతాదులో మందులు వాడవచ్చు. నువ్వు మందులు గర్భం దాల్చిన తర్వాత వాడలేదు కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడినా, మందులను డాక్టర్‌కు చూపిస్తే ఆ మందులలో మోతాదు ఎంత ఉంది, వాటివల్ల బిడ్డపై ప్రభావం ఎంత వరకు ఉండవచ్చు అనేది అంచనా వేసి చెప్తారు. ఒకసారి 5వ నెల చివరిలో టిఫా స్కానింగ్ చేయించుకుంటే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది 90 శాతం వరకు గుర్తించవచ్చు.
మా అమ్మాయి వయసు పదేళ్లు. రెండు వారాల కిందటే మెచ్యూర్ అయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు.
– భవాని, నెల్లూరు
పదేళ్ల వయస్సు అంటే ఆడే పాడే చిన్న లేత వయస్సు. ఇంత చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం వల్ల వారికి అది కొత్తగా కనిపించడం, న్యాప్‌కిన్స్ వాడటం వంటి విషయాలలో కొద్దిరోజుల వరకు అయోమయంగా ఉంటుంది. మీరు మెల్లగా మీ పాపకి పీరియడ్స్ అంటే ఏమిటి? బ్లీడింగ్ ఎలా అవుతుంది, ఎలా జాగ్రత్త పడాలి, న్యాప్‌కిన్స్ ఎలా వాడాలి, ఆ సమయంలో ఉండే అసౌకర్యాలు, కడుపునొప్పి, శరీరంలో వచ్చే మార్పులు వంటి అనేక విషయాలను అర్థం అయ్యేలాగ వివరించి చెప్పండి. ఇది పిల్లలు శారీరకంగా పెరిగే వయసు కాబట్టి పప్పు, ఆకుకూరలు, పండ్లు, పాలు, మితమైన మాంసాహారం వంటి పౌష్టికాహారం ఇవ్వాలి. మెచ్యూర్ అయినా ఒకటి, రెండూ లేదా మూడు సంవత్సరాల వరకూ పీరియడ్స్ చాలామందిలో సక్రమంగా ఉండకుండా, ఎప్పుడంటే అప్పుడు రావడం, ఎక్కువగా అవ్వటం వంటివి ఉండవచ్చు. కాబట్టి స్కూల్‌లో ఇబ్బంది పడకుండా స్కూల్ బ్యాగ్‌లో ఎక్స్‌ట్రా న్యాప్‌కిన్స్, ప్యాంటీస్ వంటివి ఉంచటం మంచిది.
నా వయసు 27 సంవత్సరాలు, బరువు 40 కిలోలు. నాకు పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇదివరకు పీరియడ్స్ సరిగా వచ్చేవి కావు. అయితే, మందులు వాడిన తర్వాత ఆరు నెలల పాటు పీరియడ్స్ రెగ్యులర్‌గానే వచ్చాయి. గతనెల పీరియడ్ రావాల్సి ఉన్నా, రాలేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ అని వచ్చింది. స్కానింగ్ చేయించుకుంటే పీసీఓడీ అని చెప్పారు. థైరాయిడ్ సమస్య లేదని పరీక్షల్లో తేలింది. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
– దేవి, తాడేపల్లిగూడెం
పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్. ఇందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో (ఓవరీస్) చిన్న చిన్న నీటి బుడగలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటి వల్ల రక్తంలో, మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఏండ్రోజన్ హార్మోన్ పీసీఓడీ ఉండేవారిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అధిక మోతాదులో టెస్టోస్టిరాన్, ఇంకా ఇతర హార్మోన్ల విడుదల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి నెలనెలా తయారయ్యి విడుదలయ్యే అండం సరిగా పెరగకపోవడం, విడుదల కాకపోటం, దాని నాణ్యత సరిగా లేకపోవటం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం, అధికంగా మొటిమలు, అవాంఛిత రోమాలు ఏర్పడటం... వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడతాయి. అండం పెరగటంలో సమస్య వల్ల, సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఏర్పడతాయి.
ఇవి కొందరిలో అధిక బరువు, సన్నగా ఉన్నవారిలో కూడా జన్యుపరమైన సమస్య వల్ల, ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచెయ్యకపోవటం వల్ల, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. నువ్వు 40 కేజీల బరువు అంటే లీన్ పీసీఓ క్యాటగిరీ కింద వస్తావు. నువ్వు డాక్టర్ పర్యవేక్షణలో, పీసీఓడీ వల్ల నీలో ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యత తగ్గడానికి మందులు వాడుకుంటూ, అండం తయారవ్వటానికి మందులు, వాడటం వల్ల నీకు గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ చికిత్సకు, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. ఓపిక పట్టవలసి ఉంటుంది. మందులతో గర్భం నిలవనప్పుడు, ల్యాప్రోస్కోపీ అనే చిన్న ఆపరేషన్ ద్వారా, నీటి బుడగలను కొన్ని తొలగించి, మరలా చికిత్స తీసుకోవలసి వస్తుంది.
- డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్‌బో, హైదర్‌నగర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment