
పాపాయి చర్మం పొడిబారుతోంది!
డాక్టర్ సలహా
మా పాప వయసు ఆరు నెలలు. పాప శారీరక, మానసిక ఎదుగుదల వయసుకు తగినట్లుగానే ఉంది. కానీ చర్మం మాత్రం విపరీతంగా పొడిబారుతోంది. ముఖ్యంగా కాళ్ల మీద (మోకాళ్ల కింద నుంచి పాదాల వరకు) చర్మం పగుళ్లుబారుతోంది. స్నానానికి ముందు నూనె రాస్తున్నాం. స్నానం చేయించిన గంట సేపటికే చర్మం పొడిబారి గీతలు వస్తున్నాయి. నూనె రాయడం మానేస్తే చర్మం పగులుతోంది.
- ఎస్. ప్రవీణ, ఏలూరు
మీ పాప సమస్య ఎగ్జిమా అయి ఉండవచ్చు. ఎగ్జిమా కారణంగా చర్మం సున్నితంగా మారుతుంది. చిన్నపాటి అసౌకర్యానికి కూడా ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. ముఖ్యంగా ఆహారంలో సరిపడని పదార్థం తీసుకున్నా, వాతారణంలో చిన్న మార్పు వచ్చినా చర్మం ప్రభావితమవుతుంది. చర్మం ఎర్రగా మారడం, మంట, దురద పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది పెద్ద సమస్యేమీ కాదు. దీనికి పరిష్కారం చర్మాన్ని పొడిబారనివ్వకుండా చూసుకోవడమే. చర్మానికి నూనెలు, క్రీములు రాస్తూ ఉంటే కొంతకాలానికి తగ్గిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి స్టిరాయిడ్స్‌తో కూడిన క్రీమ్‌లు వాడాలి. మీరు మొదట సాధారణ నూనెలనే ఉపయోగించండి.
నాలుగు వారాలకు కూడా ఫలితం కనిపించకపోతే పిల్లల డాక్టర్‌ని సంప్రదించండి. అవసరమైతే వారి సూచన మేరకు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించవచ్చు. అంతకంటే ముందు తల్లిగా మీరు... పాపాయి ఫలానా పదార్థం తీసుకున్నప్పుడు ఇలా జరుగుతోంది అని గమనించగలిగితే కొంతకాలం పాటు దానిని మినహాయించాలి. సాధారణంగా కొంతమంది పిల్లలకు ఆవు పాలు, కొన్ని రకాల గింజలు సరిపడకపోవడాన్ని చూస్తుంటాం.
- డాక్టర్ ప్రీతమ్ కుమార్ రెడ్డి, రెయిన్‌బో హాస్పిటల్, సికింద్రాబాద్