ఆయాసం వస్తే... వేడి వేడి టీ తాగాలి!
డాక్టర్ సలహా
నా వయసు 75 ఏళ్లు. ఉబ్బసంతో బాధపడుతున్నాను. చలికాలం తీవ్రమవుతోంది. అలర్జిక్ కోల్డ్ చాలా బాధపెడుతోంది. ఈ మధ్య తలదిమ్ముగా, భారంగా ఉంటోంది. బి.పి, డయాబెటిస్, అజీర్తి వంటి ఇబ్బందులేమీ లేవు.
- ఎస్. ఈశ్వరయ్య, కంకిపాడు
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఉబ్బసరోగం (ఆస్త్మా) ఉంది. దీన్నే ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. శరీరానికి సరిపడని అసాత్మ్య (ఎలర్జిక్) పదార్థాల వల్ల ఈ వ్యాధి లక్షణాలు జనిస్తాయి. ఇది కొందరిలో వారసత్వంగా రావచ్చు. మానసిక ఒత్తిడి కూడా ఒక కారణమే. చల్లటి మేఘాలు, వాతావరణంలో అధిక తేమ, దుమ్ము, ధూళి, కొన్ని రసాయనిక పదార్థాలు మొదలైనవి కూడా కొంతమందికి అసాత్మ్యంగా ఉంటాయి.
ఆయాసం ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. శ్రమకు గురికాకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేడి వేడి ‘టీ’ తాగితే మంచిది. శీతల పానీయాలకు, ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
మందులు: శ్వాసకుఠార రస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి
కనకాసవ (ద్రావకం) మూడు చెంచాలకు సమానంగా గోరు వెచ్చని నీళ్లు కలిపి (ఇది ఒక మోతాదు) రోజుకు మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తీసుకోవాలి.
ఆయాసం తగ్గిపోయిన తర్వాత వాడాల్సిన మందులు:
శృంగారాభ్రరస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి
అగస్త్య హరీతకి రసాయనం (లేహ్యం) ఉదయం ఒక చెంచా- రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి.
వీటిని ఎంత కాలమైనా వాడవచ్చు. ఈ మందుల వల్ల ఊపిరి తిత్తులకు, శ్వాస కోశ అవయవాలకు బలం కలిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఉబ్బసం అతి తరచుగా రావడం అనే సమస్య తగ్గిపోతుంది. ఒకవేళ ఉబ్బసం వచ్చినా దాని తీవ్రత స్వల్పంగా ఉంటుంది. కొంతకాలానికి అసాత్మ్యత (ఎలర్జీ)కు గురికావడం తగ్గి క్షమత్వం పెరుగుతుంది. ఆయాసం లేనప్పుడు రెండు పూటలా పది నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే మంచిది.
గృహవైద్యం: ఒక చెంచా ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఆయాసానికి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
దగ్గు, కఫం తగ్గడానికి... ఒక చెంచా తులసిరసంలో ఒక చెంచా తేనె కలిపి మూడు పూటలా సేవిస్తే మూడురోజుల్లో బాధ తగ్గిపోతుంది.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు