మెనోపాజ్ జబ్బు కాదు... ఒక దశ మాత్రమే!
డాక్టర్ సలహా
నా వయసు 45 సంవత్సరాలు. ఇటీవల మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు వచ్చే బాధలు భరించలేకపోతున్నాను. దీనికి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకోవడం పరిష్కారం అని మా స్నేహితురాలు చెప్పింది. ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ చేసే అవకాశం ఉంటుందా? తెలియచేయగలరు.
- ఎమ్. సుమలత, రేపల్లె
హెచ్‌ఆర్‌టి (హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ)... ఇటీవల చాలామంది మహిళలు ఈ చికిత్స వైపు మొగ్గుచూపుతున్నారు. రుతుక్రమం నిలిచిపోయే దశ (మెనోపాజ్)లో హార్మోన్‌ల విడుదల స్థాయుల్లో గణనీయమైన మార్పు వస్తుంది. అండాశయం నుంచి అండాలు వెలువడకపోవడం, హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. ఈ మార్పుల సమయంలో దేహం కొన్ని ఒడుదొడుకులకు లోనవుతుంది. ఈ బాధలను తప్పించుకోవడానికి హెచ్‌ఆర్‌టి వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఈ చికిత్సలో తక్కువ మోతాదులో హార్మోన్లను ఇస్తుంటారు. రుతుక్రమం ఆగిపోయిన వారికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఇవ్వడం వలన రొమ్ము క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మెనోపాజ్ అనేది జబ్బు కాదు. స్త్రీల జీవితంలో ఇది ఒక దశ. ఈ సమయంలో ఎదురయ్యే సమస్యలకు హోమియోవైద్యంలో చక్కటి పరిష్కారం ఉంటుంది. కాన్‌స్టిట్యూషనల్ చికిత్స చేయడం ద్వారా మెనోపాజ్ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్, హోమియో వైద్యులు