దాని గురించి నాకు ఏమీ తెలియదు | Funday Doctors Advice | Sakshi
Sakshi News home page

దాని గురించి నాకు ఏమీ తెలియదు

Published Sun, Jul 7 2019 10:01 AM | Last Updated on Sun, Jul 7 2019 2:47 PM

Funday Doctors Advice - Sakshi

నా వయసు 38 సంవత్సరాలు. నాకు పెళ్లై అయిదు సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. ఎన్ని పరీక్షలు చేసినా, మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. అందుకే ‘టెస్ట్‌ట్యూబ్‌ సిస్టమ్‌’ తో పిల్లల్ని కనాలనుకుంటున్నాం. అయితే దీని గురించి నాకు ఏమీ తెలియదు. దయచేసి టెస్ట్‌ట్యూబ్‌ విధానంలోని మంచి చెడుల గురించి వివరంగా తెలియజేయండి.
– జీఆర్, మందమర్రి

సాధారణంగా గర్భం దాల్చడానికి మగవారు ఆరోగ్యంగా ఉండాలి. వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగినంతగా ఉండాలి. ఆడవారిలో అండం విడుదల సరిగా ఉండాలి. గర్భాశయంలో ఏ లోపాలూ లేకుండా ఉండాలి. ఫేలోపియన్‌ ట్యూబులు మూసుకుపోకుండా ఉండాలి. హార్మోన్లు సక్రమంగా విడుదలై, వాటి పనితీరు సజావుగా ఉండాలి. సాధారణంగా లేదా మందుల ద్వారా పరీక్షలు అన్నీ సరిగా ఉన్నా గర్భం దాల్చనప్పుడు చివరి ప్రయత్నంగా టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్ధతి లేదా ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా గర్భం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఆడవారిలో అనేక అండాలు తయారు కావడానికి రోజుకు అనేక హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి, అండాశయాల నుంచి అండాలను బయటకు తీసి, వాటిని ల్యాబ్‌లో వీర్యకణాలతో జతపరచి, తర్వాత మంచి ఆరోగ్యకరమైన పిండాలను వేరు చేసి, ఒకటి లేదా రెండు పిండాలను చిన్న కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ఈ పిండాలను గర్భాశయం స్వీకరించినప్పుడు పిండాలు గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్‌ పొరకు అతుక్కుని, గర్భం పెరగడం మొదలవుతుంది. ఎన్నో తెలియని కారణాల వల్ల గర్భాశయం పిండాన్ని దరిచేరనివ్వదు. అలాంటప్పుడు ఈ పద్ధతి కూడా ఫెయిలై, గర్భం నిలవకుండా పీరియడ్‌ వచ్చేస్తుంది. ఒకసారి టెస్ట్‌ట్యూబ్‌ పద్ధతి ద్వారా గర్భం నిలవకపోతే, మళ్లీ ఒకసారి కారణాలను విశ్లేషించుకుని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, మందులలో కొద్దిపాటి మార్పులు చేసి, మరొకసారి ప్రయత్నించడం జరుగుతుంది. ఇందులో సక్సెస్‌ రేటు వయసును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్ల స్థాయిని బట్టి, అండాల నాణ్యత, వీర్యకణాల నాణ్యత, ఇంకా ఎన్నో తెలియని అంశాలను బట్టి ఉంటుంది.

కాబట్టి ఈ పద్ధతి ద్వారా గర్భం వంద శాతం నిలుస్తుందని చెప్పడం కష్టం. మీ వయసు 38 సంవత్సరాలు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ చికిత్స విధానానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ అండాల నాణ్యత సరిగా లేక సక్సెస్‌ కాకపోతే, దాత నుంచి తీసిన అండాలను ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అయినా గ్యారెంటీ లేనిది. ఈ ప్రక్రియలో కొందరిలో కవలలు, ట్రిప్లెట్స్‌ కలిగే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల వచ్చే సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఈ చికిత్సలో దుష్ఫలితాలు చిన్నవి లేదా పెద్దవి ఉండవచ్చు.

నాకు ఇటీవల పెళ్లయింది. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. అయితే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడవం వల్ల  శాశ్వతంగా పిల్లలు పుట్టరని, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని, ముఖంలో మార్పులు వస్తాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? ప్రత్యమ్నాయాలు ఏమైనా ఉన్నాయా?
– పీఆర్, హైదరాబాద్‌
పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నప్పుడు వాడే సాధనాలు లేక పద్ధతుల్లో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటిలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల మోతాదు, వెరైటీని బట్టి ఇవి నాలుగు రకాలు: ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్‌ జెనరేషన్‌ పిల్స్‌ అని, లో డోస్, వెరీ లో డోస్, హై డోస్‌ పిల్స్‌ అని అనేక రకాలుగా తయారు చేయబడతాయి. అందరికీ అన్నీ సరిపడకపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వం, బరువు, ఇతర సమస్యలు, పీరియడ్స్‌ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి విశ్లేషించుకుని, డాక్టర్‌ ఇచ్చే సలహా మేరకు వాడుకోవడం మంచిది. వీటిని వాడటం వల్ల శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవడమేమీ జరగదు. ఈ మాత్రలలో ఉండే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మోతాదు ఎక్కువగా ఉంటే కొందరిలో మొహం మీద మొటిమలు, బరువు పెరగడం, రక్తం గూడుకట్టడం వంటి దుష్ఫలితాలు కనిపించవచ్చు.

లో డోస్, వెరీ లోడోస్‌ పిల్స్‌లో దుష్ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. థర్డ్, ఫోర్త్‌ జెనరేషన్‌ పిల్స్‌ గర్భనిరోధానికే కాకుండా, పీసీఓడీ సమస్యకు, మొటిమలు, అవాంఛిత రోమాలు ఉన్నవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా మందులు మరీ అవసరమనుకున్నప్పుడు వాడుకుంటే మంచిది. డాక్టర్‌ సలహా మేరకు, మీ వయసు, మీ మెడికల్‌ హిస్టరీని బట్టి రెండు సంవత్సరాల వరకు గర్భనిరోధక మాత్రలను పెద్ద సమస్య లేకుండా వాడుకోవచ్చు. పిల్లలు వద్దనుకున్నప్పుడు డాక్టర్‌తో చర్చించి, కండోమ్స్, సేఫ్‌ పిరీయడ్‌ వంటివి కూడా పాటించవచ్చు. అయితే, ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నా వయసు 27 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లకు  ‘ఫిజికల్‌ యాక్టివీటి’ ఉండాలని చదివాను, ఫిజికల్‌ యాక్టివిటీ అంటే ఏమిటి? అది ఏలా  ఉపయోగపడుతుంది అనేది తెలియజేయగలరు.
– బి.నందిని, తెనాలి
శారీరకంగా అటూ ఇటూ తిరుగుతూ పని చేయడాన్ని ఫిజికల్‌యాక్టివిటీ అంటారు. చాలామందిలో గర్భం ధరించిన తర్వాత ఎక్కువ కదలకుండా బాగా విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. గర్భిణులు విశ్రాంతి తీసుకోవడంలో రకాలు ఉంటాయి. మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటల నిద్ర ఒక రకం. కూర్చుని చేసుకునే పనులు, బరువు పడకుండా చేసుకునే పనులు చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం రెండో రకం. మూడవది కాలకృత్యాలు తప్ప మిగతా అంతా బెడ్‌ రెస్ట్‌. ఇవి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం, మాయ పొజిషన్‌ బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి సలహా ఇవ్వడం జరుగతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో ఫిజికల్‌ యాక్టివిటీ అంటే సమస్యలు ఏవీలేకుంటే రోజువారీ పనులు చేసుకుంటూ ఉండటం, వీలైతే చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా బరువు పెరగకుండా శరీరం తేలికగా ఉంటుంది. ఎముకలు గట్టిపడతాయి. లేకపోతే బరువు ఎక్కువగా పెరగడం, బీపీ, సుగర్‌ వంటి సమస్యలు, కాన్పులో ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్‌ సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిజికల్‌ యాక్టివిటీస్‌ని పాటించవచ్చు.
- డా. వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement