test tube
-
దాని గురించి నాకు ఏమీ తెలియదు
నా వయసు 38 సంవత్సరాలు. నాకు పెళ్లై అయిదు సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. ఎన్ని పరీక్షలు చేసినా, మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. అందుకే ‘టెస్ట్‌ట్యూబ్ సిస్టమ్’ తో పిల్లల్ని కనాలనుకుంటున్నాం. అయితే దీని గురించి నాకు ఏమీ తెలియదు. దయచేసి టెస్ట్‌ట్యూబ్ విధానంలోని మంచి చెడుల గురించి వివరంగా తెలియజేయండి. – జీఆర్, మందమర్రి సాధారణంగా గర్భం దాల్చడానికి మగవారు ఆరోగ్యంగా ఉండాలి. వారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగినంతగా ఉండాలి. ఆడవారిలో అండం విడుదల సరిగా ఉండాలి. గర్భాశయంలో ఏ లోపాలూ లేకుండా ఉండాలి. ఫేలోపియన్ ట్యూబులు మూసుకుపోకుండా ఉండాలి. హార్మోన్లు సక్రమంగా విడుదలై, వాటి పనితీరు సజావుగా ఉండాలి. సాధారణంగా లేదా మందుల ద్వారా పరీక్షలు అన్నీ సరిగా ఉన్నా గర్భం దాల్చనప్పుడు చివరి ప్రయత్నంగా టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి లేదా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ఆడవారిలో అనేక అండాలు తయారు కావడానికి రోజుకు అనేక హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి, అండాశయాల నుంచి అండాలను బయటకు తీసి, వాటిని ల్యాబ్‌లో వీర్యకణాలతో జతపరచి, తర్వాత మంచి ఆరోగ్యకరమైన పిండాలను వేరు చేసి, ఒకటి లేదా రెండు పిండాలను చిన్న కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ పిండాలను గర్భాశయం స్వీకరించినప్పుడు పిండాలు గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్ పొరకు అతుక్కుని, గర్భం పెరగడం మొదలవుతుంది. ఎన్నో తెలియని కారణాల వల్ల గర్భాశయం పిండాన్ని దరిచేరనివ్వదు. అలాంటప్పుడు ఈ పద్ధతి కూడా ఫెయిలై, గర్భం నిలవకుండా పీరియడ్ వచ్చేస్తుంది. ఒకసారి టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా గర్భం నిలవకపోతే, మళ్లీ ఒకసారి కారణాలను విశ్లేషించుకుని, అవసరమైన పరీక్షలు చేయించుకుని, మందులలో కొద్దిపాటి మార్పులు చేసి, మరొకసారి ప్రయత్నించడం జరుగుతుంది. ఇందులో సక్సెస్ రేటు వయసును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్ల స్థాయిని బట్టి, అండాల నాణ్యత, వీర్యకణాల నాణ్యత, ఇంకా ఎన్నో తెలియని అంశాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి ద్వారా గర్భం వంద శాతం నిలుస్తుందని చెప్పడం కష్టం. మీ వయసు 38 సంవత్సరాలు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ చికిత్స విధానానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ అండాల నాణ్యత సరిగా లేక సక్సెస్ కాకపోతే, దాత నుంచి తీసిన అండాలను ఉపయోగించవచ్చు. ఈ ప్రక్రియ కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అయినా గ్యారెంటీ లేనిది. ఈ ప్రక్రియలో కొందరిలో కవలలు, ట్రిప్లెట్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. వీటి వల్ల వచ్చే సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఈ చికిత్సలో దుష్ఫలితాలు చిన్నవి లేదా పెద్దవి ఉండవచ్చు. నాకు ఇటీవల పెళ్లయింది. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. అయితే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడవం వల్ల శాశ్వతంగా పిల్లలు పుట్టరని, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, ముఖంలో మార్పులు వస్తాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? ప్రత్యమ్నాయాలు ఏమైనా ఉన్నాయా? – పీఆర్, హైదరాబాద్ పిల్లలు ఇప్పుడే వద్దనుకున్నప్పుడు వాడే సాధనాలు లేక పద్ధతుల్లో గర్భనిరోధక మాత్రలు ఒకటి. వీటిలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల మోతాదు, వెరైటీని బట్టి ఇవి నాలుగు రకాలు: ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జెనరేషన్ పిల్స్ అని, లో డోస్, వెరీ లో డోస్, హై డోస్ పిల్స్ అని అనేక రకాలుగా తయారు చేయబడతాయి. అందరికీ అన్నీ సరిపడకపోవచ్చు. ఒక్కొక్కరి శరీరతత్వం, బరువు, ఇతర సమస్యలు, పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి విశ్లేషించుకుని, డాక్టర్ ఇచ్చే సలహా మేరకు వాడుకోవడం మంచిది. వీటిని వాడటం వల్ల శాశ్వతంగా పిల్లలు పుట్టకపోవడమేమీ జరగదు. ఈ మాత్రలలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదు ఎక్కువగా ఉంటే కొందరిలో మొహం మీద మొటిమలు, బరువు పెరగడం, రక్తం గూడుకట్టడం వంటి దుష్ఫలితాలు కనిపించవచ్చు. లో డోస్, వెరీ లోడోస్ పిల్స్‌లో దుష్ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. థర్డ్, ఫోర్త్ జెనరేషన్ పిల్స్ గర్భనిరోధానికే కాకుండా, పీసీఓడీ సమస్యకు, మొటిమలు, అవాంఛిత రోమాలు ఉన్నవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏవైనా మందులు మరీ అవసరమనుకున్నప్పుడు వాడుకుంటే మంచిది. డాక్టర్ సలహా మేరకు, మీ వయసు, మీ మెడికల్ హిస్టరీని బట్టి రెండు సంవత్సరాల వరకు గర్భనిరోధక మాత్రలను పెద్ద సమస్య లేకుండా వాడుకోవచ్చు. పిల్లలు వద్దనుకున్నప్పుడు డాక్టర్‌తో చర్చించి, కండోమ్స్, సేఫ్ పిరీయడ్ వంటివి కూడా పాటించవచ్చు. అయితే, ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా వయసు 27 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లకు ‘ఫిజికల్ యాక్టివీటి’ ఉండాలని చదివాను, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమిటి? అది ఏలా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయగలరు. – బి.నందిని, తెనాలి శారీరకంగా అటూ ఇటూ తిరుగుతూ పని చేయడాన్ని ఫిజికల్యాక్టివిటీ అంటారు. చాలామందిలో గర్భం ధరించిన తర్వాత ఎక్కువ కదలకుండా బాగా విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. గర్భిణులు విశ్రాంతి తీసుకోవడంలో రకాలు ఉంటాయి. మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటల నిద్ర ఒక రకం. కూర్చుని చేసుకునే పనులు, బరువు పడకుండా చేసుకునే పనులు చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం రెండో రకం. మూడవది కాలకృత్యాలు తప్ప మిగతా అంతా బెడ్ రెస్ట్. ఇవి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం, మాయ పొజిషన్ బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి సలహా ఇవ్వడం జరుగతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫిజికల్ యాక్టివిటీ అంటే సమస్యలు ఏవీలేకుంటే రోజువారీ పనులు చేసుకుంటూ ఉండటం, వీలైతే చిన్నగా నడక, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా బరువు పెరగకుండా శరీరం తేలికగా ఉంటుంది. ఎముకలు గట్టిపడతాయి. లేకపోతే బరువు ఎక్కువగా పెరగడం, బీపీ, సుగర్ వంటి సమస్యలు, కాన్పులో ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ సలహా మేరకు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిజికల్ యాక్టివిటీస్‌ని పాటించవచ్చు. - డా. వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
టెస్ట్ ట్యూబ్ చెట్లు!
బ్రిటన్: టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి విన్నాం. కానీ... ఈ టెస్ట్ ట్యూబ్ చెట్లు ఏంటని ఆలోచిస్తున్నారా? అంతరించి పోతున్న వృక్ష జాతిని సంరక్షించడానికి శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన విధానమే ఈ టెస్ట్ ట్యూబ్ చెట్లు. ప్రపంచంలో అనేక వృక్షాల జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వృక్షజాతుల్లో ఐదింట్లో ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉందని, అందుకే వాటిని పరిరక్షించడంపై దృష్టి సారించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టెస్ట్ ట్యూబుల్లో చెట్లను పెంచుతున్నారు. ఈ టెస్ట్ ట్యూబ్ చెట్ల విధానం ఇన్సూరెన్స్ పాలసీలాంటిదని బ్రిటన్‌లోని వెస్ట్ ససెక్స్లోగల క్యూస్ మిలీనియం సీడ్ బ్యాంక్‌లో పని చేస్తున్న డాక్టర్ జాన్ డికీ అభిప్రాయపడ్డారు. అంతరించి పోయే ప్రమాదమున్న విత్తనాలను సీడ్ బ్యాంక్‌లో ఉన్న రేడియేషన్ ప్రూఫ్ నేల మాళిగల్లో భద్రపరుస్తున్నారు. 2020 నాటికి అంతరించిపోయే ప్రమాదం ఉన్న వృక్షాల్లో కనీసం 75 శాతం వృక్ష జాతులను పరిరక్షించడం వీరి లక్ష్యం. సీడ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మరో పరిశోధకులు డేనియల్ బాలెస్టెరోస్ మాట్లాడుతూ.. ‘సీడ్ బ్యాంక్ ఫ్రీజర్‌లో భద్రపరిచినట్లు, అన్ని రకాల మొక్కల విత్తనాలను ఎండబెట్టి భద్రపరచడం సాధ్యం కాదు. ఉదాహరణకు సింధూర వృక్షం లేదా చెస్ట్నట్ విత్తనాలు చాలా సున్నితమైనవి. వాటిని ఎండబెడితే వాటి నుంచి చెట్లు రావు. ఇలాంటి విత్తనాల పరిరక్షణ కోసం ‘క్రయోప్రిజర్వేషన్’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ విధానం ద్వారా మొక్క బీజాన్ని విత్తనం నుంచి వేరు చేసి, దాన్ని ద్రవరూప నైట్రోజన్‌లో అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఘనీభవింజేస్తాం. ఇలాంటి సీడ్ బ్యాంకుల ఉపయోగం ఇప్పటికే కనిపిస్తోంది. బ్రిటన్‌లో అంతరించిపోతున్న పచ్చికబయళ్లను సీడ్ బ్యాంక్‌లో భద్రపర్చిన విత్తనాల ద్వారా పరిరక్షించే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయ’న్నారు. -
టెస్ట్‌ట్యూబ్ కవలల జననం
టెస్ట్‌ట్యూబ్ విధానంలో కవలలు జన్మించారు. అరుదైన ఈ ఘటన నరసరావుపేట శ్రేయో నర్సింగ్ హోమ్‌లో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలో ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ విధానంలో తొలిసారిగా కవలలు జన్మించారని ఆస్పత్రి వైద్యులు వివరించారు. గుంటూరు, నరసరావుపేట: పల్నాడులో తొలిసారిగా నరసరావుపేటలోని శ్రేయో నర్సింగ్ హోమ్‌లో సోమవారం టెస్ట్ ట్యూబ్ కవలలు జన్మించారు. వీరిద్దరూ ఆడ శిశువులు. వినుకొండ పట్టణానికి చెందిన దంపతులు సంతాన లేమితో శ్రేయో నర్సింగ్‌హోమ్‌ను ఆశ్రయించగా, వారిలో తల్లి నుంచి అండం, భర్త నుంచి స్పెర్మ్‌లను సేకరించి టెస్ట్‌ట్యూబ్‌లో కలిపి ఐదు రోజుల అనంతరం తల్లి గర్భాశ్రయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఇద్దరు కవలలు పుట్టినట్లు డాక్టర్ చంద్రకిరణ్‌రెడ్డి, వసంతకిరణ్ తెలిపారు. ఒక పాప 2.4 కేజీలు, మరో పాప 2.2 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నారన్నారు. తమ నర్సింగ్‌హోమ్‌లో ఏడాది క్రితమే టెస్ట్‌ట్యూబ్ కేంద్రం (ఐవీఎఫ్)ను ఏర్పాటుచేయగా ఇప్పటికి 50 మంది వరకు మహిళలను ఈ విధానం ద్వారా గర్భవతులను చేసి 80 శాతం విజయంతో ఉన్నామని చెప్పారు. ఈ పద్ధతిలో తల్లి గర్భంలో రెండు పిండాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎక్కువగా ఒక పిండమే తయారవుతుందని, కొన్ని సందర్భాల్లో రెండు పిండాలు అభివృద్ధి చెంది కవలలు పుడతారని వివరించారు. సోమవారం సాయంత్రం గుంటూరు రోడ్డులోని నర్సింగ్‌హోమ్‌లో నిర్వహించిన ఒకటో వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ కేజే మోహనరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ భార్యాభర్తల సంతాన సమస్యలకు టెస్ట్‌ట్యూబ్ విధానం సమాధానం కావటం సంతోషకరమైన విషయమన్నారు. ఈ విధానం అందుబాటులోకి రావడంతో పిల్లలు కావాలనుకునేవారు హైదరాబాదు, మద్రాసు, విజయవాడలకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. -
టెస్ట్ ట్యూబ్ బేబిలు
-ఓకేసారి కవలలు జననం – నంద్యాలలో ప్రథమం – నెరవాటి హాస్పిటల్ వైద్యుల ఘనత నంద్యాల వ్యవసాయం: టెస్ట్‌ట్యూబ్ బేబి విధానంలో కవల పిల్లలు (బాబు, పాప) జన్మించారు. ఈ అరుదైన ఘటన సోమవారం నంద్యాల నెరవాటి ఆసుపత్రిలో జరిగింది. పాణ్యం మండలం నెరవాడ గ్రామానికి చెందిన కె.లలిత, కె.విశ్వనాథరెడ్డిలకు 8ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో పలువురు డాక్టర్లను ఆశ్రయించారు. అయినా, ఫలితం లేకపోవడంతో టెస్ట్ బ్యూబ్బేబి ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది నెరవాటి హాస్పిటల్ వైద్యులు వినోద్‌కుమార్, అరుణకుమారిలను సంప్రదించగా వారు చికిత్స ప్రారంభించారు. సోమవారం లలితకు నొప్పులు రావడంతో భర్త హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కడుపులో ఇద్దరు పిల్లలు ఉండటంతో సాధారణ కాన్పు కష్టమైంది. దీంతో సిజేరియన్ చేసి బయటకు తీశారు. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. కాగా ఆపరేషన్‌లో మత్తు మందు డాక్టర్ రవికృష్ణ, చిన్నపిల్లల వైద్యుడు పెసల అశోక్‌కుమార్ సహకారం అందించారు. టెస్్టట్యూబ్ బేబి ద్వారా కవలలు జన్మించడం నంద్యాలలోనే ప్రథమమని వైద్యులు వెల్లడించారు. -
ప్రయోగం ఫలించింది!
మహబూబ్‌నగర్ వైద్యవిబాగం, న్యూస్‌లైన్: జిల్లాలో మొట్టమొదటి సారిగా టెస్టుట్యూబ్ ద్వారా ఓ జంటకు సంతానం కలిగించారు. జిల్లా కేంద్రంలోని సుశృత సంతానసాఫల్య కేంద్రం ద్వారా గురువారం తొలిసారిగా టెస్టుట్యూబ్ వైద్యవిధానం ద్వారా ఓ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ పి. ప్రతిభ శిశువు వివరాలను వెల్లడించారు. బొంరాస్‌పేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు గత పదేళ్లక్రితం వివాహమైంది. వారికి సంతానం కలగలేదు. దీంతో వారు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి.. వేల రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు జిల్లాకేంద్రంలోని సుశృత సంతాన సాఫల్యకేంద్రాన్ని ఆశ్రయించారు. దీంతో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ప్రతిభ నేతృత్వంలో వైద్యులు ఆ దంపతులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వైద్యసేవలు ప్రారంభించారు. గురువారం టెస్టుట్యూబ్ ప్రక్రియ ద్వారా ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లాలో మొట్టమొదటి సారిగా టెస్టుట్యూబ్ ద్వారా సంతానం కలగడం విజయంగా భావిస్తున్నామని డాక్టర్ ప్రతిభ ఆనందం వ్యక్తంచేశారు. శిశువు ఆరోగ్యం చాలా బాగుందని వెల్లడించారు. సంతానప్రాప్తి కలిగిన ఆ దంపతులు ఈ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.