కవల పిల్లలతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్లు చంద్రకిరణ్, వసంత, బ్రహ్మారెడ్డి, మోహనరెడ్డి, సి.గౌతమి
టెస్ట్‌ట్యూబ్ విధానంలో కవలలు జన్మించారు. అరుదైన ఈ ఘటన నరసరావుపేట శ్రేయో నర్సింగ్ హోమ్‌లో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలో ఏడాది క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ విధానంలో తొలిసారిగా కవలలు జన్మించారని ఆస్పత్రి వైద్యులు వివరించారు.
గుంటూరు, నరసరావుపేట: పల్నాడులో తొలిసారిగా నరసరావుపేటలోని శ్రేయో నర్సింగ్ హోమ్‌లో సోమవారం టెస్ట్ ట్యూబ్ కవలలు జన్మించారు. వీరిద్దరూ ఆడ శిశువులు. వినుకొండ పట్టణానికి చెందిన దంపతులు సంతాన లేమితో శ్రేయో నర్సింగ్‌హోమ్‌ను ఆశ్రయించగా, వారిలో తల్లి నుంచి అండం, భర్త నుంచి స్పెర్మ్‌లను సేకరించి టెస్ట్‌ట్యూబ్‌లో కలిపి ఐదు రోజుల అనంతరం తల్లి గర్భాశ్రయంలో ప్రవేశపెట్టడం ద్వారా ఇద్దరు కవలలు పుట్టినట్లు డాక్టర్ చంద్రకిరణ్‌రెడ్డి, వసంతకిరణ్ తెలిపారు. ఒక పాప 2.4 కేజీలు, మరో పాప 2.2 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
తమ నర్సింగ్‌హోమ్‌లో ఏడాది క్రితమే టెస్ట్‌ట్యూబ్ కేంద్రం (ఐవీఎఫ్)ను ఏర్పాటుచేయగా ఇప్పటికి 50 మంది వరకు మహిళలను ఈ విధానం ద్వారా గర్భవతులను చేసి 80 శాతం విజయంతో ఉన్నామని చెప్పారు. ఈ పద్ధతిలో తల్లి గర్భంలో రెండు పిండాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎక్కువగా ఒక పిండమే తయారవుతుందని, కొన్ని సందర్భాల్లో రెండు పిండాలు అభివృద్ధి చెంది కవలలు పుడతారని వివరించారు. సోమవారం సాయంత్రం గుంటూరు రోడ్డులోని నర్సింగ్‌హోమ్‌లో నిర్వహించిన ఒకటో వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ కేజే మోహనరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ భార్యాభర్తల సంతాన సమస్యలకు టెస్ట్‌ట్యూబ్ విధానం సమాధానం కావటం సంతోషకరమైన విషయమన్నారు. ఈ విధానం అందుబాటులోకి రావడంతో పిల్లలు కావాలనుకునేవారు హైదరాబాదు, మద్రాసు, విజయవాడలకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment