గుంటూరు లీగల్: కూతురి ఆత్మహత్యకు కారకుడైన తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. గుంటూరులోని సంపత్‌నగర్‌కు చెందిన మహంకాళి నాగరాజుకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. చిన్న కూతురిపై కన్నేసిన నాగరాజు ఆమెను కాపురానికి పంపకుండా తన వద్దే ఉంచుకున్నాడు. ఆమెపై లైంగిక దాడి చేసేందుకు పథకం రచించాడు. అడ్డుగా ఉన్న తన భార్యను కొట్టి ఖమ్మంలోని పుట్టింటికి పంపాడు. ఆ తర్వాత ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె 2017 మార్చి 22న ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఆమెకు మానసిక స్థితి సక్రమంగా లేక ఆత్మహత్య చేసుకుందని నాగరాజు తప్పుడు ప్రచారం చేశాడు. పోలీసులకూ అలాగే ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టంలో బయడపడ్డ నిజాలు బాధితురాలి ఆత్మహత్య అనంతరం పోస్టుమార్టంలో అనేక విషయాలు బయటకొచ్చాయి. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు ధ్రువీకరించారు. ఆ క్రమంలో ఆమె గర్భం దాల్చడానికి కారకులు ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. తన భార్యతో తాను ఎప్పుడూ ఉండలేదని ఆమె భర్త స్పష్టం చేశాడు. ఈ క్రమంలో మృతురాలి అమ్మమ్మ నాగరాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలింది..
మృతురాలి భర్తకు, తండ్రికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భం దాల్చడానికి తండ్రే కారణమని తేలింది. విషయం తెలుసుకున్న మహంకాళి నాగరాజు పరారయ్యాడు. రెండున్నరేళ్ల అనంతరం అప్పటి డీఎస్పీ సుప్రజ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుఫున ఏపీపీ శ్యామలా కేసు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment