Coffee shops
-
ఊరికే కూర్చోకు భయపడకు
దట్టమైన పొగ, ధారాళమైన దుర్భాషలతో నిండి ఉండే మగ రూప కాఫీ రెస్టారెంట్లే ఈ ప్రపంచం నిండా! ఇండోనేషియా కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అయితే అక్కడి ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణమైన బాందా ఏసాలో ఒక మహిళ పొగలు కక్కే మంచి కాఫీని తప్ప.. సిగరెట్ పొగలకు, చెత్త మాటలకు స్థానం లేని కేఫ్‌ను నడుపుతున్నారు! అది పూర్తిగా ఆడవాళ్ల అడ్డా. అక్కడ వాళ్లు కాఫీ తాగొచ్చు. కబుర్లు చెప్పుకోవచ్చు. చర్చలు పెట్టుకోవచ్చు. మగవాళ్లు కూడా వచ్చి కాఫీ తాగి వెళ్లిపోవచ్చు కానీ, అక్కడ కూర్చోటానికి లేదు. ఆ కాఫీ కేఫ్ పేరు ‘మార్నింగ్ మామా’. ఆ కేఫ్ యజమాని ఖుర్రేటా అయుని. 28 ఏళ్ల ముస్లిం యువతి. ఆమె దగ్గర పనిచేసే నలుగురు ‘బరిస్టా’లు (కాఫీ తయారు చేసి, సర్వ్ చేసేవారు) కూడా మహిళలే. పూర్తిగా మహిళలే నడిపే ‘మార్నింగ్ మామా’ వంటి కాఫీ కేఫ్‌లు ఏ దేశంలో అయినా ఉండేవే. అందులో కొత్తేమీ లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉండే ఇండోనేషియాలో కూడా ‘ఓన్లీ ఉమన్ ’ కాఫీ కేఫ్‌లు అరకొరగానైనా లేకుండాపోవు. అయితే ఏసా ప్రావిన్సులో ఒక మహిళ బయటికి రావటం, బిజినెస్ చేయటం అన్నది కలకలం రేపే విషయం. కొరడా దెబ్బలకు దారి తీసే సాహసం. ఇండోనేషియాలోని మొత్తం 38ప్రావిన్సులలో ఏసాప్రావిన్సు ఒక్కటే ఇప్పటికీ మారకుండా నియమాల శిలలా ఉండిపోయింది. మహిళల పట్ల నేటికీ కఠినమైన ఆంక్షలు, సంప్రదాయాలు కొనసాగుతున్న ప్రదేశం అది. అలాంటి చోట కాఫీ కేఫ్ తెరిచారు ఖుర్రేటా! అయితే అందుకోసం ఆమె సంప్రదాయాలను ధిక్కరించలేదు. ఆంక్షల్ని కాస్త సడలింపజేసుకుని, హిజాబ్‌ను ధరించి, ఇతర మతపరమైన కట్టుబాట్లకు లోబడి కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. ఖుర్రేటా కాఫీ కేఫ్ప్రారంభించిన ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణం బాందా ఏసాకు ‘1001 కాఫీ షాపులున్న పట్టణం’గా పేరు. వాటికి ఇప్పుడు ‘మార్నింగ్ మామా’కూడా జత కలిసింది. ఆడవాళ్లు బయటికి వచ్చి మగవాళ్లలా పని చేయటం అనే ‘దైవ దూషణ వంటి’ ఆ ధిక్కారాన్ని చూసి మొదట్లో కన్నెర్ర చేసిన స్థానిక పురుషులు.. మెల్లమెల్లగా ఇప్పుడు ఆమె కేఫ్‌కే ప్రత్యేకమైన నురగలు కక్కే చిక్కని పాల శాంగర్ ‘లాటే’ కాఫీకి అలవాటు పడుతున్నారు. పొగ, శబ్దం లేకుండా హాయిగా, ప్రశాంతంగా ఉండే అక్కడి వాతావరణాన్ని మరింతగా ఇష్టపడుతున్నారు. ‘మహిళలు సైతం సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోవచ్చు. నాయకత్వం వహించవచ్చు’ అని ఖుర్రేటా ఇస్తున్న స్టేట్మెంట్కు ప్రతీక ఆమె కాఫీ కేఫ్. -
World Coffee Portal: కాఫీకి చైనా జై
తేనీరు... ప్రపంచంలో ఈ పానీయం గురించి తెలియనివారు ఉండరు. తేనీరు డ్రాగన్ దేశం చైనాలో పుట్టిందన్న వాదన కూడా ఉంది. ఈ ఉష్ణోదకం సేవించడంలో చైనీయులు ముందంజలో ఉంటారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. చైనా ప్రజలు ఇప్పుడు కాఫీపై మక్కువ పెంచుకుంటున్నారు. సాక్షాత్తూ ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. బ్రాండెడ్ కాఫీ షాప్ మార్కెట్ విషయంలో అమెరికాను చైనా మించిపోయిందని ‘వరల్డ్ కాఫీ పోర్టల్’ వెల్లడించింది. అమెరికాలో కంటే చైనాలోనే అత్యధిక కాఫీ ఔట్లెట్లు ఉన్నాయని తెలియజేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనాలో కాఫీ ప్రేమికుల పెరిగిపోతోందని, కేవలం గత 12 నెలల వ్యవధిలోనే కాఫీ ఔట్లెట్ల సంఖ్య 58 శాతం పెరిగిందని పేర్కొంది. ప్రసుతం చైనాలో 49,691 బ్రాండెడ్ కాఫీ దుకాణాలు ఉన్నాయని వివరించింది. ► ప్రఖ్యాత స్టార్‌బక్స్ సంస్థ గత ఏడాది వ్యవధిలో చైనాలో కొత్తగా 785 కాఫీ దుకాణాలు తెరిచింది. చైనాలో రూ.1,660 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. అమెరికా బయట స్టార్‌బక్స్ ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమకు రెండో అతిపెద్ద మార్కెట్ చైనాయేనని స్టార్‌బక్స్ స్పష్టం చేసింది. ► చైనాలో కాఫీలను విక్రయించడంలో స్టార్టప్ కంపెనీ ‘లకిన్ కాఫీ’దే పైచేయి. ఈ సంస్థకు దేశంలో 13,000కుపైగా ఔట్లెట్లు ఉన్నాయి. ► సర్వేలో భాగంగా 4,000 మంది కాఫీ ప్రియులను ప్రశ్నించారు. వీరిలో 90 శాతం మంది వారానికోసారి హాట్ కాఫీ తాగుతామని చెప్పారు. వారానికి ఒక్కసారైనా ఐస్డ్ కాఫీ తీసుకుంటామని 64 శాతం మంది తెలిపారు. ► ప్రతివారం కాఫీ షాప్‌నకు వెళ్తాం లేదా ఆర్డర్ చేసి తెప్పించుకుంటామని 90 శాతం మంది వెల్లడించారు. ► చైనాలో ఇటీవలికాలంలో ఆర్థిక ప్రగతి కొంత నెమ్మదించింది. అయినప్పటికీ ప్రపంచ కాఫీ పరిశ్రమగా చైనా ఎదుగుతుండడం విశేషం. ► చైనాలో తమ కంపెనీ ప్రస్థానం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని స్టార్‌బక్స్ సీఈఓ లక్ష్మణ్ నరసింహన్ చెప్పారు. 2025 నాటికి చైనాలో 9,000 కాఫీ దుకాణాలు ప్రారంభించాలని స్టార్‌బక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పబ్బులు, కాఫీషాప్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో పార్కింగ్ సౌకర్యం సరిగ్గాలేని 20 పబ్బులు, కాఫీషాప్లకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజులక్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఓ పబ్ముందు పార్కింగ్ చేసిన కారు కారణమని రాత్రి వేళల్లో రోడ్డకు రెండువైపులా అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో పంజగుట్ట ట్రాఫిక్ ఎసీపీ కోటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు నోటీసులు అందచేశారు. తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించకపోతే వాటిని సీజ్‌చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్కింగ్ సౌకర్యం కల్పించుకున్న దానిపై వివరణ ఇవ్వాలని కోరారు. మహిళా సంఘాల ధర్నా పబ్‌ల ముందు రోడ్లకు రెండువైపులా అర్ధరాత్రిదాకా వాహనాలు పార్కింగ్చేస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారని ఆరోపిస్తూ మహిళాసంఘాలు బుధవారం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 45 లోని ఫ్యాట్ ఫిజియన్ పబ్‌తో పాటు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 30లో ఉన్న హైలైఫ్ 800 పబ్ ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్డదిడ్డంగా కార్లు పార్కింగ్ చేయడంవల్ల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్కింగ్ సౌకర్యం లేకుండానే పబ్‌లు ఎధేచ్చగా నడుస్తున్నా పోలీసులు పట్టించు కోవడంలేదని ఆరోపించారు. -
కాపీ విత్ సినిమా
క్యాపచినోలూ... కూల్పేస్ట్రీలూ సరే. మేగ్జైన్లూ, రాక్ మ్యూజిక్‌లూ ఓకే. కాఫీషాప్‌లు అంతకు మించిన వినోదాన్నివ్వాలని ఆశించేవారి అన్వేషణకు ఇక ‘తెర’పడినట్టే. సిటీలోని కాఫీషాప్‌లు థియేటర్లుగా మారిపోతున్నాయ్. విజయాలకు ‘షార్ట్’-కట్స్’ ఉంటాయని నిరూపిస్తూ యువత క్రియేట్ చేస్తున్న ట్రెండీ మూవీస్ ధాటికి ఈ కాఫీ-థియేటర్లు ‘హౌస్‌ఫుల్’ అయిపోతున్నాయ్ ‘‘సందీప్ ప్రజెంట్స్ ‘లవ్లీ’ మూవీ... కమింగ్ సూన్’’ అంటూ వాల్స్‌కు అంటించిన పోస్టర్లు మీరు వెళ్లిన కాఫీషాప్‌లో దర్శనమిస్తే.. అవి చూసి నేనొచ్చింది కాఫీషాప్కా, సినిమాహాల్కా అని కన్ఫ్యూజ్ అయిపోతే... అది మీ తప్పు కాదు. షార్ట్ ఫిల్మ్‌లను సూపర్‌హిట్ చేసేందుకు కంకణం కట్టుకున్న సదరు షాప్.. సారీ థియేటర్ ఓనర్లదే. పబ్లిసిటీ మీకు... పాపులారిటీ మాకు... యువతనే లక్ష్యంగా చేసుకునే కాఫీషాప్ల నిర్వాహకులకు అందివచ్చిన అవకాశం షార్ట్ ఫిల్మ్ ట్రెండ్. నగరంలో పొట్టి మూవీస్ విపరీతంగా తయారవుతున్నా, తెరకెక్కించే దారి లేక చాలా మంది గింజుకుంటున్నారు. సరిగ్గా... ఇదే టైమ్‌లో పెరుగుతున్న పోటీతో యువతను ఎలా తమ ‘దారి’కి తెచ్చుకోవాలా అనుకుంటున్న కాఫీషాప్లకు ఇది బాగా అనుకూలించింది. ఈ చిన్ని చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఆదాయపరంగా కన్నా తమ హ్యాంగౌట్ ప్లేస్‌కు యూత్‌లో క్రేజ్ ఏర్పడుతుండటం, ప్రచారపరంగా మంచి రిజల్ట్స్ వస్తుండడంతో ఈ షాప్‌ల యాజమాన్యాలు పోటాపోటీగా ‘షార్ట్-స్క్రీనింగ్’కు తెరతీస్తున్నాయి. వీకెండ్లో... విన్ ట్రెండ్... నగరంలో ఏ ఈవెంట్ చేయాలన్నా, ఏ టాలెంట్ ప్రదర్శించాలన్నా వీకెండే కదా. అందుకే ఇప్పుడు వీకెండ్స్‌లో కాఫీషాప్ల వద్ద ప్రేక్షకుల కోలాహలం కనపడుతోంది. బంజారాహిల్స్‌లోని ఎట్ హౌస్, కార్ఖానాలోని కాఫీషాప్‌లలో ప్రదర్శించేవి అప్పటికే విభిన్న రకాల పోటీల్లో గెలిచినవి లేదా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నవి అయి ఉండటంతో సహజంగానే ఇవి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సక్సెస్ఫుల్ షార్ట్‌ఫిల్మ్‌లను చూడాలనుకునేవారిలో యువ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఉంటున్నారు. వైవిధ్యానికి పట్టం... కేవలం కళాత్మక చిత్రాలు మాత్రమే కాదు యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్.. ఇలా విభిన్నాంశాలకు చెందిన సినిమాలకూ పట్టం కడుతున్నారని క్రీకింగ్ ప్రొజెక్టర్స్‌కు చెందిన బి.శరత్ అంటున్నారు. ఆయన గత కొంతకాలంగా కాఫీషాప్‌లలో తాము రూపొందించిన పొట్టి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. సన్నిహితులతో పిచ్చాపాటీ ముచ్చటిస్తూ, నచ్చిన స్నాక్స్, కాఫీలను సేవిస్తూ, పూర్తి విశ్రాంతిగా కూర్చుని ఓ వైవిధ్యభరితమైన ఆలోచన తాలూకు ‘తెర’రూపాన్ని తిలకించడం.. అదీ రూ.100 లోపు ఖర్చుతో అనేది చాలా ఆనందించదగిన విషయం అంటున్నారాయన. కాఫీలాంజ్లలో ప్రదర్శించే సినిమాలను చూడడానికి సీరియస్ ప్రేక్షకులు మాత్రమే వస్తారు అని 3నిటీ అనే సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన కె.అభిషేక్ అంటున్నారు. ఆయన తన సినిమాను ఇటీవలే కెఫె రాబాత్లో ప్రదర్శించారు. - కాఫీషాప్‌లలో ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో తెలుగు షార్ట్ ఫిల్మ్‌లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటం భవిష్యత్తులో తెలుగు భాష ప్రాచుర్యం యువతలో పెరిగే అవకాశం అని భాషా ప్రేమికులు అంటున్నారు.