కాపీ విత్ సినిమా | Coffee with cinema Special in City plus | Sakshi
Sakshi News home page

కాపీ విత్ సినిమా

Published Thu, Jun 26 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

కాపీ విత్ సినిమా

కాపీ విత్ సినిమా

క్యాపచినోలూ... కూల్‌పేస్ట్రీలూ సరే. మేగ్‌జైన్‌లూ,  రాక్ మ్యూజిక్‌లూ ఓకే. కాఫీషాప్‌లు అంతకు మించిన వినోదాన్నివ్వాలని ఆశించేవారి అన్వేషణకు ఇక ‘తెర’పడినట్టే. సిటీలోని  కాఫీషాప్‌లు థియేటర్లుగా మారిపోతున్నాయ్. విజయాలకు ‘షార్ట్’-కట్స్’ ఉంటాయని నిరూపిస్తూ యువత క్రియేట్  చేస్తున్న ట్రెండీ మూవీస్ ధాటికి ఈ కాఫీ-థియేటర్లు ‘హౌస్‌ఫుల్’ అయిపోతున్నాయ్
 
 ‘‘సందీప్ ప్రజెంట్స్ ‘లవ్లీ’ మూవీ... కమింగ్ సూన్’’ అంటూ వాల్స్‌కు అంటించిన పోస్టర్‌లు మీరు వెళ్లిన కాఫీషాప్‌లో దర్శనమిస్తే.. అవి చూసి నేనొచ్చింది కాఫీషాప్‌కా, సినిమాహాల్‌కా అని కన్‌ఫ్యూజ్ అయిపోతే... అది మీ తప్పు కాదు. షార్ట్ ఫిల్మ్‌లను సూపర్‌హిట్ చేసేందుకు కంకణం కట్టుకున్న సదరు షాప్..  సారీ థియేటర్ ఓనర్లదే.
 
 పబ్లిసిటీ మీకు... పాపులారిటీ మాకు...
 యువతనే లక్ష్యంగా చేసుకునే కాఫీషాప్‌ల నిర్వాహకులకు అందివచ్చిన అవకాశం షార్ట్ ఫిల్మ్ ట్రెండ్. నగరంలో పొట్టి మూవీస్ విపరీతంగా తయారవుతున్నా, తెరకెక్కించే దారి లేక చాలా మంది గింజుకుంటున్నారు. సరిగ్గా... ఇదే టైమ్‌లో పెరుగుతున్న పోటీతో యువతను ఎలా తమ ‘దారి’కి తెచ్చుకోవాలా అనుకుంటున్న కాఫీషాప్‌లకు ఇది బాగా అనుకూలించింది. ఈ చిన్ని చిత్రాలను ప్రదర్శించడం ద్వారా ఆదాయపరంగా కన్నా తమ హ్యాంగౌట్ ప్లేస్‌కు యూత్‌లో క్రేజ్ ఏర్పడుతుండటం, ప్రచారపరంగా మంచి రిజల్ట్స్ వస్తుండడంతో  ఈ షాప్‌ల యాజమాన్యాలు పోటాపోటీగా ‘షార్ట్-స్క్రీనింగ్’కు తెరతీస్తున్నాయి.
 
 వీకెండ్‌లో... విన్ ట్రెండ్...
 నగరంలో ఏ ఈవెంట్ చేయాలన్నా, ఏ టాలెంట్ ప్రదర్శించాలన్నా వీకెండే కదా. అందుకే ఇప్పుడు వీకెండ్స్‌లో కాఫీషాప్‌ల వద్ద ప్రేక్షకుల కోలాహలం కనపడుతోంది. బంజారాహిల్స్‌లోని ఎట్ హౌస్, కార్ఖానాలోని  కాఫీషాప్‌లలో ప్రదర్శించేవి అప్పటికే విభిన్న రకాల పోటీల్లో గెలిచినవి లేదా జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నవి అయి ఉండటంతో సహజంగానే ఇవి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సక్సెస్‌ఫుల్ షార్ట్‌ఫిల్మ్‌లను చూడాలనుకునేవారిలో యువ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఉంటున్నారు.  
 
 వైవిధ్యానికి పట్టం...
 కేవలం కళాత్మక చిత్రాలు మాత్రమే కాదు యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్.. ఇలా విభిన్నాంశాలకు చెందిన సినిమాలకూ పట్టం కడుతున్నారని క్రీకింగ్ ప్రొజెక్టర్స్‌కు చెందిన బి.శరత్ అంటున్నారు. ఆయన గత కొంతకాలంగా కాఫీషాప్‌లలో తాము రూపొందించిన పొట్టి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. సన్నిహితులతో పిచ్చాపాటీ ముచ్చటిస్తూ, నచ్చిన స్నాక్స్, కాఫీలను సేవిస్తూ, పూర్తి విశ్రాంతిగా కూర్చుని ఓ వైవిధ్యభరితమైన ఆలోచన తాలూకు ‘తెర’రూపాన్ని తిలకించడం.. అదీ రూ.100 లోపు ఖర్చుతో అనేది చాలా ఆనందించదగిన విషయం అంటున్నారాయన.  కాఫీలాంజ్‌లలో ప్రదర్శించే సినిమాలను చూడడానికి సీరియస్ ప్రేక్షకులు  మాత్రమే వస్తారు అని 3నిటీ అనే సినిమాకు  ఎడిటర్‌గా పనిచేసిన కె.అభిషేక్ అంటున్నారు.  ఆయన తన సినిమాను ఇటీవలే కెఫె రాబాత్‌లో ప్రదర్శించారు.
 -    కాఫీషాప్‌లలో ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో తెలుగు షార్ట్ ఫిల్మ్‌లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటం భవిష్యత్తులో తెలుగు భాష ప్రాచుర్యం యువతలో పెరిగే అవకాశం అని భాషా ప్రేమికులు అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement