పడమటి సంధ్యారాగం
ప్రొఫెసర్ స్టీఫెన్ స్లావెక్.. ఒకప్పుడు అమెరికాలో రాక్ మ్యూజిక్‌తో షేక్ చేసినా.. తర్వాత భారతీయ సప్తస్వరాలకు ఫిదా అయిపోయాడు. ఖండాలు దాటి మన దేశానికి వచ్చాడు. వారణాసి ఒడిలో సరిగమలు దిద్దాడు. పండిట్ రవిశంకర్‌కు ప్రియశిష్యుడిగా, సితార్ విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడు. శనివారం ‘గురుపూర్ణిమ’ను పురస్కరించుకొని తన గురువుకు నివాళిగా భాగ్యనగరంలో సంగీత కచేరి చేశాడు. హైదరాబాదీల మనసు దోచేశాడు. ఈ సందర్భంగా పండిట్ రవిశంకర్‌తో తనకున్న అనుబంధాన్ని, సంగీతంపై తన భవిష్యత్తు లక్ష్యాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
మనుషులొక్కటే... నగరమొక్కటే...
నా గురువు, ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు హైదరాబాద్‌కు సంగీత కచేరీ చేయడానికి వచ్చా. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. భారత్‌లో కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై.. ఇలా అన్ని నగరాలు చూశా. భారతీయులందరూ ఇతరులను ఆదరించడంలో ఒకేలా ఉంటారు. అందుకే ఇక్కడ అన్ని సిటీలు నాకు ఒకేలా కనిపిస్తున్నాయి.
బనారస్ వర్సిటీ గోల్డ్‌మెడలిస్ట్‌ను..
969లో అనుకుంటా.. అమెరికాలో ఉన్నప్పుడే మొదటిసారి హిందుస్థానీ సంగీతాన్ని విన్నా. ఆ తర్వాత రాక్ మ్యూజిక్ పక్కన పెట్టి భారతీయ సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టా. ఎలాగైనా హిందుస్థానీ రాగాలను అవపోసన పట్టాలని భారత్‌కు వచ్చా. 1976లో బనారస్ యూనివర్సిటీ నుంచి సంగీతంలో పట్టా అందుకున్నా. గోల్డ్ మెడల్ కూడా సాధించా. ఆ రోజులను ఎప్పటికీ మరచిపోలేను. పవిత్ర ప్రదేశంలో, మహారుషులు సంచరించే చోట సంగీతం నేర్చుకోవడం నా పూర్వజన్మ సుకృతం.
భారతీయ సంగీతానికి దిక్సూచి
పండిట్ రవిశంకర్ భారతీయ సంగీతానికి దిక్చూచిలాంటివాడు. ఆయన శిష్యుడైనందుకు నిజంగా గర్విస్తున్నా. అమెరికాలో ఒకసారి ఆయన కచేరీకి నేను ర్యాక్‌మ్యూజిక్ వాయించా. అప్పడే ఆయనను మొదటిసారి చూడటం. ఆ తర్వాత 1977 నుంచి 2007 వరకు దాదాపు 30 ఏళ్లు ఆయన దగ్గర సితార్ నేర్చుకున్నా.
గురువుగారికి మా ఆవిడ వంటంటే ఇష్టం..
అమెరికా వచ్చినప్పడు ఆయన మా ఇంట్లో ఉండేవారు. మా నాన్నగారితో బాగా మాట్లాడేవారు. మా ఆవిడ చేసే వంటలంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఫ్యూజన్ మ్యూజిక్‌కు ఆయనే ఒక విధంగా ఆద్యుడని చెప్పాలి. సంగీతం మహాసముద్రంలాంటిది. దానికి వెస్ట్రన్, ఈస్ట్రన్ అంటూ సరిహద్దులు గీయొద్దు. ఇప్పుడు అన్నీ పాశ్చ్యాతీకరణ చెందుతున్నమాట వాస్తవమే కావొచ్చు. అలాగే భారతీయ సంగీతం కూడా మార్పుచెందుతుందేమో.. కానీ, తన మూలాలను మాత్రం ఎప్పటికీ కోల్పోదు.
నా మనసంతా భారతీయమే..
పండిట్ రవిశంకర్, జాకీర్‌హుస్సేన్, స్వపన్ చౌదరి, సుఖ్విందర్ సింగ్, కుమార్ బోస్‌లాంటి భారతీయ సంగీత దిగ్గజాలతో కలసి ఎన్నో కచేరీలు చేశా. అ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేను. నా ఆత్మ కూడా భారతీయమే. టెక్సాస్ వర్సిటీలో మ్యూజిక్ ప్రొఫెసర్‌గా 20 ఏళ్ల నుంచి సంగీతానికి నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నా. భవిష్యత్తులో భారతీయ సంగీతాన్ని మరింత విస్తృతం చేస్తా.
ప్రవీణ్‌కుమార్ కాసం