లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ | sekhar kammula special interview for sakshi | Sakshi
Sakshi News home page

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

Published Tue, Jul 1 2014 12:27 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

లైఫ్ ఈజ్  బ్యూటిఫుల్ - Sakshi

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

అమెరికాలో ఎవరైనా ‘మీ దేశం గురించి చెప్పండి’ అని అడిగితే.. శేఖర్ కమ్ముల నూటికి తొంభై విషయాలు హైదరాబాద్ గురించే చెప్పేవారట. పతంగుల కోసం ముషీరాబాద్ జైలు కంచెలు దాటిన క్షణాలు.. లిఫ్ట్‌ల కోసం స్నేహితులతో పోటీపడ్డ సంగతులు.. నగరానికొచ్చిన బంధువుల ముందు లిటిల్‌గైడ్‌లా పోజు కొట్టిన జ్ఞాపకాలను తలచుకుంటున్నప్పుడు శేఖర్ కమ్ముల ముఖంలో సిసలైన హైదరాబాదీ కనిపిస్తాడు. సిటీ గురించి ఆయన మాటల్లోనే...

ఎవరో అంటే విన్నాను... హైదరాబాద్‌లాంటి నగరం కడతానని. హైదరాబాద్ అంటే బిల్డింగులు, బ్రిడ్జీలు కాదు! బంధాలు.. అనుబంధాలు!!  సింగపూర్ లాంటి నగరాన్ని కట్టగలరు. కానీ, హైదరాబాద్‌ని మరపించే నగరాన్ని నిజాం కూడా తిరిగి కట్టలేడు.
 ‘పతంగులు ఎగరేసే రోజులొచ్చాయంటే.. ముషీరాబాద్ జైలు ఖైదీలతో బోలెడు పనులుండేవి. పతంగులకు, ఖైదీలకు లింక్ ఏమిటంటారా..! పద్మారావునగర్‌లో మా ఇల్లు ముషీరాబాద్ జైలుకి దగ్గరగా ఉండేది. జనవరి వచ్చిందంటే కాలనీలో పిల్లలమంతా పెద్ద పెద్ద పతంగులు తయారు చేసి ఎగరేసేవాళ్లం. పతంగులు వెళ్లి జైలు ప్రాంగణంలో పడేవి. ఖైదీలు వాటిని తీసి జాగ్రత్తగా దాచి పెట్టేవారు. అప్పట్లో ఆ జైలుకి గోడ బదులు కంచె ఉండేది. చాలా తేలిగ్గా అందులోకి వెళ్లిపోయి ఖైదీలకు సిగరెట్లు, పాన్‌లు, వక్కపొడుల ప్యాకెట్లు ఇచ్చి పతంగులు తెచ్చుకునే వాళ్లం. నాకు మూడేళ్లున్నపుడు నాన్న ఉద్యోగరీత్యా ఏలూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. రావడమే పద్మారావునగర్‌లో ఇల్లు కొనుక్కున్నారు. అప్పట్నుంచీ ఇక్కడే ఉంటున్నాం.
 
ఆ రోజులు తిరిగిరావు...
నా చిన్నప్పుడు హైదరాబాద్.. ఓ అందమైన స్వప్నంలా ఉండేది.  నో ఓవర్ పాపులేషన్. నో పొల్యూషన్.. అన్నిటికన్నా గొప్ప విషయం..  హైదరాబాదీల అభిమానం. ఎముకలు కొరికే చలికాలం, ముచ్చెమటలు పట్టే వేసవికాలం ఇక్కడి వారికి తెలియదు. నేను సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్రాక్టిన్స్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటి దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు.. మధ్యలో రైల్వే ట్రాక్. నడుచుకుంటూ వెళ్లిపోయేవాళ్లం. చాలా వరకూ లిఫ్ట్‌లపై వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు కొత్తవారి బండి ఎక్కాలంటే భయపడాల్సి వస్తోంది. అప్పుడు.. ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఒంటరిగా రాత్రి తొమ్మిదింటి వరకూ తిరిగేవారు.
 
నేనే గైడ్‌ని...
వేసవి సెలవులు వచ్చాయంటే గోదావరి జిల్లాల నుంచి సిటీకి వచ్చే మా బంధువులకు నేనే గైడ్‌ని. నగరానికి ఎవరొచ్చినా బిర్లామందిర్, గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, జూపార్క్.. తప్పక చూసేవారు. బంజారాహిల్స్‌లోని భాస్కర్ ప్యాలెస్ స్థానంలో ఇప్పుడు కేర్ ఆసుపత్రి ఉంది. అప్పట్లో హైదరాబాద్ హోటళ్లకు ప్రసిద్ధి.  కాస్త డబ్బున్న వాళ్లయితే ఫేమస్ హోటళ్లకు వెళ్లేవారు.  ఇక ఆస్పత్రులంటే గాంధీ, ఉస్మానియా. ఎంతటి వారికైనా అక్కడి వైద్యమే.
 
యూఎస్ రిటర్న్..

నేను ఇంజనీరింగ్ సీబీఐటీలో పూర్తిచేశాను. స్కూలు, కాలేజీ చదువులు చాలా సరదాగా గడిచాయి. స్టూడెంట్స్‌కి 45 రూపాయలు కడితే జనరల్‌పాస్ వచ్చేది. నెలంతా ఫుల్ ఎంజాయ్. నా సినిమాల్లో చాలావరకు హైదరాబాద్ వాతావరణం కనపడేలా ప్లాన్ చేసుకోవడం వెనక నా అనుభవాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే నా సినిమాల్లో కుర్రాళ్లు మాట్లాడే భాష కూడా చాలా సహజంగా ఉంటుంది. మాటకు ముందూవెనకా బే, సాలే.. అనే పదాలు వాడటం హైదరాబాదీలకు మాత్రమే సొంతం.

ఇక్కడ మాట్లాడే హిందీ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా సులువుగా నేర్చేసుకోవచ్చు. అప్పట్లో  ఆటోవాళ్లు, రిక్షావాళ్లు చాలా వరకూ హిందీలోనే మాట్లాడేవారు. అలాగే ఇక్కడ కల్చర్ చాలా గొప్పది. ఏ పండగొస్తే జనమంతా ఆ దేవుడి భక్తులయిపోతారు. రంజాన్ వచ్చిందంటే తెలుగువారింట్లో కూడా బిర్యానీ వాసన గుప్పుమనేది. వినాయక చవితి వచ్చిందంటే.. ముస్లిం యువకుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్ టైంలో చర్చిల చుట్టూ హంగామా. ఇలాంటి గొప్ప కల్చర్ ఇండియా కాదు, ప్రపంచం మొత్తం తిరిగినా కనిపించదు.

నో హిల్స్.. ఓన్లీ నగర్..
చాలామంది అడుగుతుంటారు.. సినిమావాళ్లంతా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో ఉంటే మీరింకా పద్మారావునగర్‌లోనే ఉన్నారెందుకని. ఆ ప్రశ్నకు ఒక్కమాటలో సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లు ‘మీ దేశం గురించి చెప్పండ’ని అడిగితే.. పద్మారావునగర్ గురించే చెప్పేవాడ్ని. ఒక పెద్ద భవనంలో బంధించినట్టు బతకడం నా వల్ల కాదు. పొద్దున లేవగానే చప్పుళ్లు వినిపించాలి. దగ్గరలో గుడి, బడి ఉండాలి. ఇంటెదురుగా కిరాణాకొట్టుండాలి. తెల్లారేసరికి పేపరమ్మే వాడు, సాయంత్రం పూలమ్మేవాడు వీధిలో కనిపించాలి. ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇప్పటికీ ‘బ్లూ సీ’కెళ్లి చాయ్ తాగొస్తుంటాను.

మెట్రో మారుస్తుంది..
త్వరలో మన సిటీలో మెట్రోరైలు తిరగబోతుంది. మెట్రో వచ్చాక ట్రాఫిక్ తగ్గుతుంది. పెట్రోల్ వాడకం తగ్గుతుంది. మెట్రో ప్రయాణం వల్ల మనుషుల మధ్య పరిచయాలు, అనుబంధాలు పెరుగుతాయని ఆశిస్తున్నాను.

 -భువనేశ్వరి
ఫొటోలు: ఎం.అనిల్ కుమార్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement