ఇది మామూలు హెల్మెట్ కాదు, బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్. ఈ హెల్మెట్ మెదడు పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ‘ఎలక్ట్రో ఎన్‌సెఫాలోగ్రామ్’ (ఈఈజీ) పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్’ కంపెనీ ఈ హెల్మెట్‌ను ‘ఐ సింక్‌వేవ్’ పేరుతో రూపొందించింది.
మెదడు పరీక్షలను నిర్వహించడానికి ఖరీదైన ఈఈజీ మెషిన్లకు బదులుగా ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ బ్రెయిన్ మ్యాపింగ్ హెల్మెట్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈఈజీ మెషిన్ ద్వారా మెదడు పరీక్ష జరిపించుకోవాలంటే, అడ్హెసివ్ ప్యాచ్‌లు, జెల్ వాడాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్‌కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.
ఇది రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేసుకుంటే, ఏడు గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని లోపలి భాగంలోని 19 ఎల్‌ఈడీ బల్బులు మెదడును క్షుణ్ణంగా స్కాన్ చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధి వంటి మెదడు సంబంధిత వ్యాధులను దీని ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. దీని ధర 6.54 కోట్ల వాన్‌లు (రూ. 41.04 లక్షలు).
Comments
Please login to add a commentAdd a comment