ఒంటిచేత్తో.. వంద కిలోల బరువు ఎత్తగలరా..? ఆగకుండా.. అలసిపోకుండా
20 కిలోమీటర్లు పరుగెత్తగలరా..? నిండు ఆరోగ్యంతో.. 150 ఏళ్లు బతకగలరా..?
మరణం తర్వాతా.. జీవితాన్ని కొనసాగించగలరా..? అమ్మో... ఇవన్నీ శక్తికి మించిన పనులే కదూ! ఊహూ... కానేకాదేమో!
టెక్నాలజీ సాయంతో ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి... శక్తికి మించిన పనులూ.. చకచకా చేసేయొచ్చు! కుదిరితే
అమరత్వమూ పొందొచ్చు!!
కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి చేసే ప్రతి పనినీ సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే మనిషి పనులను మాత్రమే కాదు.. ఏకంగా మనిషినే టెక్నాలజీలు నిలువెల్లా మార్చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు! పరిమితమైన మనిషి శక్తి సామర్థ్యాలను అపరిమితంగా మార్చివేయడమే కాదు.. మనిషిని అమరుడిని చేసేలా.. శరీరంలో సైతం భాగం అయిపోతాయని చెబుతున్నారు. మొత్తం మీద మనిషి.. తన పరిణామ చరిత్రను తాను సృష్టించుకుంటున్న టెక్నాలజీలతోనే మలుపు తిప్పుకుంటాడని.. నిలువెల్లా రూపాంతరం చెంది.. ‘నరయంత్రుడు’ అయిపోతాడనీ అంటున్నారు. ‘ట్రాన్స్‌హ్యూమనిజం (మానవ రూపాంతరత)’ భావన వీటన్నింటినీ సాధ్యం చేస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు.
ఏమిటీ ట్రాన్స్‌హ్యూమనిజం..?
పరిమితంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలన్న మనిషి తపన ఈనాటిది కాదు. జైలు జీవితం నుంచి తప్పించుకుని పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దూరతీరాలకు వెళ్లిపోవాలని ఆశపడిన ఇకారస్, డియోడలస్‌లు పక్షి ఈకలతో రెక్కలు కట్టుకొని ఎగిరేందుకు ప్రయత్నించిన గాథ గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇక హిందూ పురాణాల్లోనైతే.. సాధారణ మనిషికి సైతం అపరిమిత శక్తులు అబ్బినట్లు చెప్పే గాథలు ఎన్నో ఉన్నాయి. అయితే... ఆధునికయుగంలో సాంకేతికతల ద్వారా మనిషి శక్తి, సామర్థ్యాలను అనూహ్యంగా పెంచుకోవడానికి 1960ల నుంచి మొదలైన ఉద్యమాన్నే ‘ట్రాన్స్‌హ్యూమనిజం’గా చెప్పుకోవచ్చు. ఇలా టెక్నాలజీల సాయంతో అపరిమిత శక్తులు పొందే మనిషిని ‘ట్రాన్స్‌హ్యూమన్ (రూపాంతర మానవుడు)’గా పిలుస్తున్నారు. ఇప్పటిదాకా సైన్స్ కాల్పనిక సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైన ఇలాంటి రూపాంతర మనుషులు మనిషి, యంత్రాలు కలగలిసిపోయినట్లుగా ఉంటారు కాబట్టి.. వారిని మనం ‘నరయంత్రులు’గానూ పిలుచుకోవచ్చు! ఇందుకోసం ఉపయోగపడే సాంకేతికతలన్నింటికీ కలిపి ‘మానవ శక్తులను పెంచే సాంకేతికతలు (హ్యూమన్ ఎన్‌హ్యాన్సింగ్ టెక్నాలజీస్)’ అనే పేరునూ ట్రాన్స్‌హ్యూమనిజం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉపయోగిస్తున్నారు.
బాహ్య అస్థిపంజరంతో కొండంత బలం..!
వీపుపై 90 కిలోల బరువు వేసుకుని.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలరా..? అమెరికా పరిశోధకులు రూపొందిస్తున్న బాహ్య అస్థిపంజరం (ఎక్సో స్కెలిటన్)ను ధరిస్తే.. మీరు వంద కిలోల బరువునూ అవలీలగా మోయగలరు. మనిషిపై దాదాపుగా బరువే పడకుండా చూసే ఈ ‘హ్యూమన్ యూనివర్సల్ లోడ్ క్యారియర్-హెచ్‌యూఎల్‌సీ’ని లాఖీడ్ మార్టిన్స్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని గనక సైనికులకు అందుబాటులోకి తెస్తే.. ఇక యుద్ధరంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అంటున్నారు. మామూలు పౌరులకు సైతం ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
కళ్లజోడు కంప్యూటర్‌తో చిటికెలో పనులు!
ఇంతకుముందు మాదిరిగా మన మానసిక శక్తి ఇంతే.. అని ఇకపై సరిపెట్టుకోనవసరం లేదు. మన శక్తుల పరిమితులను దాటి అనేక విషయాలను సాధ్యం చేసిపెట్టే టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఉదాహరణకు.. కళ్లజోడు కంప్యూటర్‌గా పేరుపొందిన గూగుల్ గ్లాస్‌నే తీసుకుంటే.. దీన్ని పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భాష తెలియకున్నా.. మనం చకచకా మాట్లాడేయొచ్చు! మనం మన భాషలో మాట్లాడితే చాలు.. ఇది వారి భాషలో చెప్పి.. వారి మాటలను తిరిగి మన భాషలో మనకు చెబుతుంది. అలాగే మన పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేకుండా దీనికి పురమాయిస్తే.. ముఖ్యమైన సమాచారాన్ని ఇది భద్రం చేసి.. అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా పనులను చేసిపెట్టనుంది.
జన్యుచికిత్సతో దీర్ఘాయుష్షు!
మానవ రూపాంతరతను సాధ్యం చేసే టెక్నాలజీల్లో హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. మన దేహంలో జరిగే అన్ని పనుల వెనకా.. జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే. ఆ జన్యువులను నియంత్రించడం ద్వారా అవసరమైన ఫలితాలు రాబట్టుకునే పద్ధతినే మానవ జన్యు ఇంజనీరింగ్‌గా చెప్పుకోవచ్చు. దీనిద్వారా జీవశాస్త్రపరంగా ఉన్న ఎన్నో పరిమితులను మనిషి అధిగమించవచ్చు. ఔషధాల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా జన్యువులను నియంత్రిస్తూ.. లేదా కత్తిరిస్తూ.. లేదా జతచేస్తూ.. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి దీర్ఘాయుష్షును ప్రసాదించొచ్చు. ఉదాహరణకు.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవలే జంతువుల్లో ఎన్‌కోఆర్1 అనే జన్యువును అణచేయడం ద్వారా.. వాటి శరీరాల్లో కండరాల పెరుగుదలను గణనీయంగా పెంచగలిగారు. అంతేకాదు.. కండరాలు దట్టంగా పెరగడమే కాకుండా వాటి కణాల్లో మైటోకాండ్రియాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయట. మైటోకాండ్రియాలంటే కణశక్తి భాండాగారాలు. వాటి సంఖ్య పెరగడం అంటే.. పరోక్షంగా.. మన శరీరం శక్తి పెరగడమే! ఈ జన్యుచికిత్సలు మనుషుల్లో ఇప్పుడప్పుడే అయ్యే పని కాకపోవ చ్చు. కానీ.. ఏదోరోజు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
సైబోర్గ్.. మనిషి సహజం అవయవాలు కృత్రిమం
చూడటానికి అందరు మనుషుల్లా మామూలుగానే ఉంటారు. కానీ ఎదలో కొట్టుకునే గుండె మాత్రం కృత్రిమం. చక్కగా వినగలుగుతారు. కానీ వారి చెవిలో ఉన్న కాక్లియా మాత్రం పరికరం. ఇంకా.. ఎముకలు, కండరాలు, మెదడుకు అమర్చే కంప్యూటర్ చిప్‌లు.. పైకి కనిపించని ఎన్నో ఇంప్లాంట్లు, పరికరాలు వారిలో ఉంటాయి. ఇలా.. లోలోపల అవయవాల స్థానంలో కత్రిమ పరికరాలతో జీవిస్తూ.. పైపైకి మామూలుగానే కనిపించే ‘సైబోర్గ్స్’ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వస్తున్నారు. మానవ రూపాంతరత సాధించే దిశగా సైబోర్గ్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
కంప్యూటర్‌లోకి మెదడు ఎక్కిస్తే.. అమరత్వం!
మనిషి చనిపోతాడు. కానీ.. అతడి జీవితం అక్కడితోనే ముగిసిపోదు. అతడి దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ.. మెదడు మాత్రం కంప్యూటర్‌లో భద్రంగా ఉంటుంది. కంప్యూటర్ తలకు.. రోబో శరీరం తోడవుతుంది. మరణించిన తర్వాత కూడా మనిషి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. జీవితం తిరిగి కొనసాగుతుంది. ‘మైండ్ అప్‌లోడింగ్’ టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. 2045 నాటికి కంప్యూటర్‌లోకి మెదడును ఎక్కించడం దాదాపుగా సాధ్యం అవుతుందని, ఆ తర్వాత మరో 90 ఏళ్లలో మనిషి శరీరాల స్థానంలో రోబో శరీరాలు రావడం ఖాయమని అంటున్నారు గూగుల్ కంపెనీ నిపుణులు. ఒకవేళ ఇదే గనక వాస్తవరూపం దాల్చితే మనిషి కొంత మేరకైనా అమరుడు అయినట్లే!
- హన్మిరెడ్డి యెద్దుల
మనిషి... మారిపోతున్నాడు!
Published Wed, Sep 24 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement