Genetic Engineering
-
అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!
భూమ్మీద పుట్టిన జీవరాశుల్లో అనేక జీవులు అంతరించిపోయాయి. ఇప్పటికే అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించడం సాధ్యంకాదనే ఇంతవరకు అనుకుంటూ వచ్చారు. అయితే, అది సాధ్యమేనని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు నడుంబిగించారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ పక్షులను తిరిగి పుట్టించడానికి అమెరికన్ బయోసైన్సెస్–జెనెటిక్ ఇంజినీరింగ్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ప్రారంభించారు. డోడో పక్షులు భారీగా ఉండేవి. ఇవి ఎగరగలిగేవి కాదు. ఒకప్పుడు మారిషస్‌లో విరివిగా తిరిగేవి. ఈ జాతిలోని చివరి పక్షి 1681లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పక్షులకు చెందిన పురాతన డీఎన్ఏ నమూనాలను సేకరించామని, వాటి ఆధారంగా మారిషన్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ సహకారంతో డోడో పక్షులకు పునర్జీవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలోసల్ బయోసైన్సెస్ వ్యవస్థాపకుడు బెన్ లామ్ వెల్లడించారు. డోడో తరహాలోనే ఇప్పటికే అంతరించిన గులాబి పావురానికి కూడా పునర్జీవం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇవి చదవండి: ‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది! -
ల్యాబ్ లీకేజ్ నిజమేనా?
కరోనా కాటు మనిషికే ఎక్కువ చేటు కలిగించేలా కోవిడ్ వైరస్ జన్యు నిర్మాణం ఉందా? గబ్బిలాల నుంచి మనిషి కరోనా సోకిందనే వాదనలో బలం లేదా? చైనా ల్యాబరేటరీ నుంచి వైరస్ లీకవడం నిజమేనా? వీటన్నింటికీ సమాధానమిచ్చే నూతన పరిశోధన ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంతకీ కొత్త పరిశోధన ఏం చెబుతోంది? చూద్దాం.. సృష్టిలో ఇన్ని జీవరాసులున్నా మనిషిపైనే కరోనాకు మక్కువ ఎక్కువని మరోమారు తేలింది. కరోనాను కలిగించే సార్స్ సీఓవీ2(కోవిడ్–19) వైరస్ ఇతర జీవుల కన్నా మానవులకే అధికంగా సోకే సామర్థ్యం చూపిందని నూతన అధ్యయనం వెల్లడిస్తోంది. దీంతో ఈ వైరస్ పుట్టుకపై మరోమారు సంశయాలు పెరిగాయి. ఈ వైరస్ ల్యాబ్ నుంచి లీకైందన్న అనుమానాలకు బలం చేకూరింది. ఆస్ట్రేలియాకు చెందిన లాట్రోబె యూనివర్సిటీ, ఫ్లిండర్ వర్సిటీల పరిశోధకులు కరోనా వివిధ జీవుల్లో కలిగించే ఇన్ఫెక్షన్ సామర్థ్యంపై ప్రయోగాలు చేశారు. కంప్యూటర్ మోడలింగ్ ద్వారా కరోనా ఆవిర్భావరోజుల్లో వ్యా పించిన వైరస్‌ను అధ్యయనం చేశారు. ఈ వైరస్ మనిషితో పాటు మరో 12 రకాల జంతువుల్లో ఇన్ఫెక్షన్ కలిగించిన సామర్థ్యాన్ని పరిశీలించారు. గబ్బిలాల నుంచి మనిషికి ఈ వైరస్ సోకే క్రమంలో మరో అతిధేయి(వెక్టర్) ఉందా? లేక ఏదైనా ల్యాబ్ నుంచి లీకైందా అని పరిశీలించడమే అధ్యయన ఉద్దేశం. ఈ వివరాలు జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. ఇలా చేశారు.. రీసెర్చ్‌లో భాగంగా ఎంపిక చేసిన జంతువుల జీనోమ్ డేటానుంచి ప్రతి జీవికి సంబంధించిన కీలక ఏసీఈ2 ప్రొటీన్(జీవుల్లో ఈ ప్రోటీన్ కోవిడ్ వైరస్‌కు రిసెప్టార్‌గా పనిచేస్తుంది) కంప్యూటర్ మోడల్‌ను చాలా కష్టపడి సృష్టించారు. అనంతరం ఈ కంప్యూటర్ మోడల్స్‌తో కోవిడ్ వైరస్ స్పైక్ ప్రొటీన్ ఎంత బలంగా బంధం ఏర్పరుచుకుంటుందనే విషయాన్ని గమనించారు. ఆశ్చర్యకరంగా గబ్బిలాలు, పంగోలిన్లలాంటి ఇతర జీవుల ఏసీఈ2 కన్నా మానవ ఏసీఈ2 ప్రొటీన్‌తో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ అత్యంత బలంగా బంధం ఏర్పరుచుకుందని వెల్లడైంది. పరీక్షకోసం ఎంచుకున్న ఇతర జీవుల్లో ఏదైనా కరోనా వైరస్ పుట్టుకకు కారణమై ఉంటే పరిశోధనలో సదరు జీవి కణజాలంలో కరోనా స్పైక్ ప్రొటీన్ బలమైన బంధం ఏర్పరిచి ఉండేదని సైంటిస్టులు చెప్పారు. ‘‘మానవ కణజాలంతో కోవిడ్ వైరస్ బలమైన బంధం చూపింది. ఇతర జీవుల నుంచి ప్రాథమికంగా వైరస్ మనిషికి సోకి ఉంటే తప్పక సదరు జీవుల కణజాలంలో కోవిడ్ ప్రోటీన్ మరింత బలమైన బంధం చూపిఉండేది. మనిషి ప్రోటీన్‌తో పోలిస్తే గబ్బిలం ప్రొటీన్‌తో కోవిడ్ ఏర్పరచిన బంధం చాలా బలహీనంగా ఉంది’’ అని ప్రొఫెసర్ డేవిడ్ వింక్లర్ చెప్పారు. గబ్బిలాల నుంచి మనిషికి ఈ వైరస్ సోకిందనే వాదనకు తాజా పరిశోధన భిన్నంగా ఉందన్నారు. ‘‘ఒకవేళ నిజంగానే ఈ వైరస్ ప్రకృతి సహజంగా వచ్చి ఉంటే మనిషి సోకే ముందు ఒక ఇంటర్మీడియెరీ వెక్టర్(మధ్యస్థ అతిధేయి) ఉండి ఉండాలి. అదేంటనేది తేలలేదు.’’ అని ప్రొఫెసర్ నికోలాయ్ పెట్రోవ్స్కీ అభిప్రాయపడ్డారు. అంతిమంగా కరోనా మనిషికి ఎలా సోకిందనే విషయమై రెండు వివరణలున్నాయని రీసెర్చ్‌లో పాల్గొన్న సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. గబ్బిలాల నుంచి మరో ఇంటర్మీడియెరీ వెక్టర్(ఇంకా కనుగొనలేదు) ద్వారా మనిషికి సోకడం లేదా వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉండవచ్చనేవి ఈ రెండు ఆప్షన్లని వింక్లర్ తెలిపారు. లోతైన పరిశోధనలు జరిపితే మానవాళిపై కరోనా దాడికి అసలైన కారణాలు బహిర్గతమవుతాయన్నారు. పెంపుడు జంతువులు కుక్క, పిల్లి, ఆవుకు సైతం కరోనా సోకే అవకాశాలున్నాయన్నారు. పంగోలిన్స్తో సంబంధం? పరిశోధనలో తేలిన ఇంకో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే కరోనా ప్రొటీన్ మనిషి కణజాలం తర్వాత అంత బలంగా పంగోలిన్స్(యాంట్ ఈటర్) కణజాలంతో బలమైన బంధం ఏర్పరిచింది. ఈ పంగోలిన్స్ చాలా అరుదైన జీవులు. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. గబ్బిలాలు, పాములు, కోతుల కన్నా పంగోలిన్ కణజాలంతో కరోనా ప్రొటీన్ బంధం చాలా ధృఢంగా ఉందని వింక్లర్ చెప్పారు. కరోనా కొత్తలో కొందరు సైంటిస్టులు పంగోలిన్స్‌లో కరోనా వైరస్‌ను కనుగొన్నట్లు చెప్పారని, కానీ ఇది సమాచార లభ్యతాలోపం వల్ల జరిగిందని తెలిపారు. మనిషిలో కరోనా కలిగించే వైరస్ స్పైక్ ప్రొటీన్, పంగోలిన్స్‌లో కరోనా కలిగించే స్పైక్ ప్రొటీన్ దాదాపు ఒకేలా ఉంటాయన్నారు. అందువల్ల ప్రస్తుత పరిశోధనలో సైతం మనిషి తర్వాత పంగోలిన్ కణజాలంతో కరోనా ప్రొటీన్ బలమైన బంధం ఏర్పరిచిందని వివరించారు. పంగోలిన్ విషయం మినహాయించి ఇతర జీవులన్నింటి కన్నా మనిషి కణాలపైనే కరోనా ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నది తమ రిసెర్చ్‌లో తేలిన విషయమని చెప్పారు. -
సైన్స్ శిఖరం.. పీఎమ్ భార్గవ
శాస్త్రీయ ఆలోచనలు శాస్త్రవేత్తలందరికి ఉంటాయనుకోవడం పొరపాటు. తాము చేసిన పరిశోధనలకు దైవ సహకారం ఉందని బహిరంగంగా ప్రకటించుకునే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో ఉపగ్రహాలని అంతరిక్షములోకి పంపించే ముందు, తర్వాత కూడా విధిగా మన శాస్త్ర వేత్తలు పూజలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ నిల్వ చేసే పెట్టెలకు కూడా పూజలు చేసే వాటిని ఓపెన్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథంని కల్గి ఉండటమే కాకుండా, సైన్స్ పరిశోధనల విషయంలో పాలకులు తీసుకునే నిర్ణయాలని ఎప్పటికప్పుడు సహేతుకంగా విమర్శించకల్గిన అతి కొద్దిమంది శాస్త్రవేత్తలలో పీఎమ్ భార్గవ ఒకరు. భార్గవ వంటి వ్యక్తిత్వం కల్గిన శాస్త్రవేత్తలు నేడు అరుదుగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్‌లోని ఆజ్మీర్లో రామచంద్ర భార్గవ, గాయత్రి భార్గవ దంపతులకు జన్మించారు. ‘జన్యు ఇంజనీరింగ్’ అనే పదాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. భారతదేశంలో ఆధునిక జీవశాస్త్రం వాస్తుశిల్పిగా ఆయన ప్రసిద్ధి చెందారు. 70లలో బయోటెక్నాలజీ విభాగం ఏర్పాటులో భార్గవ ముఖ్య పాత్ర పోషించారు. హైదరాబాద్ లోని సంభావన ట్రస్ట్, భోపాల్‌లో బేసిక్ రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ డెవెలప్మెంట్ సొసైటీ, న్యూఢిల్లీలోని మెడికల్లీ ఎవేర్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్స్ వంటి పలు సంస్థలకు చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. 2005 నుండి 2007 వరకు నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛెర్మైన్‌గా కూడా పనిచేశారు. భార్గవ 100 వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అలాగే 1986లో ఆయన ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 1998లో లెజియన్ డి హొన్నూర్తో తనను సత్కరించారు. ఇలా ఎన్నో కీర్తి పురస్కారాలను ఆయన అందుకున్నారు. జాతి గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన వివిధ సందర్భాలలో వేలాది ఉపన్యాసాలు ఇచ్చారు, 550 మంది ప్రముఖుల వ్యాసాల సంపుటి, ఆరు పుస్తకాలు కూడా వెలువరించారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థకి వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ సంస్థ వల్లే హైదరాబాద్ బయోటెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా పేరు పొందింది. భారతదేశంలో జన్యుమార్పిడి పంటలని వేగంగా, ఎలాంటి శాస్త్రీయ పరిశోధన లేకుండా ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఈ పంటలు అధిక దిగుబడినిస్తాయి గానీ, వాటిలో పోషక విలువలు ఉండవని తెలిపారు. జ్యోతిష్యం అశాస్త్రీయం అని ఆయన తెలిపారు. హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. భోపాల్ గ్యాస్ బాధితులకు అండగా నిలిచారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. బయోటెక్నాలజీని వ్యాపారకోణంలో ఉపయోగించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయనని ఆధునిక భారతదేశ జీవశాస్త్రపిత అని కూడా పిలుస్తారు. సైన్స్ ఫలాలు పేదవారికి అందాలనేది ఆయన ఆశయం. జనవిజ్ఞాన వేదిక లాంటి సైన్స్ ప్రచార సంస్థలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన 2017 ఆగస్ట్ 1న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సైన్స్ ఉద్యమానికి తీరనిలోటు. - ఎమ్. రామ్‌ప్రదీప్, జనవిజ్ఞానవేదిక, తిరువూరు మొబైల్: 94927 12836 -
మనిషి... మారిపోతున్నాడు!
ఒంటిచేత్తో.. వంద కిలోల బరువు ఎత్తగలరా..? ఆగకుండా.. అలసిపోకుండా 20 కిలోమీటర్లు పరుగెత్తగలరా..? నిండు ఆరోగ్యంతో.. 150 ఏళ్లు బతకగలరా..? మరణం తర్వాతా.. జీవితాన్ని కొనసాగించగలరా..? అమ్మో... ఇవన్నీ శక్తికి మించిన పనులే కదూ! ఊహూ... కానేకాదేమో! టెక్నాలజీ సాయంతో ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి... శక్తికి మించిన పనులూ.. చకచకా చేసేయొచ్చు! కుదిరితే అమరత్వమూ పొందొచ్చు!! కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి చేసే ప్రతి పనినీ సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే మనిషి పనులను మాత్రమే కాదు.. ఏకంగా మనిషినే టెక్నాలజీలు నిలువెల్లా మార్చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు! పరిమితమైన మనిషి శక్తి సామర్థ్యాలను అపరిమితంగా మార్చివేయడమే కాదు.. మనిషిని అమరుడిని చేసేలా.. శరీరంలో సైతం భాగం అయిపోతాయని చెబుతున్నారు. మొత్తం మీద మనిషి.. తన పరిణామ చరిత్రను తాను సృష్టించుకుంటున్న టెక్నాలజీలతోనే మలుపు తిప్పుకుంటాడని.. నిలువెల్లా రూపాంతరం చెంది.. ‘నరయంత్రుడు’ అయిపోతాడనీ అంటున్నారు. ‘ట్రాన్స్‌హ్యూమనిజం (మానవ రూపాంతరత)’ భావన వీటన్నింటినీ సాధ్యం చేస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఏమిటీ ట్రాన్స్‌హ్యూమనిజం..? పరిమితంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలన్న మనిషి తపన ఈనాటిది కాదు. జైలు జీవితం నుంచి తప్పించుకుని పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దూరతీరాలకు వెళ్లిపోవాలని ఆశపడిన ఇకారస్, డియోడలస్లు పక్షి ఈకలతో రెక్కలు కట్టుకొని ఎగిరేందుకు ప్రయత్నించిన గాథ గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇక హిందూ పురాణాల్లోనైతే.. సాధారణ మనిషికి సైతం అపరిమిత శక్తులు అబ్బినట్లు చెప్పే గాథలు ఎన్నో ఉన్నాయి. అయితే... ఆధునికయుగంలో సాంకేతికతల ద్వారా మనిషి శక్తి, సామర్థ్యాలను అనూహ్యంగా పెంచుకోవడానికి 1960ల నుంచి మొదలైన ఉద్యమాన్నే ‘ట్రాన్స్‌హ్యూమనిజం’గా చెప్పుకోవచ్చు. ఇలా టెక్నాలజీల సాయంతో అపరిమిత శక్తులు పొందే మనిషిని ‘ట్రాన్స్‌హ్యూమన్ (రూపాంతర మానవుడు)’గా పిలుస్తున్నారు. ఇప్పటిదాకా సైన్స్ కాల్పనిక సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైన ఇలాంటి రూపాంతర మనుషులు మనిషి, యంత్రాలు కలగలిసిపోయినట్లుగా ఉంటారు కాబట్టి.. వారిని మనం ‘నరయంత్రులు’గానూ పిలుచుకోవచ్చు! ఇందుకోసం ఉపయోగపడే సాంకేతికతలన్నింటికీ కలిపి ‘మానవ శక్తులను పెంచే సాంకేతికతలు (హ్యూమన్ ఎన్‌హ్యాన్సింగ్ టెక్నాలజీస్)’ అనే పేరునూ ట్రాన్స్‌హ్యూమనిజం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉపయోగిస్తున్నారు. బాహ్య అస్థిపంజరంతో కొండంత బలం..! వీపుపై 90 కిలోల బరువు వేసుకుని.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలరా..? అమెరికా పరిశోధకులు రూపొందిస్తున్న బాహ్య అస్థిపంజరం (ఎక్సో స్కెలిటన్)ను ధరిస్తే.. మీరు వంద కిలోల బరువునూ అవలీలగా మోయగలరు. మనిషిపై దాదాపుగా బరువే పడకుండా చూసే ఈ ‘హ్యూమన్ యూనివర్సల్ లోడ్ క్యారియర్-హెచ్యూఎల్సీ’ని లాఖీడ్ మార్టిన్స్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని గనక సైనికులకు అందుబాటులోకి తెస్తే.. ఇక యుద్ధరంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అంటున్నారు. మామూలు పౌరులకు సైతం ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కళ్లజోడు కంప్యూటర్‌తో చిటికెలో పనులు! ఇంతకుముందు మాదిరిగా మన మానసిక శక్తి ఇంతే.. అని ఇకపై సరిపెట్టుకోనవసరం లేదు. మన శక్తుల పరిమితులను దాటి అనేక విషయాలను సాధ్యం చేసిపెట్టే టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఉదాహరణకు.. కళ్లజోడు కంప్యూటర్‌గా పేరుపొందిన గూగుల్ గ్లాస్‌నే తీసుకుంటే.. దీన్ని పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భాష తెలియకున్నా.. మనం చకచకా మాట్లాడేయొచ్చు! మనం మన భాషలో మాట్లాడితే చాలు.. ఇది వారి భాషలో చెప్పి.. వారి మాటలను తిరిగి మన భాషలో మనకు చెబుతుంది. అలాగే మన పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేకుండా దీనికి పురమాయిస్తే.. ముఖ్యమైన సమాచారాన్ని ఇది భద్రం చేసి.. అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా పనులను చేసిపెట్టనుంది. జన్యుచికిత్సతో దీర్ఘాయుష్షు! మానవ రూపాంతరతను సాధ్యం చేసే టెక్నాలజీల్లో హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. మన దేహంలో జరిగే అన్ని పనుల వెనకా.. జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే. ఆ జన్యువులను నియంత్రించడం ద్వారా అవసరమైన ఫలితాలు రాబట్టుకునే పద్ధతినే మానవ జన్యు ఇంజనీరింగ్‌గా చెప్పుకోవచ్చు. దీనిద్వారా జీవశాస్త్రపరంగా ఉన్న ఎన్నో పరిమితులను మనిషి అధిగమించవచ్చు. ఔషధాల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా జన్యువులను నియంత్రిస్తూ.. లేదా కత్తిరిస్తూ.. లేదా జతచేస్తూ.. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి దీర్ఘాయుష్షును ప్రసాదించొచ్చు. ఉదాహరణకు.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవలే జంతువుల్లో ఎన్కోఆర్1 అనే జన్యువును అణచేయడం ద్వారా.. వాటి శరీరాల్లో కండరాల పెరుగుదలను గణనీయంగా పెంచగలిగారు. అంతేకాదు.. కండరాలు దట్టంగా పెరగడమే కాకుండా వాటి కణాల్లో మైటోకాండ్రియాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయట. మైటోకాండ్రియాలంటే కణశక్తి భాండాగారాలు. వాటి సంఖ్య పెరగడం అంటే.. పరోక్షంగా.. మన శరీరం శక్తి పెరగడమే! ఈ జన్యుచికిత్సలు మనుషుల్లో ఇప్పుడప్పుడే అయ్యే పని కాకపోవ చ్చు. కానీ.. ఏదోరోజు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సైబోర్గ్.. మనిషి సహజం అవయవాలు కృత్రిమం చూడటానికి అందరు మనుషుల్లా మామూలుగానే ఉంటారు. కానీ ఎదలో కొట్టుకునే గుండె మాత్రం కృత్రిమం. చక్కగా వినగలుగుతారు. కానీ వారి చెవిలో ఉన్న కాక్లియా మాత్రం పరికరం. ఇంకా.. ఎముకలు, కండరాలు, మెదడుకు అమర్చే కంప్యూటర్ చిప్‌లు.. పైకి కనిపించని ఎన్నో ఇంప్లాంట్లు, పరికరాలు వారిలో ఉంటాయి. ఇలా.. లోలోపల అవయవాల స్థానంలో కత్రిమ పరికరాలతో జీవిస్తూ.. పైపైకి మామూలుగానే కనిపించే ‘సైబోర్గ్స్’ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వస్తున్నారు. మానవ రూపాంతరత సాధించే దిశగా సైబోర్గ్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కంప్యూటర్లోకి మెదడు ఎక్కిస్తే.. అమరత్వం! మనిషి చనిపోతాడు. కానీ.. అతడి జీవితం అక్కడితోనే ముగిసిపోదు. అతడి దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ.. మెదడు మాత్రం కంప్యూటర్లో భద్రంగా ఉంటుంది. కంప్యూటర్ తలకు.. రోబో శరీరం తోడవుతుంది. మరణించిన తర్వాత కూడా మనిషి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. జీవితం తిరిగి కొనసాగుతుంది. ‘మైండ్ అప్లోడింగ్’ టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. 2045 నాటికి కంప్యూటర్లోకి మెదడును ఎక్కించడం దాదాపుగా సాధ్యం అవుతుందని, ఆ తర్వాత మరో 90 ఏళ్లలో మనిషి శరీరాల స్థానంలో రోబో శరీరాలు రావడం ఖాయమని అంటున్నారు గూగుల్ కంపెనీ నిపుణులు. ఒకవేళ ఇదే గనక వాస్తవరూపం దాల్చితే మనిషి కొంత మేరకైనా అమరుడు అయినట్లే! - హన్మిరెడ్డి యెద్దుల -
మొక్కలు.. ఉపయోగాలు
జీవశాస్త్రం మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయి. ఉదాహరణ ఔషధాలు, కలప, అలంకరణ వస్తువులు, నూనె, వనస్పతి మొదలైనవి. వివిధ రూపాల్లో: ప్రతి రోజు మనం తీసుకునే ఆహారం వివిధ రూపాల్లో మొక్కల నుంచి లభిస్తుంది. వీటిలో వరి, గోధుమ, జొన్న, సజ్జ, బార్లీ, మొక్క జొన్న వంటివి ధాన్యాలు. కంది, పెసర, మినుములు, శెనగ, అలసందాలు, బీన్స్ మొదలైనవి పప్పు ధాన్యాలు (ఇవి పోయేసి, లెగ్యూమినేసి మొక్కల నుంచి లభిస్తున్నాయి). అంతేకాకుండా వీటిలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బియ్యం గింజలపై ఉండే అల్యురాన్ పొరలో ఆ1 విటమిన్ అధికంగా ఉంటుంది. ఆధునిక జెనెటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా రూపొందించిన గోల్డెన్ రైస్‌లో విటమిన్-అ పుష్కలంగా లభిస్తుంది. పప్పు ధాన్యాలలో శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దుంపలు, ఆకు కూరలు, కూరగాయలు, ఫలాలు వంటి ఆహార పదార్థాలు కూడా మొక్కల నుంచి లభిస్తున్నాయి. వీటిలో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. ఉదాహరణకు దుంపలలో కార్బోహైడ్రేట్స్, ఆకు కూరలలో కాల్షియం, ఐరన్, ఎండు ఫలాల్లో ఫై వంటి పోషకాలు లభ్యమవుతాయి. చెరకులో అతి తీపిదనాన్ని కలిగిన ఫ్రక్టోస్, మామిడి, బొప్పాయి వంటి ఫలాల్లో విటమిన్-అ ఉంటుంది. సిట్రస్, ఉసిరి, జామ వంటి వాటిలో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల ఫలాలు కూడా మొక్కల నుంచే లభిస్తున్నాయి. ప్రకృతిలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. వర్షాలు కురవడానికి మొక్కలు ఎంతగానో తోడ్పడతాయి. ఇళ్ల నిర్మాణానికి వాడే కలప, ఫర్నీచర్, అలంకరణ వస్తువుల తయారీలో టేకు, మహాగని, వేప, తుమ్మ, రోజ్‌వుడ్ వంటి మొక్కల భాగాలను ఉపయోగిస్తారు. సంగీత వాయిద్యాలను రూపొందించడానికి ఎర్ర చందనం మొక్కలను వినియోగిస్తారు.ల్లె, బంతి, చేమంతి, గులాబి, గన్నేరు, నైట్ క్వీన్, డేకింగ్, విష్ణుచక్రం, మందార వంటి పూల మొక్కలతోపాటు ఫెర్న్, క్రోటాన్ వంటి పుష్పించని మొక్కలు కూడా ఉంటున్నాయి. నైట్ క్వీన్ వంటి మొక్కలు మంచి సువాసనను వెదజల్లుతాయి. మనీ ప్లాంట్, క్రోటాన్ వంటి మొక్కలను నీడ ప్రాంతంలో పెంచుతారు. ఔషధాలుగా: ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఔషధ మొక్కల గురించి అధర్వణ వేదంలో కూడా ప్రస్తావించారు. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్న మొక్కలను పరిశీలిస్తే.. వేప నుంచి లభించే నింబిన్, నింబిడిన్ అనేవి చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయి. వేపను ‘హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా’ అంటారు. తులసి నుంచి కాంపర్ అనే ఔషధం లభిస్తుంది. ఇవి చెవి పోటు, శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. లావెండర్ నుంచి సుగంధ తైలాలు లభ్యమవుతాయి. డిజిటాలిస్ నుంచి లభించే డిజిటాలిన్ హృదయ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. అట్రోపా బెల్లడోనాలో ఉండే ఆట్రోపిన్ కంటి పరీక్షలలో తోడ్పడుతుంది. సింఖోనా మొక్క బేరడు నుంచి లభించే క్వినైన్ మలేరియా వ్యాధిని నయం చేస్తుంది. రక్కీసు లేదా నల్ల మందు మొక్క కాయలో ఉండే మార్ఫీన్ నొప్పిని తగ్గించి నిద్ర పోవడానికి తోడ్పడుతుంది. సర్పగంధి వేరులోని రిసర్పిన్ను జీర్ణ కోశ వ్యాధుల, పాము కాటేసిన సమయంలో చికిత్సకు ఉపయోగిస్తారు. దతూర పత్రాల నుంచి లభించే స్ట్రమోనియంను ఆస్తమా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద నుంచి తయారు చేసే ఔషధం పైల్స్‌ను నయం చేస్తుం ది. పెన్సీలియం క్రైపోజినం అనే శీలింధ్రం నుంచి పెన్సిలిన్ యాంటీ బయాటిక్‌ను తయారు చేస్తున్నారు. పసుపు ఒక యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. ఇది అల్సర్, జాండిస్, చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్‌ను గౌట్, రూమాటిసం వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఫేరులా వేళ్ల నుంచి లభించే ఇంగువ జీర్ణకోశ సంబంధ, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణలో తోడ్పడుతుంది. అశ్వగంధ వేర్లు దగ్గు, రూమాటిసం, అల్సర్ వంటి వ్యాధులను నయం చేస్తాయి. అల్లం, శొంటి అనేవి పన్ను నొప్పి, కంటి సంబంధ వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. స్మైలాక్స్ నుంచి లభించే సరసపరిల్లా చర్మ, నాడీ సంబంధ రుగ్మతలకు పని చేస్తుంది.దాల్చిన చెక్క డయేరియా, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. ఎపిడ్రా నుంచి లభించే ఎపిడ్రిన్ ఆల్కలాయిడ్ జలుబు, ఆస్తమా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. అట్రోపా నుంచి లభించే అట్రోపిన్ ప్లాస్టర్స్ తయారీకి తోడ్పడుతుంది. క్రోకస్ (కుంకుమ పువ్వు) కీలం, కీలాగ్రాలు, నాడీ, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తాయి. పారిశ్రామికంగా: పారిశ్రామికంగా కూడా మొక్కలు వివిధ రూపాల్లో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పేపర్ తయారీలో సైపరస్ పల్ప్ అనే మొక్కను వినియోగిస్తున్నారు. టేకు, మేఖేలియా వంటి వాటి నుంచి ఫ్లైవుడ్‌ను, పెన్సిల్ వంటి వాటిని జానిపెరస్ మొక్కల నుంచి తయారు చేస్తున్నారు. మల్బరి, డాల్బిర్జియా వంటి మొక్కల నుంచి హాకీ స్టిక్స్‌ను రూపొందిస్తున్నారు. బిలియర్డ్స్ క్యూస్ తయారీలో ఏసర్ వంటి మొక్కలు తోడ్పడుతున్నాయి. అదేవిధంగా సబ్బుల పరిశ్రమలో కానుగ, కాండిల్స్ తయారీలో మదుక (ఇప్ప), పాం ఆయిల్ కోసం ఇలేయిస్ వంటి మొక్కలను ఉపయోగిస్తున్నారు. రెసిన్స్ అనేది పైనఫ్ వంటి మొక్కల నుంచి తయారవుతుంది. దీన్ని వార్నిష్, పెయింటిగ్స్‌లో ఉపయోగిస్తారు. టానిన్స్ను ఔషధాల తయారీ, తోళ్ల శుద్ధిలో వినియోగిస్తారు. ఉదాహరణ తంగేడు, తుమ్మ, బాదాం. ఇంక్ (సిరా)ను క్వెర్కస్ టానిన్స్ నుంచి తయారు చేస్తారు. లేటెక్స్ వంటి పదార్థం నుంచి రబ్బర్ తయారు చేస్తారు. ఉదాహరణకు హేవియా, ఫైకస్. కొన్ని మొక్కల నుంచి నేరుగా రసాయనిక పదార్థాలు తయారవుతాయి. నిమ్మ నుంచి ఆస్కార్బిక్ ఆమ్లం, చింత పండు నుంచి టార్టారిక్ ఆమ్లం ఉత్పన్నమవుతుంది. వీటితోపాటు కొన్ని నీలి ఆకుపచ్చు శైవలాలు నత్రజని స్థాపన కు దోహదం చేయటంతోపాటు పంట దిగుబడిని అధికం చేస్తాయి. నాస్టాక్, అనబినా, రైజోబోబియం బాక్టీరియా ఈ చర్యలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్రిసాంథిమం (ైపైరిధ్రిన్) మొక్కలు, కొన్ని రకాల బ్యాక్టీరియాల నుంచి బయో ఫెస్టిసైడ్స్ తయారవుతున్నాయి. సాంకేతికత తోడుగా: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త రకం మొక్కలను సృష్టిస్తున్నారు. ఇవి మానవ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు బీటీ కాటన్, గోల్డెన్ రైస్ వంటి మొక్కలు. అంతేకాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్, కణజాల వర్థనం వంటి పద్ధతుల్లో కూడా నూతన మొక్కలను రూపొందిస్తున్నారు. జూట్, గోగునార, ఆలొవీరా, కొబ్బరి వంటి మొక్కల నుంచి నారలు లభిస్తాయి. పత్తి నుంచి లభించే కేశాలలో సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుంది. పొంగామియా (కానుగ), జట్రోపా వంటి మొక్కల నుంచి బయో డీజిల్‌ను తయారు చేస్తారు. కృత్రిమ పద్ధతుల ద్వారా కృత్రిమ పద్ధతుల ద్వారా అలంకరణ, ఉద్యానవన మొక్కలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం చేదనం, అంటుకట్టడం వంటి విధానాలను అనుసరిస్తున్నారు. చేదనాల ద్వారా మందార, గులాబి, స్వర్ణ గన్నేరు (టికోమా), డాలియా, జిరేనియం మొక్కలను రూపొందిస్తున్నారు. వేళ్ల చేదనాల ద్వారా క్యారెట్‌ను తయారు చేస్తున్నారు.అంటు కట్టే విధానంలో ఉపయోగించే మొక్కను ‘స్టాక్’ అని, దానిపై అంటు కట్టే కొమ్మను ‘సియాన్’ అంటారు. అంటుకట్టడంలో అప్రోచ్, క్లెప్ట్, టంగ్, బడ్ అనే పద్ధతులు ముఖ్యమైనవి.అంటు బొక్కుట లేదా అంటు కట్టు విధానం ద్వారా దానిమ్మ, జామ, నారింజ వంటి మొక్కలను రూపొందిస్తున్నారు. దీన్నే గూటి పద్ధతి అని కూడా అంటారు. నేల అంటు తొక్కుట పద్ధతిలో గులాబి, ద్రాక్ష, ఐపోమియా వంటి మొక్కలను వృద్ధి చేస్తున్నారు.