ల్యాబ్‌ లీకేజ్‌ నిజమేనా? | Mystery Thickens Over COVID-19 Origin | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ లీకేజ్‌ నిజమేనా?

Published Sat, Jun 26 2021 4:00 AM | Last Updated on Sat, Jun 26 2021 4:00 AM

Mystery Thickens Over COVID-19 Origin - Sakshi

కరోనా కాటు మనిషికే ఎక్కువ చేటు కలిగించేలా కోవిడ్‌ వైరస్‌ జన్యు నిర్మాణం ఉందా? గబ్బిలాల నుంచి మనిషి కరోనా సోకిందనే వాదనలో బలం లేదా? చైనా ల్యాబరేటరీ నుంచి వైరస్‌ లీకవడం నిజమేనా? వీటన్నింటికీ సమాధానమిచ్చే నూతన పరిశోధన ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంతకీ కొత్త పరిశోధన ఏం చెబుతోంది? చూద్దాం..

సృష్టిలో ఇన్ని జీవరాసులున్నా మనిషిపైనే కరోనాకు మక్కువ ఎక్కువని మరోమారు తేలింది. కరోనాను కలిగించే సార్స్‌ సీఓవీ2(కోవిడ్‌–19) వైరస్‌ ఇతర జీవుల కన్నా మానవులకే అధికంగా సోకే సామర్థ్యం చూపిందని నూతన అధ్యయనం వెల్లడిస్తోంది. దీంతో ఈ వైరస్‌ పుట్టుకపై మరోమారు సంశయాలు పెరిగాయి. ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి లీకైందన్న అనుమానాలకు బలం చేకూరింది.  ఆస్ట్రేలియాకు చెందిన లాట్రోబె యూనివర్సిటీ, ఫ్లిండర్‌  వర్సిటీల పరిశోధకులు కరోనా వివిధ జీవుల్లో కలిగించే ఇన్ఫెక్షన్‌ సామర్థ్యంపై ప్రయోగాలు చేశారు.

కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా కరోనా ఆవిర్భావరోజుల్లో వ్యా పించిన వైరస్‌ను అధ్యయనం చేశారు. ఈ వైరస్‌ మనిషితో పాటు మరో 12 రకాల జంతువుల్లో ఇన్ఫెక్షన్‌ కలిగించిన సామర్థ్యాన్ని పరిశీలించారు. గబ్బిలాల నుంచి మనిషికి ఈ వైరస్‌ సోకే క్రమంలో మరో అతిధేయి(వెక్టర్‌) ఉందా? లేక ఏదైనా ల్యాబ్‌ నుంచి లీకైందా అని పరిశీలించడమే అధ్యయన ఉద్దేశం. ఈ  వివరాలు జర్నల్‌ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించారు.  

ఇలా చేశారు..
రీసెర్చ్‌లో భాగంగా ఎంపిక చేసిన జంతువుల జీనోమ్‌ డేటానుంచి ప్రతి జీవికి సంబంధించిన కీలక ఏసీఈ2 ప్రొటీన్‌(జీవుల్లో ఈ ప్రోటీన్‌ కోవిడ్‌ వైరస్‌కు రిసెప్టార్‌గా పనిచేస్తుంది) కంప్యూటర్‌ మోడల్‌ను చాలా కష్టపడి సృష్టించారు. అనంతరం ఈ కంప్యూటర్‌ మోడల్స్‌తో కోవిడ్‌ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ ఎంత బలంగా బంధం ఏర్పరుచుకుంటుందనే విషయాన్ని గమనించారు. ఆశ్చర్యకరంగా గబ్బిలాలు, పంగోలిన్లలాంటి ఇతర జీవుల ఏసీఈ2 కన్నా మానవ ఏసీఈ2 ప్రొటీన్‌తో కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ అత్యంత బలంగా బంధం ఏర్పరుచుకుందని వెల్లడైంది.

పరీక్షకోసం ఎంచుకున్న ఇతర జీవుల్లో ఏదైనా కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమై ఉంటే పరిశోధనలో సదరు జీవి కణజాలంలో కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ బలమైన బంధం ఏర్పరిచి ఉండేదని సైంటిస్టులు చెప్పారు. ‘‘మానవ కణజాలంతో కోవిడ్‌ వైరస్‌ బలమైన బంధం చూపింది. ఇతర జీవుల నుంచి ప్రాథమికంగా వైరస్‌ మనిషికి సోకి ఉంటే తప్పక సదరు జీవుల కణజాలంలో కోవిడ్‌ ప్రోటీన్‌ మరింత బలమైన బంధం చూపిఉండేది. మనిషి ప్రోటీన్‌తో పోలిస్తే గబ్బిలం ప్రొటీన్‌తో కోవిడ్‌ ఏర్పరచిన బంధం చాలా బలహీనంగా ఉంది’’ అని ప్రొఫెసర్‌ డేవిడ్‌ వింక్లర్‌ చెప్పారు. గబ్బిలాల నుంచి మనిషికి ఈ వైరస్‌ సోకిందనే వాదనకు తాజా పరిశోధన భిన్నంగా ఉందన్నారు.

‘‘ఒకవేళ నిజంగానే ఈ వైరస్‌ ప్రకృతి సహజంగా వచ్చి ఉంటే మనిషి సోకే ముందు ఒక ఇంటర్‌మీడియెరీ వెక్టర్‌(మధ్యస్థ అతిధేయి) ఉండి ఉండాలి. అదేంటనేది తేలలేదు.’’ అని ప్రొఫెసర్‌ నికోలాయ్‌ పెట్రోవ్‌స్కీ అభిప్రాయపడ్డారు.  అంతిమంగా కరోనా మనిషికి ఎలా సోకిందనే విషయమై రెండు వివరణలున్నాయని రీసెర్చ్‌లో పాల్గొన్న సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. గబ్బిలాల నుంచి మరో ఇంటర్‌మీడియెరీ వెక్టర్‌(ఇంకా కనుగొనలేదు) ద్వారా మనిషికి సోకడం లేదా వైరాలజీ ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తు వైరస్‌ లీకై ఉండవచ్చనేవి ఈ రెండు ఆప్షన్లని వింక్లర్‌ తెలిపారు. లోతైన పరిశోధనలు జరిపితే మానవాళిపై కరోనా దాడికి అసలైన కారణాలు బహిర్గతమవుతాయన్నారు. పెంపుడు జంతువులు కుక్క, పిల్లి, ఆవుకు సైతం కరోనా సోకే అవకాశాలున్నాయన్నారు.  

పంగోలిన్స్‌తో సంబంధం?
పరిశోధనలో తేలిన ఇంకో ఆశ్చర్యకరమైన అంశమేంటంటే కరోనా ప్రొటీన్‌ మనిషి కణజాలం తర్వాత అంత బలంగా పంగోలిన్స్‌(యాంట్‌ ఈటర్‌) కణజాలంతో బలమైన బంధం ఏర్పరిచింది. ఈ పంగోలిన్స్‌ చాలా అరుదైన జీవులు. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. గబ్బిలాలు, పాములు, కోతుల కన్నా పంగోలిన్‌ కణజాలంతో కరోనా ప్రొటీన్‌ బంధం చాలా ధృఢంగా ఉందని వింక్లర్‌ చెప్పారు. కరోనా కొత్తలో కొందరు సైంటిస్టులు పంగోలిన్స్‌లో కరోనా వైరస్‌ను కనుగొన్నట్లు చెప్పారని, కానీ ఇది సమాచార లభ్యతాలోపం వల్ల జరిగిందని తెలిపారు. మనిషిలో కరోనా కలిగించే వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్, పంగోలిన్స్‌లో కరోనా కలిగించే స్పైక్‌ ప్రొటీన్‌ దాదాపు ఒకేలా ఉంటాయన్నారు. అందువల్ల ప్రస్తుత పరిశోధనలో సైతం మనిషి తర్వాత పంగోలిన్‌ కణజాలంతో కరోనా ప్రొటీన్‌ బలమైన బంధం ఏర్పరిచిందని వివరించారు. పంగోలిన్‌ విషయం మినహాయించి ఇతర జీవులన్నింటి కన్నా మనిషి కణాలపైనే కరోనా ఎక్కువ ఇన్ఫెక్షన్‌ కలిగిస్తున్నది తమ రిసెర్చ్‌లో తేలిన విషయమని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement