ఏడాది దాటినా లక్షణాలు | One year outcomes in hospital survivors with COVID-19 | Sakshi
Sakshi News home page

ఏడాది దాటినా లక్షణాలు

Published Sat, Aug 28 2021 6:08 AM | Last Updated on Sat, Aug 28 2021 6:08 AM

One year outcomes in hospital survivors with COVID-19 - Sakshi

బీజింగ్‌: కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన వారిలో.. వ్యాధి తగ్గిన ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింంది. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఈ అధ్యయనం శుక్రవారం ది లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా సోకినప్పటి నుంచి 12 నెలల పాటు 1,276 మందిపై ఈ అధ్యయనం చేసినట్లు వుహాన్‌లోని చైనా–జపాన్‌ ప్రెండ్షిప్‌ హాస్పిటల్‌ ప్రొఫెసర్‌ బిన్‌ కావ్‌ తెలిపారు. అధ్యయనంలో ఉన్న చాలా మంది కరోనా నుంచి బాగానే కోలుకున్నప్పటికీ, వ్యాధి ముదిరి ఐసీయూ వరకు వెళ్లిన రోగులకు మాత్రం ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 2020 జనవరి 7 నుంచి మే 29 మధ్య డిశ్చార్జ్‌ అయిన వారిపై ఈ ప్రయోగం జరిగిందని పేర్కొన్నారు.

ఆరోగ్యంగా లేరు..
కరోనా సోకిన వారిని, సోకని వారిని పోల్చి చూస్తే వ్యాధి సోకిన వారు ఏడాది తర్వాత కూడా వ్యాధి సోకని వారిలా ఆరోగ్యంగా లేరని లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది. కరోనా నుంచి కోలుకోవడానికి కొందరికి ఏడాదికి పైగా పడుతుందని ఈ అధ్యయనంద్వారా వెల్లడైనందున, కోవిడ్‌ అనంతరం ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అధ్యయనంలో పాల్గొన్న రోగులకు సంబంధించిన ఆరోగ్య వివరాలను ఆరు నెలల తర్వాత మొదటి సారి, పన్నెండు నెలల తర్వాత రెండో సారి సేకరించినట్లు వెల్లడించింది.

లక్షణాలేవంటే..
కరోనా సోకి నయమైన వారిలో చాలా మందికి ఏ లక్షణాలు లేకుండా పోగా, సగం మందిలో మాత్రం పలు లక్షణాలు అధ్యయనకర్తలు గుర్తించినట్లు లాన్సెట్‌ వెల్లడించింది. నీరసంగా ఉండటం, కండరాల బలహీనతలు అత్యంత ఎక్కువగా కనిపించినట్లు లక్షణాలని తెలిపింది. ఆరు నెలల తర్వాత సగం మందిలో ఈ లక్షణాలు కనిపించగా, ఏడాది తర్వాత ఇవి ప్రతి అయిదు మందిలో ఒకరికి పరిమితమయ్యాయని పేర్కొంది. పన్నెండు నెలల తర్వాత కూడా ప్రతి ముగ్గురిలో ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. లక్షణాలు కనిపించిన వారిలో.. కరోనా సోకిన సమయంలో ఐసీయూ వరకు వెళ్లి ఆక్సిజన్‌ ట్రీట్మెంట్‌ పొందిన వారు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది.

పరీక్షలివే..
349 మందికి లంగ్‌ ఫంక్షన్‌ టెస్టు (ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష) నిర్వహించామని, వారిలో 244 మందికి 12 నెలల తర్వాత కూడా అదే పరీక్షను తిరిగి నిర్వహించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆరు నెలల సమయంలో నిర్వహించిన పరీక్షలో వచ్చిన ఫలితాలే సంవత్సరం తర్వాత కూడా వచ్చాయని, ఏ మాత్రం మెరుగు పడలేదని తాము గుర్తించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మరో 353 మందికి ఆరు నెలల తర్వాత సీటీ స్కాన్‌ చేయగా, వారిలో సగం మంది ఊపిరితిత్తులు అసహజ పనితీరును చూపినట్లు తెలిపారు. అనంతరం 12 నెలల తర్వాత 118 మందికి సీటీ స్కాన్‌ నిర్వహించగా, అసహజ పనితీరు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు.

మహిళల్లోనే ఎక్కువ..
పురుషులతో పోలిస్తే మహిళల్లో నీరసం, కండరాల బలహీనత 1.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని లాన్సెట్‌ జర్నల్‌ తెలిపింది. ఆందోళన, కుంగుబాటు వంటివి కూడా పురుషులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా మహిళల్లో నమోదైందని చెప్పింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ పురుషులతో పోలిస్తే మహిళల్లో 12 నెలల తర్వాత కూడా ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది. స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారిలో కూడా 1.5 రెట్లు ఎక్కువ లక్షణాలు కనిపించినట్లు తెలిపింది. అయితే ఈ పరిశోధన మొత్తం ఒకే ఆస్పత్రిలో చేరిన వారిపై జరిగిందని, అందువల్ల అన్ని ప్రాంతాలకు దీన్ని వర్తింపజేయలేమని పరిశోధనలో పాల్గొన్న జియోయింగ్‌ గున్‌ అభిప్రాయపడ్డారు.  

అధ్యయనం సాగిందిలా..
అధ్యయనంలో భాగంగా ఆస్పత్రికి చెందిన నిపుణులు కరోనా నుంచి కోలుకున్న వారితో రెండు సార్లు ముఖాముఖి సమావేశాలను నిర్వహించారు. భౌతిక పరీక్షలు, ల్యాబ్‌ పరీక్షలు, ఆరు నిమిషాల నడక పరీక్ష వంటి పలు టెస్టులను జరిపారు. కరోనా తగ్గిన 185, 349వ రోజున ఈ ముఖాముఖిలను, పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సగటు వయసు 57 ఏళ్లుగా ఉందని స్పష్టం చేశారు. కరోనా తగ్గిన తర్వాత ఆరు నెలలకు 68 శాతం మందిలో కరోనా లక్షణాలు కొనసాగాయని, ఏడాది తర్వాత అది 49 శాతానికి తగ్గిందన్నారు. అంటే ఏడాది తర్వాత కూడా సగం మందికి కరోనా లక్షణాలు కొనసాగినట్లు తేలిందని పరిశోధనలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement