కరోనా పుట్టుక: వూహాన్‌కు ముందు యునాన్‌లో | Coronavirus Origin: Scientists Believe Virus First Emerged In Yunnan | Sakshi
Sakshi News home page

వైరస్‌ వ్యాప్తికి 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమమే కారణం

Published Wed, Mar 24 2021 2:41 PM | Last Updated on Wed, Mar 24 2021 2:44 PM

Coronavirus Origin: Scientists Believe Virus First Emerged In Yunnan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మానవజాతికి సార్స్‌ కోవ్‌–2 వైరస్‌ పరిచయమై పదహారు నెలలవుతోంది. వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్‌ను రికార్డు సమయంలో అభివృద్ధి చేసినప్పటికీ అమెరికాతో పాటు భారత్‌ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. గత ఏడాది మొదట్లో ఈ వైరస్‌ గురించి తెలిసిన తర్వాత అందరిలోనూ తలెత్తిన ప్రశ్న.. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నదే. చైనాలో గబ్బిలాలు మొదలుకొని అన్ని రకాల జంతువులను ఆహారంగా తీసుకుంటారు కాబట్టి వాటి మాంసం నుంచి మనుషులకు సోకి ఉంటుందని కొందరు, ప్రపంచంపై అధిపత్యం చెలాయించే లక్ష్యంతో చైనా స్వయంగా దీన్ని అభివృద్ధి చేసిందని మరికొందరు ఆరోపణలు గుప్పించారు.

వూహాన్‌లోని జంతు మార్కెట్ల నుంచే సోకి ఉండవచ్చునని చైనా అప్పట్లోనే చెప్పింది. అయితే అగ్రరాజ్యం అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అది చైనా వైరస్సే అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు గత ఏడాది జనవరిలో శాస్త్రవేత్తల బృందాన్ని చైనాకు పంపింది. దాదాపు నెలరోజులపాటు పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు చివరకు.. ఈ వైరస్‌ దక్షిణ చైనాలోని యునాన్‌ ప్రాంతం నుంచి వూహాన్‌లోని జంతు మార్కెట్లకు చేరి, అక్కడి నుంచి మనుషులకు సోకి ఉంటుందని నిర్ధారించింది. ఈ మేరకు త్వరలో నివేదిక విడుదల చేయనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో సభ్యుడైన పీటర్‌ డస్జాక్‌ అమెరికా రేడియో కంపెనీ ఎన్‌పీఆర్‌కు చెప్పినదాని ప్రకారం.. కోవిడ్‌–19 కారక వైరస్‌ గబ్బిలాల నుంచి అడవి జంతువులకు.. వాటి నుంచి మనుషులకూ సోకింది.

జంతు పోషణ కేంద్రాల్లో మొదలై..
గ్రామీణ ప్రాంతాల్లోని బడుగులకు ఉపాధి కల్పించి తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు చైనా దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఓ కార్యక్రమం కోవిడ్‌–19 కారక వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పునుగు పిల్లులు, పొర్కుపైన్స్‌ (ముళ్లపందిని పోలిన జంతువు), పంగోలిన్, అడవి కుక్కలు, ఎలుకల వంటి రకరకాల అడవి జంతువులను అటవీ ప్రాంతాల్లోని చైనీయులు పెంచి పోషిస్తూంటారని, వూహాన్‌ హోల్‌సేల్‌ జంతుమార్కెట్‌లో వీటి విక్రయాలు జరుగుతూంటాయని పీటర్‌ చెబుతున్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ఈ జంతువుల ఫామ్‌లను మూసేసిన సంగతి తెలిసిందే. పెంచుతున్న జంతువులను ఎలా చంపేయాలి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకుని వాటిని పూడ్చిపెట్టాలన్న మార్గదర్శకాలను కూడా చైనా అప్పట్లో జారీ చేసిందని పీటర్‌ వివరించారు. యునాన్‌ ప్రాంతంలోని అడవి జంతువుల్లో కోవిడ్‌ కారక కరోనా వైరస్‌ ఉండి ఉంటుందని, ఆ ప్రాంతంలోనే గబ్బిలాల్లో కోవిడ్‌ కారక వైరస్‌తో 96% పోలికలు ఉన్న ఇంకో వైరస్‌నూ చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని పీటర్‌ గుర్తు చేశారు.

అయితే చైనాలోనే ఇది మనుషులకు సోకి ఉంటుందని తాను అనుకోవడం లేదని.. కాకపోతే అలా కనిపిస్తోందని పీటర్‌ అభిప్రాయపడ్డారు. వూహాన్‌లో కోవిడ్‌–19 కేసులు బయటపడేందుకు కొంతకాలం ముందు నుంచే ఈ వైరస్‌ చైనా మొత్తమ్మీద వ్యాప్తి చెంది ఉండవచ్చునని పీటర్‌ చెబుతున్నారు. వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నుంచి అనుకోకుండా ఈ వైరస్‌ లీక్‌ అయ్యిందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలోనే స్పష్టం చేయడం గమనార్హం.

చదవండి: చైనాలో కరోనా మూలాలు అక్కడి నుంచే..!

మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement