hanmireddi yeddula
-
మనిషి... మారిపోతున్నాడు!
ఒంటిచేత్తో.. వంద కిలోల బరువు ఎత్తగలరా..? ఆగకుండా.. అలసిపోకుండా 20 కిలోమీటర్లు పరుగెత్తగలరా..? నిండు ఆరోగ్యంతో.. 150 ఏళ్లు బతకగలరా..? మరణం తర్వాతా.. జీవితాన్ని కొనసాగించగలరా..? అమ్మో... ఇవన్నీ శక్తికి మించిన పనులే కదూ! ఊహూ... కానేకాదేమో! టెక్నాలజీ సాయంతో ఈ రోజు కాకపోతే రేపైనా మనిషి... శక్తికి మించిన పనులూ.. చకచకా చేసేయొచ్చు! కుదిరితే అమరత్వమూ పొందొచ్చు!! కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి చేసే ప్రతి పనినీ సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే మనిషి పనులను మాత్రమే కాదు.. ఏకంగా మనిషినే టెక్నాలజీలు నిలువెల్లా మార్చేస్తాయని అంటున్నారు శాస్త్రవేత్తలు! పరిమితమైన మనిషి శక్తి సామర్థ్యాలను అపరిమితంగా మార్చివేయడమే కాదు.. మనిషిని అమరుడిని చేసేలా.. శరీరంలో సైతం భాగం అయిపోతాయని చెబుతున్నారు. మొత్తం మీద మనిషి.. తన పరిణామ చరిత్రను తాను సృష్టించుకుంటున్న టెక్నాలజీలతోనే మలుపు తిప్పుకుంటాడని.. నిలువెల్లా రూపాంతరం చెంది.. ‘నరయంత్రుడు’ అయిపోతాడనీ అంటున్నారు. ‘ట్రాన్స్‌హ్యూమనిజం (మానవ రూపాంతరత)’ భావన వీటన్నింటినీ సాధ్యం చేస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఏమిటీ ట్రాన్స్‌హ్యూమనిజం..? పరిమితంగా ఉన్న శక్తి, సామర్థ్యాలను పెంచుకోవాలన్న మనిషి తపన ఈనాటిది కాదు. జైలు జీవితం నుంచి తప్పించుకుని పక్షిలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ దూరతీరాలకు వెళ్లిపోవాలని ఆశపడిన ఇకారస్, డియోడలస్లు పక్షి ఈకలతో రెక్కలు కట్టుకొని ఎగిరేందుకు ప్రయత్నించిన గాథ గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. ఇక హిందూ పురాణాల్లోనైతే.. సాధారణ మనిషికి సైతం అపరిమిత శక్తులు అబ్బినట్లు చెప్పే గాథలు ఎన్నో ఉన్నాయి. అయితే... ఆధునికయుగంలో సాంకేతికతల ద్వారా మనిషి శక్తి, సామర్థ్యాలను అనూహ్యంగా పెంచుకోవడానికి 1960ల నుంచి మొదలైన ఉద్యమాన్నే ‘ట్రాన్స్‌హ్యూమనిజం’గా చెప్పుకోవచ్చు. ఇలా టెక్నాలజీల సాయంతో అపరిమిత శక్తులు పొందే మనిషిని ‘ట్రాన్స్‌హ్యూమన్ (రూపాంతర మానవుడు)’గా పిలుస్తున్నారు. ఇప్పటిదాకా సైన్స్ కాల్పనిక సాహిత్యంలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమైన ఇలాంటి రూపాంతర మనుషులు మనిషి, యంత్రాలు కలగలిసిపోయినట్లుగా ఉంటారు కాబట్టి.. వారిని మనం ‘నరయంత్రులు’గానూ పిలుచుకోవచ్చు! ఇందుకోసం ఉపయోగపడే సాంకేతికతలన్నింటికీ కలిపి ‘మానవ శక్తులను పెంచే సాంకేతికతలు (హ్యూమన్ ఎన్‌హ్యాన్సింగ్ టెక్నాలజీస్)’ అనే పేరునూ ట్రాన్స్‌హ్యూమనిజం కోసం ప్రయత్నిస్తున్నవారు ఉపయోగిస్తున్నారు. బాహ్య అస్థిపంజరంతో కొండంత బలం..! వీపుపై 90 కిలోల బరువు వేసుకుని.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలరా..? అమెరికా పరిశోధకులు రూపొందిస్తున్న బాహ్య అస్థిపంజరం (ఎక్సో స్కెలిటన్)ను ధరిస్తే.. మీరు వంద కిలోల బరువునూ అవలీలగా మోయగలరు. మనిషిపై దాదాపుగా బరువే పడకుండా చూసే ఈ ‘హ్యూమన్ యూనివర్సల్ లోడ్ క్యారియర్-హెచ్యూఎల్సీ’ని లాఖీడ్ మార్టిన్స్ కంపెనీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంజనీర్లు సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని గనక సైనికులకు అందుబాటులోకి తెస్తే.. ఇక యుద్ధరంగం రూపురేఖలే మారిపోతాయని నిపుణులు అంటున్నారు. మామూలు పౌరులకు సైతం ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కళ్లజోడు కంప్యూటర్‌తో చిటికెలో పనులు! ఇంతకుముందు మాదిరిగా మన మానసిక శక్తి ఇంతే.. అని ఇకపై సరిపెట్టుకోనవసరం లేదు. మన శక్తుల పరిమితులను దాటి అనేక విషయాలను సాధ్యం చేసిపెట్టే టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. ఉదాహరణకు.. కళ్లజోడు కంప్యూటర్‌గా పేరుపొందిన గూగుల్ గ్లాస్‌నే తీసుకుంటే.. దీన్ని పెట్టుకుని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి భాష తెలియకున్నా.. మనం చకచకా మాట్లాడేయొచ్చు! మనం మన భాషలో మాట్లాడితే చాలు.. ఇది వారి భాషలో చెప్పి.. వారి మాటలను తిరిగి మన భాషలో మనకు చెబుతుంది. అలాగే మన పరిసరాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమూ లేకుండా దీనికి పురమాయిస్తే.. ముఖ్యమైన సమాచారాన్ని ఇది భద్రం చేసి.. అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఇది చాలా పనులను చేసిపెట్టనుంది. జన్యుచికిత్సతో దీర్ఘాయుష్షు! మానవ రూపాంతరతను సాధ్యం చేసే టెక్నాలజీల్లో హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. మన దేహంలో జరిగే అన్ని పనుల వెనకా.. జన్యువులు కీలక పాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే. ఆ జన్యువులను నియంత్రించడం ద్వారా అవసరమైన ఫలితాలు రాబట్టుకునే పద్ధతినే మానవ జన్యు ఇంజనీరింగ్‌గా చెప్పుకోవచ్చు. దీనిద్వారా జీవశాస్త్రపరంగా ఉన్న ఎన్నో పరిమితులను మనిషి అధిగమించవచ్చు. ఔషధాల ద్వారా లేదా ఇతర పద్ధతుల ద్వారా జన్యువులను నియంత్రిస్తూ.. లేదా కత్తిరిస్తూ.. లేదా జతచేస్తూ.. మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించి దీర్ఘాయుష్షును ప్రసాదించొచ్చు. ఉదాహరణకు.. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఇటీవలే జంతువుల్లో ఎన్కోఆర్1 అనే జన్యువును అణచేయడం ద్వారా.. వాటి శరీరాల్లో కండరాల పెరుగుదలను గణనీయంగా పెంచగలిగారు. అంతేకాదు.. కండరాలు దట్టంగా పెరగడమే కాకుండా వాటి కణాల్లో మైటోకాండ్రియాలు కూడా పెద్ద సంఖ్యలో పెరిగాయట. మైటోకాండ్రియాలంటే కణశక్తి భాండాగారాలు. వాటి సంఖ్య పెరగడం అంటే.. పరోక్షంగా.. మన శరీరం శక్తి పెరగడమే! ఈ జన్యుచికిత్సలు మనుషుల్లో ఇప్పుడప్పుడే అయ్యే పని కాకపోవ చ్చు. కానీ.. ఏదోరోజు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సైబోర్గ్.. మనిషి సహజం అవయవాలు కృత్రిమం చూడటానికి అందరు మనుషుల్లా మామూలుగానే ఉంటారు. కానీ ఎదలో కొట్టుకునే గుండె మాత్రం కృత్రిమం. చక్కగా వినగలుగుతారు. కానీ వారి చెవిలో ఉన్న కాక్లియా మాత్రం పరికరం. ఇంకా.. ఎముకలు, కండరాలు, మెదడుకు అమర్చే కంప్యూటర్ చిప్‌లు.. పైకి కనిపించని ఎన్నో ఇంప్లాంట్లు, పరికరాలు వారిలో ఉంటాయి. ఇలా.. లోలోపల అవయవాల స్థానంలో కత్రిమ పరికరాలతో జీవిస్తూ.. పైపైకి మామూలుగానే కనిపించే ‘సైబోర్గ్స్’ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వస్తున్నారు. మానవ రూపాంతరత సాధించే దిశగా సైబోర్గ్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కంప్యూటర్లోకి మెదడు ఎక్కిస్తే.. అమరత్వం! మనిషి చనిపోతాడు. కానీ.. అతడి జీవితం అక్కడితోనే ముగిసిపోదు. అతడి దేహం మట్టిలో కలిసిపోతుంది. కానీ.. మెదడు మాత్రం కంప్యూటర్లో భద్రంగా ఉంటుంది. కంప్యూటర్ తలకు.. రోబో శరీరం తోడవుతుంది. మరణించిన తర్వాత కూడా మనిషి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి. జీవితం తిరిగి కొనసాగుతుంది. ‘మైండ్ అప్లోడింగ్’ టెక్నాలజీతో ఇది సాధ్యం అవుతుందని అంటున్నారు. 2045 నాటికి కంప్యూటర్లోకి మెదడును ఎక్కించడం దాదాపుగా సాధ్యం అవుతుందని, ఆ తర్వాత మరో 90 ఏళ్లలో మనిషి శరీరాల స్థానంలో రోబో శరీరాలు రావడం ఖాయమని అంటున్నారు గూగుల్ కంపెనీ నిపుణులు. ఒకవేళ ఇదే గనక వాస్తవరూపం దాల్చితే మనిషి కొంత మేరకైనా అమరుడు అయినట్లే! - హన్మిరెడ్డి యెద్దుల -
కొత్త తీర్మానాలకు టెక్ సాయం!
ఒక ఏడాది గడిచిపోయింది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేశాం. ఎప్పట్లాగే మళ్లీ తీర్మానాలూ చేసేసుకున్నాం. కానీ క్రితంసారి మాదిరిగా మధ్యలోనే వదిలే స్తామేమోననిచిన్న సందేహం. వీటన్నింటికీ స్మార్ట్‌ఫోన్ సాయం తీసుకుంటే..? కొత్త నిర్ణయాలను మరింత ఉత్సాహంగా అమలు చేసేయొచ్చు. పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించొచ్చు... ఈసారయినా... తప్పకుండా బరువు తగ్గాలి. ఇంగ్లిష్‌పై పట్టు పెంచుకోవాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. రోజువారీ పనులను సక్రమంగా నిర్వర్తించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బాగా చదివి ఉద్యోగం సంపాదించాలి. ఇలా ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు తీర్మానించేసుకుని ఉంటారు. అయితే ఇలాంటి లక్ష్యాల సాధనకు మొబైల్ ఆప్స్‌ను ఉపయోగిస్తే.. పని మరింత సులభం. మరెందుకాలస్యం? వీటిని ప్రయత్నించండి... ఉన్నత విద్యా కోర్సులు చేసేందుకు, విజ్ఞాన సముపార్జనకు జీఖీఠ్ఛట ్ఖ వంటి ఆప్స్తోనూ కొత్త తీర్మానాలను అమలు చేసేందుకు ప్రయత్నించవచ్చు. రోజువారీ పనుల నిర్వహణకు, అత్యవసరమైన నోట్లు, పేపర్‌వర్క్, మీడియా ఫైళ్లు భద్రం చేసుకోవడానికి Evernote బరువు తగ్గేందుకు MyFitnessPal బరువు తగ్గాలంటే.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించాల్సిందే. కానీ ఒకేసారి పెద్ద ఎత్తున ప్రయత్నించేసి కేలరీలను ఖర్చు చేసేస్తామంటే కుదరదు. కేలరీలను ఖర్చు చేయడం క్రమంగా జరిగితేనే సానుకూల ఫలితం. తేలికపాటి పనులు చేసేవారికి రోజుకు 2,500 కేలరీల శక్తి అవసరం. అందుకే ఎవరి అవసరం మేరకు వారు ఆహారంలో రోజుకు ఎన్ని కేలరీలు తగ్గిస్తే మంచిదో నిపుణుల సూచనల మేరకు నిర్ణయించుకోవాలి. అయితే ఏది తింటే ఎన్ని కేలరీలు అందుతాయో లెక్కలేసుకోవడం మాత్రం పెద్ద తలనొప్పి అయిపోతుంది కదా. ఆ పని సులభం చేసేందుకే ఈ ‘మైఫిట్నెస్పాల్’ ఆప్. ఏ ఆహారం.. ఎంత తీసుకుంటే.. ఎన్ని కేలరీలు అందుతాయి.. అన్నది ఈ ఆప్ వెంటనే లెక్క గట్టేసి చెబుతుంది. లక్షలాది ఆహార పదార్థాల కేలరీల లెక్కలు ఈ ఆప్‌లో ఉండటం విశేషం. ఎప్పుడు ఏ ఆహారం ఎంత తీసుకోవాలో రిమైండర్స్ కూడా పంపుతుంది. ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ ఫోన్లలో పనిచేస్తుంది. పూర్తిగా ఉచితం. దీనికోసం http://www.myfitnesspal.ఛిౌఝలోకి లాగిన్ అవ్వండి. ఆంగ్లం నేర్చుకునేందుకు Duolingo: ఇంగ్లిష్‌తోపాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ వంటి భాషలను నేర్చుకునేందుకు ఉపయోగపడే ఆప్ ఇది. మరో 50 భాషలూ ఈ ఆప్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ ఐఫోన్ ఆప్ అయిన దీనిని ఆపిల్ కంపెనీ ‘ఆప్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. ఆటలు, క్విజ్‌ల ద్వారా భాషలు నేర్పడం, వివిధ స్థాయిల్లో కోర్సులు ఉండటం ఈ ఆప్ ప్రత్యేకత. ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐట్యూన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాయామంలో హుషారుకు Runtastic జీపీఎస్ ట్రాకింగ్‌తో పనిచేసే ఈ ఆప్ మీరు నడుస్తుంటే అడుగులు లెక్కిస్తుంది. పరుగెత్తుతుంటే కి లోమీటర్లు లెక్కిస్తుంది. మిమ్మల్ని మీరు అథ్లెట్ మాదిరిగా ఊహించుకుంటే.. ప్రేక్షకుల అరుపులతో ప్రోత్సహిస్తుంది కూడా. హార్ట్‌రేట్ మానిటరింగ్, వాయిస్ కోచ్, ఇంకా రకరకాల ఫీచర్లు ఉన్న ఈ ఆప్‌తో నడక, పరుగు మాత్రమే కాదు.. సైక్లింగ్ ఇతర వ్యాయామాలూ హుషారుగా చేసేయొచ్చు. క్రీడాకారులకే కాదు, మామూలుగా వ్యాయామం చేసేవారికీ బాగా ఉపయోగపడుతుంది. అన్ని ఆపిల్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ ఫోన్లలో పనిచేస్తుంది. చాలావరకూ అనేక ఫీచర్లు ఉన్న వెర్షన్లు ఉచితం. కొన్ని ప్రధాన ఫీచర్లున్న వెర్షన్లు కావాలంటే మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కావాలంటే https://www.runtastic.com/లో ప్రయత్నించొచ్చు. ఖర్చులపై అదుపు కోసం Mint: ప్రతినెలా ఆదాయం బాగానే వస్తున్నా.. నెల చివరికొచ్చేసరికి డబ్బంతా ఏమవుతుందో అర్థం కాదు. ఇంటి అద్దె, గ్యాస్, షాపింగ్, పెట్రోల్‌తోపాటు వేటికి ఎంత ఖర్చయిందో పట్టికల రూపంలో చూపించే ఆప్ Mint. బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల నిర్వహణకు బెస్ట్ ఉచిత ఆప్ ఇది. ముందుగా లక్ష్యాలను సెట్ చేసుకుంటే ఆ మేరకు రిమైండర్స్, ప్రోత్సాహం, ఉచితసలహాలు కూడా ఇస్తుంది. ఆపిల్, ఆండ్రాయిడ్, అమెజాన్, విండోస్ఫోన్లపై పనిచేస్తుంది. కావాలంటే https://www.mint.com/లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజువారీ ఖర్చులను సులభంగా పర్యవేక్షించేందుకు ఈ్చజీడఇౌట్ట ఐవోఎస్ ఆప్‌ను కూడా ప్రయత్నించొచ్చు. వారం, నెలవారీ ఖర్చుల జాబితాలను చెక్ చేసుకోవచ్చు. కొత్త ప్రపంచాన్ని చూడటానికి trip advisor. హాలిడేలను సద్వినియోగం చేసుకొంటూ కొత్త ప్రపంచాన్ని చూడాలన్న కొత్త సంవత్సరపు తీర్మానాన్ని అమల్లో పెట్టడానికి ఈ అప్లికేషన్ సమాచారకోణంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి నేను హెల్దీఫుడ్ మాత్రమే తీసుకోవాలి... అని బలంగా తీర్మానించేసుకొన్న వారికోసం true food అప్లికేషన్. ఆహారంలోని న్యూట్రీషియన్ వ్యాల్యూలను లెక్కగట్టి ఉత్తమమైన ఆహార ప్రమాణాలను వివరిస్తుంది ఈ అప్లికేషన్. ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా విజ్ఞాన సంపదను పెంచుకోవాలని తపిస్తున్న వారి కోసం లెక్కలేనన్ని ఎడ్యుకేషనల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఐఓఎస్ వారి కోసం owl, how stuff works ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం quizcross, fit brains వంటి అప్లికేషన్ల ద్వారా మెదడుకు మేతను, విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. లక్ష్యం ఏదైనా... 'Lift' చేరుస్తుంది! : ఈ సంవత్సరం మీరు ఏం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా సరే.. ఆ లక్ష్యం చేరేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను గుర్తుచేస్తూ.. రోజూ ప్రేరణ అందిస్తూ.. పూర్తిచేసిన స్టెప్స్, మైలు రాళ్లను చూపిస్తూ.. లక్ష్యసాధనను పర్యవేక్షిస్తుంది. ధ్యానం, యోగా, వ్యాయామం, చదువుకోవడం, దురలవాటు మానడం.. లక్ష్యం ఏదైనా.. వాటి కోసం మీరు ఎంత మేరకు ప్రయత్నిస్తున్నారో ఈ ఆప్‌తో చెక్ చేసుకోవచ్చు. ఒకే తరహా లక్ష్యాలు పెట్టుకున్నవారు కొందరు కలిసి ఓ గ్రూపుగా కూడా ఏర్పడి పరస్పరం సూచనలు ఇచ్చుకునేందుకు కూడా ఈ ఆప్ తోడ్పడుతుంది. హెల్త్, ఫిట్నెస్, హ్యాపీనెస్, రిలేషన్షిప్స్ వంటివి మెరుగుపర్చుకునేందుకు కూడా ఉపయోగపడే ఈ ఆప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లపై పని చేస్తుంది. గూగుల్, ఆపిల్ స్టోర్ల నుంచి పొందొచ్చు. - హన్మిరెడ్డి యెద్దుల