ఫిట్స్‌తో గురుకుల పాఠశాల విద్యార్థి మృతి
Published Sat, Dec 24 2016 1:33 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
నరసాపురం : మండలంలోని ఎల్‌బీచర్ల గురుకుల పాఠశాల విద్యార్థి కాటూరి ఆనంద్(17) ఫిట్స్ వల్ల శుక్రవారం ఉదయం మరణించాడు. అతనికి సకాలంలో వైద్యం అందకే మరణించాడని ఆరోపిస్తూ.. నరసాపురం ప్రభుత్వాసుపత్రి వద్ద దళితసంఘాల నేతలు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, పాఠశాల ప్రిన్సిపాల్ బి.హెచ్‌ఆర్.కె.మూర్తి కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన ఆనంద్ రెండేళ్లుగా గురుకుల పాఠశాలలో ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటలకు లైట్లు వేయగానే, ఆనంద్ లైట్లు ఆర్పాలని పెద్దగా కేకలు వేశాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లి చూసేసరికే ఫిట్స్‌తో కొట్టుకుంటూ కోమాలోకి వెళ్లాడు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే సరికి అతను మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆనంద్‌కు సకాలంలో వైద్యం అందలేదని, అందుకే మృతి చెందాడని ఆరోపిస్తూ దళిత సంఘాల నేతలు దొండపాటి స్వాములు, ఇంజేటి జాన్‌కెనడీ, అడిదల శరత్, నక్కా ఆనంద్, ముస్కూడి రవి, బత్తుల దుర్గారావు తదితరులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీనికి స్పందించిన ప్రిన్సిపాల్ ఆనంద్‌కు ఫిట్స్ వస్తుంటాయని, పాఠశాలలో చేర్చుకున్నప్పుడే అతని తల్లిదండ్రులు తమకు అఫిడవిట్, లేఖ ఇచ్చారని చెప్పారు. మొత్తానికి ఆందోళనకారులకు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల అసోసియేషన్‌కు మధ్య చర్చలు జరగడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆనంద్ తండ్రి తిరుపతిరావు కూలిపనులు చేస్తుంటారు. తల్లి మరియమ్మ గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మృతితో వారిద్దరూ బోరున విలపిస్తున్నారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement