- -విద్యుదాఘాతంతో 14 ఏళ్ల బాలుడి మృతి
- -ముంగండ వాసంశెట్టివారిపలెంలో దుర్ఘటన
సెలవులకు వచ్చి.. లోకానికే సెలవంటూ..
Published Fri, May 12 2017 11:15 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పి.గన్నవరం :
వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని నగరం నుంచి పల్లెకు వచ్చిన ఆ బాలుడు.. విద్యుదాఘాతానికి గురై ఈ లోకానికే సెలవంటూ వెళ్లిపోయాడు. మండలంలోని ముంగండ శివారు వాసంశెట్టి వారిపాలెంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ విషాదం అయిన వారినీ, ఊరివారినీ శోకంలో ముంచింది. హైదరాబాద్ నుంచి సెలవులకు పెదనాన్న ఇంటికి వచ్చిన మామిడిశెట్టి దీపక్‌కుమార్ (14) డాబాపై ఆడుకుంఊ విద్యుత్ తీగలు తగిలి దుర్మరణం చెందాడు. వాసంశెట్టివారిపాలేనికి చెందిన మామిడిశెట్టి ఏడుకొండలు హైదరాబాద్ హైకోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కామేశ్వరి. కుమారుడు దీపక్‌కుమార్ 9వ తరగతి, , కుమార్తె హేమశ్రీ 6వ తరగతి చదువుతున్నారు. ఏడుకొండలు సోదరులు ముగ్గురూ ముంగండలోనే నివసిస్తున్నారు. ఏటా మాదిరే ఈనెల 8న కామేశ్వరి, ఇద్దరు పిల్లలు ముంగండ వచ్చారు. శుక్రవారం సాయంత్రం దీపక్ ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి పెదనాన్న ఇంటి ఎదురుగా ఉన్న డాబాపైకి ఎక్కి ఆడుకుంటుండగా పక్కగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. షాక్ గురై కాలిపోతున్న దీపక్‌ను చూసి తోటి పిల్లలు కేకలు వేయడంతో, పెదనాన్న కర్రతో తప్పించగా గోడపై పడిపోయాడు. కాళ్లు, మెడ భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో దీపక్ అక్కడికక్కడే మృరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై పి.వీరబాబు చెప్పారు. ‘దయ లేని దేవుడు మా ఇంటి దీపాన్ని ఆర్పేశా’డంటూ కామేశ్వరి బోరున విలపించింది. దీపక్ మృతదేహంపై పడి తల్లి, చెల్లెలు హేమశ్రీ గుండెలు అవిసేలా రోదించారు. ఈ దుర్ఘటనతో వాసంశెట్టివారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Advertisement
Advertisement