p.gannavaram
-
16న రెండో విడత నాడు-నేడు.. ప్రారంభించనున్న సీఎం జగన్
పి.గన్నవరం,మామిడికుదురు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపించి నాడు–నేడుకు సంబంధించిన విధి విధానాలతో పాటు సాఫ్ట్‌వేర్‌ను కూడా తీసుకెళ్లిందని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ‘నాడు–నేడు’ రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రులు సురేష్, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ బుధవారం పి.గన్నవరం వచ్చారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు -
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
సాక్షి, పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం చిరతపూడిలో సమస్యలపై ఎమ్మెల్యే పూలపర్తి నారాయణమూర్తిని స్థానిక మహిళలు నిలదీశారు. పదేళ్లుగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు లేవన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. మీరు ఓట్లేస్తేనే గెలిచామా అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో సమస్యలు చెప్తే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తాం మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో అధికార టీడీపీ నేతలు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సెలవులకు వచ్చి.. లోకానికే సెలవంటూ..
-విద్యుదాఘాతంతో 14 ఏళ్ల బాలుడి మృతి -ముంగండ వాసంశెట్టివారిపలెంలో దుర్ఘటన పి.గన్నవరం : వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని నగరం నుంచి పల్లెకు వచ్చిన ఆ బాలుడు.. విద్యుదాఘాతానికి గురై ఈ లోకానికే సెలవంటూ వెళ్లిపోయాడు. మండలంలోని ముంగండ శివారు వాసంశెట్టి వారిపాలెంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ విషాదం అయిన వారినీ, ఊరివారినీ శోకంలో ముంచింది. హైదరాబాద్ నుంచి సెలవులకు పెదనాన్న ఇంటికి వచ్చిన మామిడిశెట్టి దీపక్‌కుమార్ (14) డాబాపై ఆడుకుంఊ విద్యుత్ తీగలు తగిలి దుర్మరణం చెందాడు. వాసంశెట్టివారిపాలేనికి చెందిన మామిడిశెట్టి ఏడుకొండలు హైదరాబాద్ హైకోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కామేశ్వరి. కుమారుడు దీపక్‌కుమార్ 9వ తరగతి, , కుమార్తె హేమశ్రీ 6వ తరగతి చదువుతున్నారు. ఏడుకొండలు సోదరులు ముగ్గురూ ముంగండలోనే నివసిస్తున్నారు. ఏటా మాదిరే ఈనెల 8న కామేశ్వరి, ఇద్దరు పిల్లలు ముంగండ వచ్చారు. శుక్రవారం సాయంత్రం దీపక్ ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి పెదనాన్న ఇంటి ఎదురుగా ఉన్న డాబాపైకి ఎక్కి ఆడుకుంటుండగా పక్కగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. షాక్ గురై కాలిపోతున్న దీపక్‌ను చూసి తోటి పిల్లలు కేకలు వేయడంతో, పెదనాన్న కర్రతో తప్పించగా గోడపై పడిపోయాడు. కాళ్లు, మెడ భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో దీపక్ అక్కడికక్కడే మృరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై పి.వీరబాబు చెప్పారు. ‘దయ లేని దేవుడు మా ఇంటి దీపాన్ని ఆర్పేశా’డంటూ కామేశ్వరి బోరున విలపించింది. దీపక్ మృతదేహంపై పడి తల్లి, చెల్లెలు హేమశ్రీ గుండెలు అవిసేలా రోదించారు. ఈ దుర్ఘటనతో వాసంశెట్టివారిపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
యువతి కిడ్నాప్.. ఐదుగురిపై కేసు నమోదు
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వాడ్రేవుపల్లి గ్రామంలో 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పి.వీరబాబు కథనం ప్రకారం.. ఈ నెల 23న వాడ్రేవుపల్లికి చెందిన ఎస్.సత్యనారాయణ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పరిసర గ్రామాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో యువతి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానేపల్లి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తన కుమార్తెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని, అతడికి మరో నలుగురు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిందితుడు దుర్గాప్రసాద్‌తో పాటు, మరో నలుగురిపై శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు వివరించారు. -
నేడు వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
పి.గన్నవరంలో బహిరంగ సభ, కన్నబాబు రాక పి.గన్నవరం : పి.గన్నవరంలో మంగళవారం సాయంత్రం జరుగనున్న బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో భారీగా చేరనున్నారని పార్టీ కోఆరి్డనేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు వెల్లడించారు. స్థానిక గణపతి గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక ఏర్పాట్లను సోమవారం సాయంత్రం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన పి.గన్నవరం మండల నాయకులు ఉలిశెట్టి బాబీ, పిల్లి శ్రీనుల నాయకత్వంలో కొండేటి ఆధ్వర్యంలో 600 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారని మోహనరావు చెప్పారు. తొలుత మధ్యాహ్నం 3 గంటలకు అంబాజీపేట నుంచి పి.గన్నవరం అక్విడెక్టు వరకూ మోటారు సైకిలు ర్యాలీ జరుగు తుందన్నారు. అక్కడ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో పాటు, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ చేరికలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. మిగిలిన మూడు మండలాల్లో కూడా ఇదే రీతిలో చేరికలు ఉంటాయని కొండేటి చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేసారు. మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర రావు, వాసంశెట్టి చినబాబు, రాష్ట్ర నాయకులు మెల్లం మహలక్ష్మీ ప్రసాద్, పేరి శ్రీనివాస్, జిల్లా నాయకులు దొమ్మేటి వెంకట శివరామన్, తోలేటి బంగారునాయుడు తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. -
‘కార్యకర్తల అభీష్టం మేరకే వైఎస్ఆర్ సీపీలోకి’
హైదరాబాద్ : రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి అన్నారు. ఆమె శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వరీదేవి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడంతో తమ కార్యకర్తలంతా మనస్తాపం చెందారన్నారు. వారిందరు తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని కోరారని, వారి మనోభావాలకు అనుగుణంగా పార్టీలో చేరినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రాజేశ్వరీదేవి తెలిపారు. ఆమెతో పాటు పలువురు వైఎస్ఆర్ సీపీలో చేరారు. -
వైఎస్ఆర్ సీపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాజేశ్వరీదేవి తన అనుచరవర్గంతో కలిసి పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి రాజేశ్వరీదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
సీతమ్మకు చేయించే స్వీటెస్ట్ ఫలములు
రామయ్య తరఫున ‘కోవా’ సారె సిద్ధం కల్యాణ మహోత్సవంలో సీతమ్మకు సమర్పణ ఎనిమిదేళ్లుగా సత్యవాణి, భీమరాజు దంపతుల ఆధ్వర్యంలో ‘కంత’ తయారీ పి.గన్నవరం : శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల కోసం పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి, భీమరాజు దంపతులు కోవా స్వీట్‌తో తయారు చేయిస్తున్న ‘సారె’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక వైనతేయ నది ఒడ్డున ఉన్న పట్టాభిరాముని ఆలయంలో బుధవారం సీతాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణంలో సీతమ్మకు రామయ్య తరఫున సారెను, నూతన వస్త్రాలను భీమరాజు దంపతులు అందజేస్తారు. కోవాతో తయారు చేసే ఈ సారెను ‘కంత’ అని పిలుస్తారు. సుమారు ఐదున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన పట్టాభిరాముడి ఆలయంలో నాటి సర్పంచ్ దివంగత పేరిచర్ల సుబ్బరాజు సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఏటా నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో ఏటా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా కోవా ‘కంత’ను సీతమ్మకు సమర్పిస్తారు. ఈ సారెను పది రోజుల మందు నుంచి కోవాతో తయారు చేస్తారు. కోవాతో వివిధ రకాల ఫలాలు, కూరగాయల ఆకారాల్లో స్వీట్లను తయారు చేస్తారు. సీతారాములకు సమర్పించే పట్టు వస్త్రాల ఆకారంలో సారెను సిద్ధం చేస్తున్నారు. అలాగే, వివిధ రకాల పిండి వంటలను సైతం తయారు చేసి కల్యాణం సందర్భంగా భీమరాజు దంపతులు సీతమ్మకు సమర్పిస్తున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఈ ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం.. సీతారాముల కల్యాణంలో భాగంగా శ్రీరాముని తరఫున సీతమ్మకు కోవాతో కంత సారెను తయారు చేసి సమర్పించే అవకాశం దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎనిమిదేళ్లుగా భక్తి శ్రద్ధలతో సారెను సీతమ్మకు సమర్పిస్తున్నాం. కల్యాణానికి పది రోజుల మందు నుంచి కోవాతో స్వీట్లను తయారు చేస్తున్నాం. – పేరిచర్ల సత్యవాణి ఏటా ఘనంగా కల్యాణం పట్టాభిరామ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించినప్పటి నుంచి ఏటా కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. కల్యాణంలో భాగంగా 80 నుంచి 100 రకాల స్వీట్లతో సీతమ్మకు సారె సమర్పిస్తున్నాం. కన్నుల పండువగా జరిగే స్వామి కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. – పేరిచర్ల సూర్య మాణిక్యం -
టీడీపీ అవినీతిపై చర్చకు సిద్ధం
ఆ పార్టీ నేతలకు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కొండేటి సవాల్ పి.గన్నవరం : టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై మండలంలో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. మంగళవారం పి.గన్నవరంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో అవినీతి హెచ్చు మీరిపోయిందన్నారు. పి.గన్నవరంలో ఇళ్ల స్ధలాలను రూ.30 వేల వంతున టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని కొండేటి ధ్వజమెత్తారు. ఈ అంశంపై అధికారులు విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాలను టీడీపీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని అన్నారు. దశాబ్ధాల తరబడి దేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు సైతం వైఎస్సార్ సీపీలో చేరుతుండడంతో భరించలేని ఆ పార్టీ నాయకులు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మండలశాఖ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
పి.గన్నవరంలో కాపు నేతల ర్యాలీ, ధర్నా
పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం పట్టణంలో గురువారం ఉదయం కాపు నేతలు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మూడు రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. కాపు నాయకుడు ముద్రగడ చేస్తున్న దీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు
పి. గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని పి.గన్నవరం మండలంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని కె.ముంజవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(38 ) ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతయ్యాడు. దీంతో బాధితుడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: జగన్
పి.గన్నవరం: దివంగత మహానేత వైఎస్ఆర్ సువర్ణ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు భయానక పాలన సాగేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. అప్పుడు ప్రజలు ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం పరిగెత్తిన రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఏ ఒక్కరోజూ సీఎం హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోలేదన్నారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో కూడా చంద్రబాబు తెలుసుకోలేదని చెప్పారు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ భయానక రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు. విశ్వసనీయత,నిజాయతీలకు అర్థం తెలినీ రోజులవని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనేంటన్న రీతిలో చంద్రబాబు మాట మారుస్తారని విమర్శించారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలుగా పట్టపగలే అబద్ధాలు ఆడుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ దేముడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చంద్రబాబు చేయలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.