ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: జగన్
పి.గన్నవరం: దివంగత మహానేత వైఎస్ఆర్ సువర్ణ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు భయానక పాలన సాగేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. అప్పుడు ప్రజలు ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం పరిగెత్తిన రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఏ ఒక్కరోజూ సీఎం హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోలేదన్నారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో కూడా చంద్రబాబు తెలుసుకోలేదని చెప్పారు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ భయానక రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు.
విశ్వసనీయత,నిజాయతీలకు అర్థం తెలినీ రోజులవని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనేంటన్న రీతిలో చంద్రబాబు మాట మారుస్తారని విమర్శించారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలుగా పట్టపగలే అబద్ధాలు ఆడుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ దేముడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చంద్రబాబు చేయలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.