విశాఖకు అమ్మ అవసరముంది: వైఎస్ జగన్
విశాఖపట్నం: అమ్మలాంటి మంచి మనషిని ఎవర్నీ చూడలేదని, విశాఖపట్నానికి అమ్మ అవసరం ఎంతో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగిన వైఎస్ఆర్ జనభేరిలో జగన్ ప్రసంగిస్తూ.. అమ్మ ఏదైనా పట్టుకుంటే సాధించేకా వదిలిపెట్టరని అన్నారు. ఈ సభలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
గుజరాత్‌ను తలదన్నేలా పోటీ పడుతూ విశాఖను అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశాఖకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ఐటీ, ఎయిర్‌పోర్టు అభివృద్ది, ఆరు వేల కోట్లతో బీఆర్‌టీ అభివృద్ధి, అపెరల్ పార్క్ గురించి వివరించారు. విశాఖను బంగారు నగరంగా మార్చాలంటే కాలుష్యాన్ని నిర్మూలించాలని, గ్రీన్ సిటీగా చేస్తానని జగన్ చెప్పారు. విశ్వసనీయతకు ఓటు వేయాలని, రాజన్న సువర్ణయుగం తెచ్చుకుందామని వైఎస్ జగన్ కోరారు.
దివంగత మహానేత వైఎస్ఆర్ సువర్ణ పాలనకు ముందు చంద్రబాబు నాయుడు భయానక పాలన సాగేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. అప్పుడు ప్రజలు ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం పరిగెత్తిన రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అంతకుముందు జరిగిన వైఎస్ఆర్ జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఏ ఒక్కరోజూ సీఎం హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోలేదన్నారు. చదువుల కోసం విద్యార్థులు ఎన్నెన్నిఅవస్థలు పడుతున్నారో కూడా చంద్రబాబు తెలుసుకోలేదని చెప్పారు. ఆయన పరిపాలిస్తున్న రోజుల్లో పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఆ భయానక రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు.
విశ్వసనీయత,నిజాయతీలకు అర్థం తెలినీ రోజులవని జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనేంటన్న రీతిలో చంద్రబాబు మాట మారుస్తారని విమర్శించారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతుంటే చంద్రబాబు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం కోసం చంద్రబాబు అడ్డగోలుగా పట్టపగలే అబద్ధాలు ఆడుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ దేముడెరుగు కనీసం వడ్డీ మాఫీ కూడా చంద్రబాబు చేయలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.