సీతమ్మకు చేయించే స్వీటెస్ట్ ఫలములు
Published Mon, Apr 3 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
రామయ్య తరఫున ‘కోవా’ సారె సిద్ధం
కల్యాణ మహోత్సవంలో సీతమ్మకు సమర్పణ
ఎనిమిదేళ్లుగా సత్యవాణి, భీమరాజు దంపతుల ఆధ్వర్యంలో ‘కంత’ తయారీ
పి.గన్నవరం :
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల కోసం పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి, భీమరాజు దంపతులు కోవా స్వీట్‌తో తయారు చేయిస్తున్న ‘సారె’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక వైనతేయ నది ఒడ్డున ఉన్న పట్టాభిరాముని ఆలయంలో బుధవారం సీతాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణంలో సీతమ్మకు రామయ్య తరఫున సారెను, నూతన వస్త్రాలను భీమరాజు దంపతులు అందజేస్తారు. కోవాతో తయారు చేసే ఈ సారెను ‘కంత’ అని పిలుస్తారు.
సుమారు ఐదున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన పట్టాభిరాముడి ఆలయంలో నాటి సర్పంచ్ దివంగత పేరిచర్ల సుబ్బరాజు సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఏటా నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో ఏటా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా కోవా ‘కంత’ను సీతమ్మకు సమర్పిస్తారు. ఈ సారెను పది రోజుల మందు నుంచి కోవాతో తయారు చేస్తారు. కోవాతో వివిధ రకాల ఫలాలు, కూరగాయల ఆకారాల్లో స్వీట్లను తయారు చేస్తారు. సీతారాములకు సమర్పించే పట్టు వస్త్రాల ఆకారంలో సారెను సిద్ధం చేస్తున్నారు. అలాగే, వివిధ రకాల పిండి వంటలను సైతం తయారు చేసి కల్యాణం సందర్భంగా భీమరాజు దంపతులు సీతమ్మకు సమర్పిస్తున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఈ ప్రసాదాలను పంపిణీ చేస్తారు.
ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం..
సీతారాముల కల్యాణంలో భాగంగా శ్రీరాముని తరఫున సీతమ్మకు కోవాతో కంత సారెను తయారు చేసి సమర్పించే అవకాశం దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎనిమిదేళ్లుగా భక్తి శ్రద్ధలతో సారెను సీతమ్మకు సమర్పిస్తున్నాం. కల్యాణానికి పది రోజుల మందు నుంచి కోవాతో స్వీట్లను తయారు చేస్తున్నాం.
– పేరిచర్ల సత్యవాణి
ఏటా ఘనంగా కల్యాణం
పట్టాభిరామ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించినప్పటి నుంచి ఏటా కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. కల్యాణంలో భాగంగా 80 నుంచి 100 రకాల స్వీట్లతో సీతమ్మకు సారె సమర్పిస్తున్నాం. కన్నుల పండువగా జరిగే స్వామి కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
– పేరిచర్ల సూర్య మాణిక్యం
Advertisement
Advertisement