sare
-
గోదారోళ్లా.. మజాకా.. సారె కింద ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు
సాక్షి, తూర్పుగోదావరి: సాధారణంగా ఆడపిల్లకు పుట్టింటి నుంచి సారె పంపడం ఆనవాయితీ. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో ఆషాడం, శ్రావణం సారె కావిళ్లు ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటి. ఈ క్రమంలో గత నెలలో యానంలో అల్లుడికి మామగారు పంపిన ఆషాఢం సారె రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్‌కు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది. ఆషాఢమాసం సందర్భంగా మామ బత్తుల బలరామకృష్ణ.. అల్లుడు పవన్ కుమార్ ఇంటికి సారె కావిళ్ళను పంపించాడు. ఆ సారెను చూసి అల్లుడింటి వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అవాక్కయ్యారు. అల్లుడికి.. బలరామకృష్ణ ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, పండు గొప్పలు, రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం కోడి పుంజులు, వెయ్యి కిలోల కాయగూరలు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల ఆవకాయ జాడీలు, 50 రకాల స్వీట్లు పంపించారు. అత్తింటివారి నుంచి వచ్చిన ఈ ఆషాఢం సారె కావిళ్ళు ఊరేగింపుగా పవన్ కుమార్ ఇంటికి తీసుకువచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా వచ్చిన ఈ సారె కావిళ్లు అందర్ని ఆశ్చర్య పరచడమే కాక ఈ రెండు కుటుంబాల గురించి తెగ చర్చించారు. ఇక ఆడపిల్లవారు అంత భారీగా సారే పంపిస్తే.. తాము ఎందుకు తగ్గాలి అనుకున్న మగపిల్లాడి తరుఫువారు శ్రావణ సారెలో భాగంగా ఏకంగా 10 వేల కేజీల స్వీట్లు కావిడి పంపించారు. వాటితో పాటు భారీ మొత్తంలో అరటి గెలలను కూడా పంపించారు. వీటన్నింటిని 5 వాహనాల్లో మామ బత్తుల బలరామకృష్ణ ఇంటికి పంపించాడు పవన్ కుమార్. వీరి సారె సందడి చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. -
చీర సరే.. మరి ఆ బ్యాగ్ ధర చెప్పరేం..!?
హీరోయిన్లు ధరించే దుస్తుల పట్ల అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే వారు బయటికొచ్చినప్పుడు కళ్లు చెదిరే ఖరీదైన దుస్తుల్లోనే కనిపిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ధరించిన ఓ చీర గురించి ఇంటర్నెట్లో చర్చ ప్రారంభమయ్యింది. ఎందుకంటే కంగనా కట్టుకుంది కేవలం రూ.600 విలువ చేసే ఓ చేనేత చీర కావడం ఇక్కడ విశేషం. ఈ క్రమంలో కంగనా సోదరి రంగోలి ‘ఈ చీరను కంగన కోల్‌కతాలో రూ.600కు కొన్నది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడింది’ అంటూ ట్వీట్ చేసింది. దాంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. అయితే రంగోలి ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆమె ధరించిన చీర ఖరీదు రూ.600 సరే బాగానే ఉంది. మరి ఆమె చేతిలో పట్టుకున్న ప్రాడా హ్యాండ్ బ్యాగ్ 2-3లక్షల రూపాయల ఖరీదు చేస్తుంది. సన్ గ్లాసెస్, చెప్పులు అన్నింటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మీరు మాత్రం కేవలం చీర గురించే గొప్పగా చెప్తున్నారు. ఏది ఏమైనా మీ ప్రచారం కూడా చాలా అమూల్యమైనదే’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
సీతమ్మకు చేయించే స్వీటెస్ట్ ఫలములు
రామయ్య తరఫున ‘కోవా’ సారె సిద్ధం కల్యాణ మహోత్సవంలో సీతమ్మకు సమర్పణ ఎనిమిదేళ్లుగా సత్యవాణి, భీమరాజు దంపతుల ఆధ్వర్యంలో ‘కంత’ తయారీ పి.గన్నవరం : శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల కోసం పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి, భీమరాజు దంపతులు కోవా స్వీట్‌తో తయారు చేయిస్తున్న ‘సారె’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక వైనతేయ నది ఒడ్డున ఉన్న పట్టాభిరాముని ఆలయంలో బుధవారం సీతాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణంలో సీతమ్మకు రామయ్య తరఫున సారెను, నూతన వస్త్రాలను భీమరాజు దంపతులు అందజేస్తారు. కోవాతో తయారు చేసే ఈ సారెను ‘కంత’ అని పిలుస్తారు. సుమారు ఐదున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన పట్టాభిరాముడి ఆలయంలో నాటి సర్పంచ్ దివంగత పేరిచర్ల సుబ్బరాజు సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఏటా నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆలయ ధర్మకర్తలు భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యంలో ఏటా సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా కోవా ‘కంత’ను సీతమ్మకు సమర్పిస్తారు. ఈ సారెను పది రోజుల మందు నుంచి కోవాతో తయారు చేస్తారు. కోవాతో వివిధ రకాల ఫలాలు, కూరగాయల ఆకారాల్లో స్వీట్లను తయారు చేస్తారు. సీతారాములకు సమర్పించే పట్టు వస్త్రాల ఆకారంలో సారెను సిద్ధం చేస్తున్నారు. అలాగే, వివిధ రకాల పిండి వంటలను సైతం తయారు చేసి కల్యాణం సందర్భంగా భీమరాజు దంపతులు సీతమ్మకు సమర్పిస్తున్నారు. స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఈ ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం.. సీతారాముల కల్యాణంలో భాగంగా శ్రీరాముని తరఫున సీతమ్మకు కోవాతో కంత సారెను తయారు చేసి సమర్పించే అవకాశం దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎనిమిదేళ్లుగా భక్తి శ్రద్ధలతో సారెను సీతమ్మకు సమర్పిస్తున్నాం. కల్యాణానికి పది రోజుల మందు నుంచి కోవాతో స్వీట్లను తయారు చేస్తున్నాం. – పేరిచర్ల సత్యవాణి ఏటా ఘనంగా కల్యాణం పట్టాభిరామ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించినప్పటి నుంచి ఏటా కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. కల్యాణంలో భాగంగా 80 నుంచి 100 రకాల స్వీట్లతో సీతమ్మకు సారె సమర్పిస్తున్నాం. కన్నుల పండువగా జరిగే స్వామి కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. – పేరిచర్ల సూర్య మాణిక్యం -
గుండుగొలను భ్రమరాంబ అమ్మవారికి సారె
పిఠాపురం : పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి పిఠాపురం పాదగయ క్షేత్రంలో వేంచేసియున్న పురూహూతికా అమ్మవారి సారె సమర్పించినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. గుండుగొలను భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో ఐదు రోజులుగా జరుగుతున్న కోటి కుంకుమార్చనకు అమ్మవారి శక్తి పీఠాల నుంచి సారెలు పంపుతుండగా, ఐదో రోజు ఇక్కడి నుంచి సారె సమర్పించినట్టు చెప్పారు. దేవస్థానం తరపున పసుపు, కుంకుమ చీరలను భ్రమరాంభ అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేయించినట్టు ఆయన తెలిపారు. -
కృష్ణమ్మకు వెంకన్న సారె
– తిరుమల నుంచి∙పుష్కర యాత్ర ప్రారంభం – కల్యాణరథంలో తరలివెళ్లిన ఉత్సవమూర్తులు సాక్షి, తిరుమల: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సారె తరలి వెళ్లింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో కూడిన కల్యాణరథంలో బుధవారం ఈ సారె పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. తొలుత ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి ముందు పూజలు నిర్వహించారు. తర్వాత పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలతోకూడిన సారెను ఆలయం నుంచి వెలుపల వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పతో కూడిన కల్యాణ రథంలో సారెను ఉంచి విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయానికి పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ, కృష్ణా పుష్కరాలు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో నమూనా ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు, అన్నప్రసదాలు పంపిణీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజు స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లి, పుష్కర హారతి ఇస్తారని అన్నారు. ఈ కళ్యాణరథం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయం, అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది. 4వ తేది అహోబిలం నుంచి∙ప్రారంభమై మహానంది ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం, 5న శ్రీశైలం నుంచి ప్రారంభమై మంగళగిరిలోని పానకాల నరసింహస్వామివారి ఆలయం, అమరావతిలోని అమరేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది.