కృష్ణమ్మకు వెంకన్న సారె | venkanna present sare to krishna | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మకు వెంకన్న సారె

Published Wed, Aug 3 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

సారెతో టీటీడీ చైర్మన్‌ చదలవాడ, ఈవో సాంబశివరావు, తదితరులు

సారెతో టీటీడీ చైర్మన్‌ చదలవాడ, ఈవో సాంబశివరావు, తదితరులు

– తిరుమల నుంచి∙పుష్కర యాత్ర ప్రారంభం
– కల్యాణరథంలో తరలివెళ్లిన ఉత్సవమూర్తులు
 
సాక్షి, తిరుమల:  కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సారె తరలి వెళ్లింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో కూడిన కల్యాణరథంలో బుధవారం ఈ సారె పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. తొలుత ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి ముందు పూజలు నిర్వహించారు. తర్వాత పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలతోకూడిన సారెను ఆలయం నుంచి వెలుపల  వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పతో కూడిన కల్యాణ రథంలో సారెను ఉంచి  విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయానికి పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ  చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ,  కృష్ణా పుష్కరాలు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో  నమూనా ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.  ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు, అన్నప్రసదాలు పంపిణీ చేసేందుకు భారీ  ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజు స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లి, పుష్కర హారతి ఇస్తారని అన్నారు. ఈ కళ్యాణరథం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయం, అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది.  4వ తేది అహోబిలం నుంచి∙ప్రారంభమై మహానంది ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం, 5న శ్రీశైలం నుంచి ప్రారంభమై మంగళగిరిలోని పానకాల నరసింహస్వామివారి ఆలయం, అమరావతిలోని అమరేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement