
గాయపడిన వరుడిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నూతన వరుడు, మరో ఇద్దరు తీవ్రంగా, వధువు, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరవల్లి పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని పిప్పరలో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
అంపాపురం సమీపంలోని పతంజలి పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో కారు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో కారు అదుపుతప్పి వేగంగా రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. వరుడు కె.శివకుమార్, ఆయన తల్లి సీతారావమ్మ, డ్రైవర్ సుమంత్ తీవ్రంగా గాయపడ్డారు. వధువు రేణుక, మరో బంధువు గాయత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు, హైవే రోడ్ సేఫ్టీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment