పొలంలో ఉన్న చెత్తను తగులబెట్టేందుకు యత్నించిన ఓ రైతు మూర్ఛ రావటంతో మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు.
నూజెండ్ల: పొలంలో ఉన్న చెత్తను తగులబెట్టేందుకు యత్నించిన ఓ రైతు మూర్ఛ రావటంతో మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం పెద్దారం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కామసాని అమరలింగయ్య(35)కు అప్పుడప్పుడు మూర్ఛ వస్తుంటుంది. శనివారం పొలాన్ని సాగుకు సిద్ధం చేసుకునే క్రమంలో అందులో ఉన్న కందికట్టెకు నిప్పుపెట్టాడు.
అయితే, అక్కడే నిలబడి నిప్పు ఎగదోస్తున్న క్రమంలో అమరలింగయ్యకు ఫిట్స్ వచ్చాయి. దీంతో అకస్మాత్తుగా మంటల్లో పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అక్కడికి చేరుకుని మంటల్లో నుంచి బయటకు లాగారు. అయితే, అప్పటికే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు 108కు ఫోన్ చేసి వినుకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.