అరసవల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో కొత్త ఓటర్లుగా నమోదైన వారికి స్మార్ట్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. ఆదివారం ఆయన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బినామీ, డూప్లికేషన్ ఓట్లను తొలగించిన అనంతరం రాష్ట్రంలో కొత్తగా చేరిన ఓట్లు 72 లక్షలు అని వెల్లడించారు.
కొత్తవారితోపాటు పాత ఓటర్లకు కూడా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 900 ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ప్రత్యేకంగా ప్రింటర్లు ఏర్పాటు చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు. ఒక్కో కార్డుకు రూ.25 చొప్పున వసూలు చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 36 లక్షల మంది బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించామన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్‌గా సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.